బీమా సొమ్ము కోసం వెళ్లి.. దొరికిపోయిన హంతుకుడు విధాత: విలాసాలు, జల్సాలకు అలవాటు పడిన వాడు ఏదైనా చేయటానికి వెనుకాడడు. ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతాడు. రాత్రికి రాత్రి వేలు, లక్షల్లో డబ్బు చేతిలో పడటం కోసం ఒకడు మార్గాలు వెతికాడు. దానికి సులువైన మార్గంగా తనదగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తినే ఎంచుకున్నాడు . ఇంకేముంది.. ఎవరూ లేని అనాథగా తన చెంతన చేరి నమ్మకంగా ఇంటి మనిషిగా, కారు డ్రైవరుగా పనిచేస్తున్న భిక్షపతిని బలి తీసుకొనేందుకు ప్లాన్ […]

  • బీమా సొమ్ము కోసం వెళ్లి.. దొరికిపోయిన హంతుకుడు

విధాత: విలాసాలు, జల్సాలకు అలవాటు పడిన వాడు ఏదైనా చేయటానికి వెనుకాడడు. ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతాడు. రాత్రికి రాత్రి వేలు, లక్షల్లో డబ్బు చేతిలో పడటం కోసం ఒకడు మార్గాలు వెతికాడు. దానికి సులువైన మార్గంగా తనదగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తినే ఎంచుకున్నాడు .

ఇంకేముంది.. ఎవరూ లేని అనాథగా తన చెంతన చేరి నమ్మకంగా ఇంటి మనిషిగా, కారు డ్రైవరుగా పనిచేస్తున్న భిక్షపతిని బలి తీసుకొనేందుకు ప్లాన్ వేశాడు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం బోడతండాకు చెందిన బోడ శ్రీకాంత్‌ జల్సాలకు అలవాటు పడి అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తెలిసిన వారిని మోసం చేశాడు. అందినకాడల్లా అప్పులు చేయటం, తప్పించుకు తిరగటం వృత్తిగా మార్చుకొన్నాడు.

ఆ క్రమంలోనే.. ఒకనాడు వికృత ఆలోచన వచ్చింది. తన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న అనాథ బిక్షపతిని బలిపెట్టి డబ్బులు కాజేయాలని ప్లాన్‌ వేశాడు. అతని పేరుతో ఓ బ్యాంకులో 50లక్షలకు బీమా చేయించాడు. కొన్నాళ్లకే అదే బ్యాంకులో యాభై లక్షలకు పైగా అప్పు తీసుకొని ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటికి నామినీగా తన పేరు రాయించుకొన్నాడు శ్రీకాంత్‌.

భిక్షపతిని చంపేస్తే అతిని పేరుమీద ఉన్న బీమా, ఇల్లూ రెండూ తనకు దక్కుతాయని ఆశించిన శ్రీకాంత్‌. అతన్ని రోడ్డు ప్రమాదం రూపంలో హత్య చేసి బీమా సొమ్మును కాజేయాలని పథకం పన్నాడు. దీనికి మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోతీలాల్‌ సాయం తీసుకొన్నాడు.

అలాగే తనకు నమ్మకస్తులైన సతీష్‌, సమ్మన్నలను కూడ దీసి పథకాన్ని అమలు చేశాడు. ఓ రోజు భిక్షపతికి బాగా మద్యం తాగించి కారులో షాద్‌నగర్‌ వైపు తీసుకెళ్లాడు. కారులోనే ఊపిరాడకుండా చేసి, హాకీ స్టిక్‌తో కొట్టి చంపారు. ఆ తర్వాత ఫరూక్‌ మండలంలోని మెగలిగద్ద పరిసరాల్లో రోడ్డుపై పడేసి కారుతో తొక్కించి యాక్సిడెంట్‌ జరిగినట్లుగా సీన్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించారు.

హత్య జరిగింది 2021 డిసెంబర్‌ 22న. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్ట్‌ మార్టం కోసం పంపించారు. పోస్ట్‌ మార్టం రిపోర్టులో హత్య అని తేలటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో కేసు ముందుకు పోలేదు. కానీ కొన్నాళ్లకు చిన్న క్లూ దొరికింది. అతని పేరు మీద ఉన్న బీమా సొమ్ము కావాలని ఒకతను బ్యాంకుకు వచ్చాడు. అతనికి భిక్షపతితో ఏ సంబంధం లేదని గుర్తించిన బ్యాంకు అధికారులు విషయాన్ని పోలీసులకు ఉప్పందించారు.

పోలీసులకు తీగ దొరికడంతో ఎంక్వైరీ చేయగా డొంకంతా కదిలింది. ఒక్కొక్కరుగా భిక్షపతి హత్యలో భాగస్వాములైన వారంతా పోలీసులకు పట్టుపడ్డారు. భిక్షపతి హత్యలో సూత్రదారుడైన శ్రీకాంత్‌, మోతీలాల్‌, సతీష్‌, సమ్మన్నలను పోలీసులు కస్డడీలోకి తీసుకొన్నారు. ఎట్టకేలకు ఏడాది తర్వాత అసలు నిందితులు దొరికిపోయారు. డబ్బుకోసం మనిషి ప్రాణాలను బలిగొన్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated On 10 Jan 2023 11:12 AM GMT
krs

krs

Next Story