Wednesday, December 7, 2022
More
  Homelatestమునుగోడులో యుద్ధం పూర్తి కాలేదు: రాజగోపాల్ రెడ్డి

  మునుగోడులో యుద్ధం పూర్తి కాలేదు: రాజగోపాల్ రెడ్డి

  విధాత, మునుగోడు ఉప ఎన్నికల్లో మొదలైన ధర్మ యుద్ధం పూర్తి కాలేదని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మునుగుడు మండలంలో విలేకరులతో మాట్లాడుతూ దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మునుగోడు యుద్ధాన్ని అధర్మ యుద్ధంగా మార్చిందని, అధికార దుర్వినియోగంతో సాంకేతికంగా టీఆర్ఎస్ గెలిచినప్పటికీ ప్రజలు నన్ను నైతికంగా గెలిపించారన్నారు.

  రాజీనామాతో ఉప ఎన్నికల్లో పోరాడిన నా నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాతోపాటు ఎంతో మంది నడిచారని, పోలీసులు టిఆర్ఎస్ గుండాలదౌర్జన్యాలను సహించి, ప్రలోభాలను తిప్పికొట్టినా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి నాయకునికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మునుగోడు ఉప ఎన్నిక జరిగగిందన్నారు. 150 మంది ప్రజాప్రతినిధులు గ్రామానికి ఒకరు చొప్పున వచ్చి ఓటర్లపై ఒత్తిడి తెచ్చి స్వల్ప మెజారిటీతో గెలిచారని, అయినా రాజగోపాల్ నైతికంగా రెడ్డి గెలిచాడని సమాజం భావిస్తుందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో మరో ధర్మ యుద్ధం రాబోతోందని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

  ఓటమితో భయపడి ఇంట్లో కూర్చునే ప్రసక్తి లేదని ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ చెప్పిన అభివృద్ధి పనులు చేయకపోతే నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా పోరాడుతామన్నారు. ఉన్నతాధికారులు అధికార పార్టీకి వత్తాసు పలికినా కింది స్థాయి పోలీసులు, సిబ్బంది తన గెలుపును కోరుకున్నారన్నారు.

  మళ్లీ ఎన్నికల్లో 100% మునుగోడు నుండే పోటీ చేస్తానని, ఇక్కడే ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తెలంగాణలో నెంబర్ వన్‌గా చేసేంత వరకు శ్రమిస్తానన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గొల్ల కురుమ సోదరులకు 7600 మందికి 1,58,000 చొప్పున వెంటనే వారికి నగదు బదిలీ చేయాలని, ప్రభుత్వం వారిని మళ్లీ గొర్ల పంపిణీ పేరుతో మోసం చేస్తేసహించేది లేదని, దీనిపై ఈ నెల 14న నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో గొల్ల కురుమ సోదరులతో ఆందోళన నిర్వహిస్తామన్నారు.

  ఎన్నికల్లో ప్రచారం చేసిన మేరకు ప్రభుత్వం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి, ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, చండూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోతే ప్రజాపోరాటాలు చేపడుతామమన్నారు. ప్రభుత్వానికి మునుగోడు నియోజకవర్గ ప్రజల తాగు సాగు నీటి వసతులపై చిత్తశుద్ధి ఉంటే ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసి మునుగోడు మండలంలోని 50 వేల ఎకరాలకు నీరు అందించాలన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని, కేసీఆర్ చెప్పినట్లుగా 15 రోజుల్లో చండూరు రెవిన్యూ డివిజన్, 100 పడకల ఆసుపత్రికి చర్యలు చేపట్టాలన్నారు.

  రాబోయే రోజుల్లో బీజేపీదే భవిష్యత్తు అని రాష్ట్రంలో అధికారంలోకి రావడం తద్యమన్నారు. బీజేపీని బలోపేతం చేయడానికి సూర్యాపేట నుంచే నా ప్రచారం తిరిగి మొదలు పెడుతానన్నారు. నన్ను ఓడించేందుకు సూర్యాపేట నుంచి ఎలా వచ్చి జగదీశ్వర్ రెడ్డి పనిచేశారో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో తాను సూర్యాపేటకు వెళ్లి జగదీశ్ రెడ్డిని ఓడిస్తానని చేతనైతే వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి గెలిచి చూపాలని సవాల్ విసిరారు.

  నల్గొండ జిల్లాలో చీము నెత్తురు లేని బానిస బతుకులు బతుకుతున్న ఎమ్మెల్యేలు నన్ను ఓడించడానికి మునుగోడు వచ్చి పని చేశారన్నారు. అవినీతి సొమ్ము, మద్యం, ప్రలోభాలు, ఒత్తిడి, బల ప్రయోగంతో గెలిచిన గెలుపు ఒక గెలుపు కాదని అన్నారు. కేసీఆర్ పెద్ద అబద్దాల దొంగ అని, కేటీఆర్ అహంకారి అని, జగదీశ్వర్ రెడ్డి చేతకాని బానిస మంత్రిగా మిగిలారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత మునుగోడు ఉప ఎన్నికల్లో స్పష్టమైందని త్వరలోనే కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page