Sunday, December 4, 2022
More
  Homelatestముంద‌స్తుకు కేసీఆర్‌?.. అసెంబ్లీని ర‌ద్దు చేస్తే!

  ముంద‌స్తుకు కేసీఆర్‌?.. అసెంబ్లీని ర‌ద్దు చేస్తే!

  • రేపు టీఆర్ఎస్ఎల్‌పీ, పార్ల‌మెంట‌రీ సంయుక్త స‌మావేశం
  • పార్టీని ఎన్నిక‌ల‌కు సంసిద్ధం చేసే దిశ‌గా చ‌ర్చ‌లు
  • మునుగోడు అనుభ‌వంతో అడుగులు

  విధాత: రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ శాస‌న‌స‌భ ప‌క్షం(ఎమ్మెల్యేలు), పార్ల‌మెంట‌రీ పార్టీ (ఎంపీలు), పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గంతో కూడిన‌ సంయుక్త స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు సోమ‌వారం ప్ర‌క‌టించారు. సీఎం కేసీఆర్ అత్య‌వ‌స‌రంగా ఈ స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల‌లో తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది.

  ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్ స‌భ‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంటారా? అన్న‌ అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల‌లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా పార్టీ మొత్తం గ్రామస్థాయి వ‌ర‌కు సంసిద్ధం చేయ‌డం కోస‌మే ఈ స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే టీఆర్ ఎస్ సిద్ధం అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

  బీజేపీ తీరుపై..

  మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోయినా టీఆర్ఎస్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. అతి క‌ష్టం మీద క‌మ్యూనిస్టుల మ‌ద్ద‌తుతో 10 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచింది. సాంకేతికంగా తాము ఓడిపోయినా నైతికంగా తాము గెలిచిన‌ట్లేన‌ని బీజేపీ భావిస్తోంది. మునుగోడు ఫ‌లితాల‌పై అంత‌ర్గ‌తంగా టీఆర్ఎస్ తీవ్ర మ‌ధ‌న ప‌డుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫ‌లితాల త‌రువాత టీఆర్ ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం తామేన‌ని బీజేపీ అంటున్న‌ది. మ‌రో వైపు టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను కొనుగోలు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వాన్ని కూల్చే కుట్ర‌కు పాల్ప‌డుతుంద‌న్న అభిప్రాయం తెలంగాణవాదుల్లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

  విప‌క్షాలు బ‌ల‌ప‌డే లోగా..

  దారి ఏదైనా స‌రే ప్ర‌భుత్వాన్నిప‌డ‌గొట్టి అధికారం చేప‌ట్టాల‌న్న బీజేపీ య‌త్నాల‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్న టీఆర్ ఎస్ ముంద‌స్తుకు వెళ్లాల‌ని సీఎం కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. మునుగోడు ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషించుకున్న టీఆర్ఎస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు వెళ్లాల‌ని భావిస్తోంది. బీజేపీ ఎంత గ‌ట్టి పోటీ ఇచ్చినా మునుగోడులో ఏవిధంగా ప్ర‌చారం నిర్వ‌హించి గెలిచిందో అదే తీరుగా ఎన్నిక‌లు ఎప్ప‌డు వ‌చ్చినా.. సిద్ధంగా ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకునే అంశంపై స‌మావేశంలో చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  క‌ర్ణాట‌క‌తో పాటుగా…

  వ‌చ్చే ఏడాది మేలో క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. క‌ర్ణాట‌క‌తో పాటు ఎన్నిక‌లకు వెళ్తే ఎలా ఉంటుంద‌న్న అంశంపై స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్తాయి. ఈ మేర‌కు ముందస్తుగా వెళ్లాలంటే అంసెంబ్లీని ర‌ద్దు చేయాల్సి ఉంటుంది.

  అసెంబ్లీని ర‌ద్దు చేస్తే..

  స‌భ‌ను ర‌ద్దు చేసిన త‌రువాత బీజేపీ ఎన్నిక‌లు జ‌రుగ‌నిస్తుందా? లేదా రాష్ట్ర ప‌తి పాల‌న విధిస్తుందా? అన్న సందేహాలు రాజ‌కీయ వ‌ర్గాల‌లో వ్య‌క్తం అవుతున్నాయి. ఈ అంశంపై కూడా స‌మాలోచ‌న‌లు చేసే అవ‌కాశం ఉంటుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. అయితే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. వెళ్ల‌కపోయినా.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. యావ‌త్ పార్టీ యంత్రాంగాన్ని గ్రామ స్థాయి వ‌ర‌కు సంసిద్ధం చేయ‌డానికే సీఎం కేసీఆర్ ఈ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న‌ది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page