Myanmar విధాత: సైనిక పాలనలో ఉన్న మయన్మార్ (Myanmar) లో దిగజారిన మీడియా స్వేచ్ఛకు ఉదాహరణగా నిలిచే ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఒక ఫొటో జర్నలిస్టుకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒక రోజు విచారణ అనంతరం కోర్టు తీర్పు చెప్పింది. ఇటీవల వచ్చిన భారీ తుపానును, ఆ విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను ఆయన రిపోర్టు చేయడమే నేరమని కోర్టు భావించింది. బాధితుడు సాయ్ జా థాయ్‌కే.. మయన్మార్ నౌ అనే ఆన్‌లైన్ వార్తా సంస్థ […]

Myanmar
విధాత: సైనిక పాలనలో ఉన్న మయన్మార్ (Myanmar) లో దిగజారిన మీడియా స్వేచ్ఛకు ఉదాహరణగా నిలిచే ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఒక ఫొటో జర్నలిస్టుకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒక రోజు విచారణ అనంతరం కోర్టు తీర్పు చెప్పింది. ఇటీవల వచ్చిన భారీ తుపానును, ఆ విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను ఆయన రిపోర్టు చేయడమే నేరమని కోర్టు భావించింది. బాధితుడు సాయ్ జా థాయ్‌కే.. మయన్మార్ నౌ అనే ఆన్‌లైన్ వార్తా సంస్థ తరఫున పని చేస్తున్నారు. రఖైన్ రాష్ట్రంలో ఈ ఏడది మేలో వచ్చిన మోచా తుపానును కవర్ చేశారు.
గత దశాబ్ద కాలంలో మయన్మార్‌లో వచ్చిన భారీ తుపానుగా ఇది రికార్డుల్లో నమోదయింది. ఈ తుపాను బారిన పడి 148 మంది ప్రాణాలు కోల్పోగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 1,86,000 నివాస సముదాయాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అంచనా. దీని వల్ల అక్కడ ఎక్కువగా ఉండే రోహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో వలసపోయారు. ఈ తుపాను రిపోర్టింగ్‌లో సాయ్ అనేక తప్పులు చేశారని పేర్కొంటూ మే లోనే ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది.
దేశద్రోహం, ప్రభుత్వ అధికారులు, సైన్యం పనితీరుపై విమర్శలు, తప్పుడు సమాచార వ్యాప్తి తదితర అభియోగాలను ఆయనపై మోపింది. ఎప్పటిలాగానే ఈ విచారణ అత్యంత రహస్యంగా చాలా స్వల్ప కాలంపాటు జరిగింది. ప్రభుత్వ అధికారులు మోపిన అన్ని అభియోగాలను నిర్ధరించిన సైనిక న్యాయస్థానం ఆయనకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మిలటరీ అధికారం చేజిక్కించుకున్న 2021 నుంచి ఒక జర్నలిస్టుకు ఇంత భారీ శిక్ష పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
