HomelatestNalgonda | ఎటుచూసినా.. ధాన్యం కొనుగోలు తిప్పలే.. రైతన్నల నిరసనలే..

Nalgonda | ఎటుచూసినా.. ధాన్యం కొనుగోలు తిప్పలే.. రైతన్నల నిరసనలే..

Nalgonda

  • దీనికి తోడు వణికిస్తున్న వరుణుడు
  • కాంటా అయినా ఎగుమ‌తి కాక ప‌డిగాపులు
  • స్పందించ‌ని అధికారులు..

విధాత: ధాన్యం కొనుగోలు సమస్యలతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం సతమతం అవుతుంది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి కొనుగోలుకు రైతులు ఎదురుచూస్తుండగా, మరికొందరు కాంటాలైన తమ ధాన్యాన్ని మిల్లర్లు ఎగుమతి చేసేదాకా పడికాపులు పడుతున్నారు.

ఒకవైపు వరస వర్షాలు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేయ‌డ‌మే కాకుండా, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న‌ది. మరొకవైపు తేమ శాతం పేరుతో అధికారులు ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. దీంతో ధాన్యం అమ్మకం జరిగే వరకు రైతులు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్న దైన్యస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది.

నిత్యం పలు గ్రామాల్లో రైతాంగం రాస్తారోకోలు, ఆందోళనలతో ధాన్యం కొనుగోలులో ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసనలకు దిగుతున్నారు. మంగళవారం సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు ఎగుమతి సమస్యలపై రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నల్గొండ జిల్లాలో పెదవూరలో ధాన్యం బస్తాల తరలింపుకు లారీలు రాకపోవడంతో రైతులు నాగార్జునసాగర్ హైదరాబాద్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు సర్ది చెప్పారు. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ధాన్యం కొనుగోలు సమస్యలపై రైతన్నల నిరసనలు నిత్య కృత్యమయ్యాయి.

కలెక్టర్లు, పౌరసరఫరాల సంస్థ, పౌరసరఫరాల శాఖలు, డిఆర్డిఏ, సహకార శాఖల అధికారులు ఒకవైపు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ కొనుగోలు సమస్యలు మాత్రం యథాతధంగా కొనసాగుతుండడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది.

ఆకాశం మళ్లీ మేఘావృతమై వర్ష సూచనలు ఉండడంతో రైతులు తమ ధాన్యం కొనుగోలు, ఎగుమతులు వేగంగా జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్న తీరు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తుంది.

మంగళవారం తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ పందుల సైదులు ఆధ్వర్యంలోని బృందం కనగల్ మండలంలోని చెట్ల చెన్నారం సహా పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతాంగం సమస్యలు తెలుసుకుంది. ఈ సందర్భంగా 20 నుండి 30 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కోసం, ఎగుమతుల కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ ధాన్యం ఎగుమతికి 20 రోజుల నుండి లారీలు రాని విషయాన్ని తాను డిఆర్డిఏ అధికారులకు తెలుపగా, ఇంతవరకు ఆ సమస్య తమ దృష్టికి రాలేదని చెప్పారన్నారు. ఇదే విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్ కు, ఇతర అధికారులకు ఫోన్లో సంప్రదించగా వారు స్పందించకపోవడం విచాకరమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ధాన్యం కొనుగోలులో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు దృష్టి సారించాలని ఆయన కోరారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular