Saturday, April 1, 2023
More
    Homelatestరాజకీయాల్లో నా ప్రస్థానం ముగిసింది.. సోనియాగాంధీ రిటైర్మెంట్

    రాజకీయాల్లో నా ప్రస్థానం ముగిసింది.. సోనియాగాంధీ రిటైర్మెంట్

    • జోడో యాత్రతో నా ఇన్నింగ్స్‌ ముగిసినట్టే
    • జోడో యాత్ర కాంగ్రెస్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అన్న సోనియా
    • బీజేపీకి వ్యతిరేకంగా యూపీఏ తరహా కూటమి
    • బీజేపీ ఓటమి కోసం త్యాగాలకు కాంగ్రెస్‌ సిద్ధమన్న ఖర్గే

    విధాత: రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతున్నట్టు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) సంకేతాలిచ్చారు. రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra) కాంగ్రెస్‌ పార్టీకి మంచి టర్నింగ్‌ పాయింట్‌ వంటిదని చెప్పారు.

    ఈ యాత్రతో తన ఇన్నింగ్స్‌ ముగిసినట్టేనని చెప్పారు. గట్టి కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. కాంగ్రెస్‌ (Congress) ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదని చెప్పారు. మన్మోహన్‌ సింగ్‌ (Manmohan singh) సారథ్యాన యూపీఏ (UPA) ప్రభుత్వం సాధించిన విజయాలు తనకు వ్యక్తిగతంగా సంతృప్తిని ఇచ్చాయని అన్నారు.

    ప్రస్తుత సమయం కాంగ్రెస్‌కే కాకుండా మొత్తం దేశానికి సవాలు వంటిదని సోనియా చెప్పారు. దేశంలోని ప్రతి సంస్థను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ (BJP-RSS) హస్తగతం చేసుకుని, అన్నింటినీ నాశనం చేశాయని మండిపడ్డారు. కొద్దిమంది వ్యాపార వేత్తలకు మేలు చేసి, ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    దేశంలో విద్వేషాలను (hatred) బీజేపీ రెచ్చగొడుతున్నదని, దేశంలో మైనార్టీలు, మహిళలు, దళితులు, గిరిజనులను టార్గెట్‌ చేసుకున్నదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనాలని పార్టీ కార్యకర్తలకు సోనియా పిలుపునిచ్చారు.

    త్యాగాలకు కాంగ్రెస్‌ సిద్ధం : ఖర్గే

    అంతకు ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షోపన్యాసం చేస్తూ బీజేపీ వ్యతిరేకించి భావసారూప్యత ఉన్న పార్టీలకు చేరువై, యూపీఏ తరహాలో ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. భావ సారూప్యం ఉన్న పార్టీలతో మళ్లీ చేయి కలుపుతామని, బీజేపీని ఓడించేందుకు అవసరమైతే త్యాగాలకు కూడా కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమని ఖర్గే ప్రకటించారు.

    దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇటీవల నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర దేశానికి ఉషోదయం వంటిదని ఖర్గే అభివర్ణించారు. ఈ యాత్రలో రాహుల్‌తో చేయి కలిపిన వేల మంది.. కాంగ్రెస్‌ ఇంకా తమ హృదయాల్లోనే ఉన్నదని చాటిచెప్పారని పేర్కొన్నారు. యువతను రాహుల్‌ చైతన్యవంతం చేశారని కితాబిచ్చారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular