Hyderabad | ఓ యువతిని ఓ యువకుడు సీరియస్‌గా లవ్ చేస్తున్నాడు. అదే అమ్మాయిని మరో యువకుడు కూడా ప్రేమిస్తున్నాడు. ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్న ఇద్దరు యువకులు స్నేహితులు.
అయితే తన ప్రియురాలు ఎక్కడ తన ఫ్రెండ్‌కు దక్కుతుందోనన్న అనుమానంతో అతన్ని చంపేశాడు మరో యువకుడు. అతని గుండెను చీల్చాడు. మర్మాంగాలను కోసేశాడు. ఆనవాళ్లు దొరక్కకుండా చేతులకు గ్లౌసులు ధరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్(20) నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హైదరాబాద్ ముషీరాబాద్ వాసి హరిహర కృష్ణ అనే యువకుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
హరి, నవీన్ స్నేహితులు కాగా దిల్‌షుక్‌నగర్‌లో ఇంటర్ కూడా కలిసి చదివారు. అదే సమయంలో కాలేజీలో చదువుతున్న అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.
హత్య దృశ్యాలు ప్రియురాలికి..
అయితే ఈ నెల 17వ తేదీన పార్టీ చేసుకుందామని చెప్పి నవీన్‌ను హరి పిలిచాడు. పార్టీ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. హరితో శంకరయ్య మాట్లాడగా గొడవ సద్దుమణిగింది. కానీ తన కోపాన్ని నియంత్రించుకోలేక పోయిన హరి నవీన్‌ను విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. నవీన్‌ను ఎవరూ గుర్తించకుండా దుస్తులను తొలగించి, అతన్ని సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశాడు. తల, మొండెం వేరు చేశాడు.
ఆ తర్వాత గుండెను చీల్చి.. ఆ దృశ్యాలను ప్రియురాలికి పంపించాడు. మర్మాంగాలను కోసేశాడు. పేగులను బయటకు తీసి పైశాచిక ఆనందం పొందాడు హరిహర కృష్ణ. కత్తిపై వేలి ముద్రలు ఉంటే పోలీసులకు దొరికిపోతానని భావించి, ముందు జాగ్రత్తగా చేతులకు గ్లౌజులు ధరించాడు. హరిహరకృష్ణ నవీన్‌ను హత్య చేసిన తీరును చూసి పోలీసులు విస్తుపోయారు.
రెండు నెలల క్రితమే కత్తి కొనుగోలు..
నిందితుడు హరిహరకష్ణ మూడు నెలల క్రితం నుంచే నవీన్ హత్యకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. నవీన్ హత్యకు ఉపయోగించిన కత్తిని ఓ షాపింగ్ మాల్‌లో రెండు నెలల క్రితం కొనుగోలు చేసి, తన యాక్టివాలో దాచుకున్నట్లు సమాచారం. అయితే కృష్ణపై గతంలో నేర చరిత్ర ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబ్, క్రైమ్ వెబ్ సిరీస్‌లు చూసి నవీన్‌ను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఏమి తెలియనట్లు నవీన్ తండ్రికి ఫోన్
నవీన్‌ను హత్య చేసిన మూడు రోజుల తర్వాత హరిహర కృష్ణ తనకు ఫోన్ చేసి నవీన్ కనిపించడం లేదని మృతుడి తండ్రి శంకరయ్యకు తెలిపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేద్దామని తనకు చెప్పాడని ఆయన పేర్కొన్నాడు. అనంతరం కృష్ణ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని నవీన్ తండ్రి తెలిపాడు. ఫిబ్రవరి 21వ తేదీన నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. 22న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, హరిహర కృష్ణ కోసం గాలించారని తెలిపాడు.
చర్లపల్లి జైలుకు హరిహర కృష్ణ
నవీన్ హత్య కేసులో అరెస్టు అయిన కృష్ణను పోలీసులు హయత్‌నగర్ కోర్టులో శనివారం హాజరు పరిచారు. నిందితుడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో హరిహర కృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు.