- పాల వలె తెల్లగా ఉండే రసాయనాల ద్రావణమే నకిలీ పాలు
- నకిలీ పాలతో అనారోగ్యమని హెచ్చరిస్తున్న వైద్యులు
విధాత: ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టినా, పోలీసులు ఎంత నిఘా ఏర్పాటు చేసినా అక్రమార్కుల వక్రబుద్ధి మారటం లేదు. ఆహార పదార్థాల కల్తీ చేయడం మానటం లేదు. ఆహారంలో అతి ముఖ్య భాగమైన పాలను కల్తీ చేయటమే కాదు, నకిలీ చేస్తున్నారు.
కల్తీ కన్నా నకిలీ చాలా ప్రమాదకరం. ఇలాంటి నకిలీ పాలతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపూర్లో నకిలీ పాల తయారీ కేంద్రాన్ని ఎస్వోటీ పోలీసులు కనుగొని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరొకతను పరారీలో ఉన్నాడు.
నకిలీ పాల తయారీ ముఠా పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇదే భువనగిరి మండలం లోని వడపర్తి, చౌదరిపల్లి గ్రామాల్లో కూడా నకిలీ పాల తయారీ కేంద్రాలను పోలీసులు పట్టుకొన్నారు. హైదరాబాద్ నగరానికి ఈ గ్రామాలు అతిసమీపంగా ఉండటం కారణంగా ధనార్జనే ధ్యేయంగా నకిలీ పాల తయారీని వృత్తిగా ఎంచుకొంటున్నారు. వివిధ రసాయనాలతో నకిలీ పాలను తయారు చేసి హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నకిలీ పాల తయారీకి భువనగిరి మండలం అడ్డాగా మారింది.
హైదరాబాద్ శివారు ప్రాంతాలుగా ఉన్న చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, భువనగిరి, బొమ్మల రామారం మండలాల్లోని పలు గ్రామాలు నకిలీ పాలకు నిలయాలుగా మారాయి. ఈ మండలాల్లోని పలు గ్రామాలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కలిసిపోయి నకిలీ పాల రవాణాకు అనువుగా ఉన్నాయి.
దీంతో ఈ గ్రామాల్లో అక్రమార్కులకు సులువుగా డబ్బులు సంపాదించే చీకటి కార్యకలాపంగా మారి పోయింది. ఈ నెల 4న చౌటుప్పల్ మండలం అల్లాపూర్ గ్రామంలో కూడా నకిలీ పాల ఉత్పత్తి కేంద్రాన్ని పోలీసులు పట్టుకోవటం గమనార్హం. పాలను కల్తీ చేయటం అంటే.. పాలల్లో కలిసే వాటిని కలపటం. ఉదాహరణకు నీటిని కల్పి పాలను కల్తీ చేస్తారు. కల్తీ చేయటం ద్వారా పాల నాణ్యత తగ్గుతుంది. కానీ నకిలీ చేయటం అంటే… రసాయనాలు కలిపి పాల రూపంలో ఉన్న ద్రావణాన్ని తయారు చేసి, పాలుగా చెలామణిలో పెట్టడం.
ఈ ద్రావణాలు పాల వలె తెల్లగా ఉంటాయి. అంతే కానీ ఇవి పాలు ఎంతమాత్రం కావు. ఈ రసాయన పాలు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. హైడ్రోజన్ పెరాక్సైడ్, నూనె, యూరియా, సర్ఫ్, బేకింగ్ సోడా, పాలపొడి లాంటి రసాయనాలతో నకిలీ పాలను తయారు చేస్తున్నారు.
కల్తీ, నకిలీ పాల తయారీ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నదంటే… మన దగ్గర పాల వినియోగం కన్నా ఉత్పత్తి తక్కువగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. రాష్ట్రంలో 105.68 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా, వినియోగం మాత్రం 123.73లక్షల లీటర్లుగా ఉన్నది.
ఒక్క హైదరాబాద్ జంటనగరాలనే తీసుకొన్నా… హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 30లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా, 68 లక్షల లీటర్ల పాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉత్పత్తి కన్నా వినియోగం ఇంత ఎక్కువగా ఉండటం కారణంగానే అక్రమార్కులు దీన్ని ఆసరాగా తీసుకొని చీకటి దందా చేస్తున్నారు.
నకిలీ, కల్తీ పాలను తయారు చేసి ప్రజల ఆరోగ్యాలను తోడేస్తున్నారు. ఇలాంటి నకిలీ పాలతో మెదడు, కాలేయం, జీర్ణాశయం, కన్ను, చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయనీ వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా మానసిక సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పాల ఉత్పత్తి, సరఫరాలపై గట్టి నిఘా పెట్టి కల్తీ, నకిలీని అరికట్టాలి. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలి.