విధాత: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాయి. అధికారిక బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అంటుంటే.. కాంగ్రెస్, బీజేపీలు వచ్చే ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చని అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు లేవంటే జరుగుతాయనే భావించాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు శ్రేణులకు సూచిస్తున్నారు.
దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ జాబితా బీఆర్ఎస్లోనే ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే సిట్టింగ్‌లందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ లోక్‌సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని, రాష్ట్రంలో అయితేనే కీలక పదవులు పొందవచ్చునని కొందరు ఎంపీలు ఆలోచిస్తున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. ప్రతి కార్యక్రమానికి ఎమ్మెల్యేలపై ఆధారపడాల్సి రావడం, బీఆర్ఎస్ అధినేత కూడా ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎమ్మెల్యేల నియోజకవవర్గాల్లో తలదూర్చవద్దనడం ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికే రాజకీయంగా లబ్ధి చేకూరుస్తున్నాయనే వాదనలు మరికొందరు వినిపిస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం 9 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక, మహబూబాబాద్ ఎంపీ ఎంపీగా మరోసారి పోటీకి సిద్ధమంటూనే ములుగు శాసనసభ స్థానంపై దృష్టి సారించారు. అలాగే వరంగల్ ఎంపీ దయాకర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా వెళ్లాలనుకుంటున్నారట. మైనంపల్లి హనుమంతరావు అవకాశం వస్తే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయయడానికి సుముఖత చూపుతున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్లో ఇలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ కి పోటీ చేస్తానని, ఏ పార్టీ అనేది ఎన్నికలకు ముందు చెబుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరోసారి హుజూర్నగర్ నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ మళ్లీ కొడంగల్ నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇక బీజేపీ కి నలుగురు ఎంపీలు ఉండగా వారిలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేములవాడ లేదా కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆర్మూర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట. కిషన్‌రెడ్డి అంబర్‌పేట నుంచి మరోసారి పోటీ చేస్తారని కాషాయ పార్టీలో చర్చ జరుగుతున్నది.
చాలామంది పార్లమెంటు బాట వీడి అసెంబ్లీవైపు చూడటానికి కారణాలు అనేకం ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదంటే మాది అని అధికార పార్టీ మొదలు కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. అలాగే ఏ పార్టీ ఏకపక్షంగా గెలిచే అవకాశాలు ఉండక పోవచ్చనే అంచనాల్లో పార్టీల అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఒకవేళ అసెంబ్లీకి ఎన్నికైతే కాలం కలిసి వస్తే కీలక పదవులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. అందుకే మెజారిటీ ఎంపీలు లోక్‌సభ కంటే అసెంబ్లీనే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.