NALGONDA | Handicraft Fair విధాత: భారతీయ సంస్కృతి, జీవనశైలిలో చేనేత, హస్తకళలకు ఉండే స్థానం.. ఆదరణ ఎప్పుడు ప్రత్యేకమే. ముడి నూలును అబ్బురపరిచే అందమైన చీరలుగా, అడవి కర్రలు అద్భుత కొయ్య బొమ్మలుగా మలచడంలో చేనేత, హస్త కళా కార్మికుల నైపుణ్యాన్ని ఎంత పొగిడినా తక్కువే. అటువంటి అందమైన చేనేత చీరలు, వస్త్రాలు, కొయ్య బొమ్మలు, నగిషీలన్నింటిని ఒకచోట సందర్శించే అవకాశం కల్పించే చేనేత హస్త కళా మేళా ఇప్పుడు నల్గొండ పట్టణంలో కొనసాగుతుంది. జిల్లా […]

NALGONDA | Handicraft Fair

విధాత: భారతీయ సంస్కృతి, జీవనశైలిలో చేనేత, హస్తకళలకు ఉండే స్థానం.. ఆదరణ ఎప్పుడు ప్రత్యేకమే. ముడి నూలును అబ్బురపరిచే అందమైన చీరలుగా, అడవి కర్రలు అద్భుత కొయ్య బొమ్మలుగా మలచడంలో చేనేత, హస్త కళా కార్మికుల నైపుణ్యాన్ని ఎంత పొగిడినా తక్కువే.

అటువంటి అందమైన చేనేత చీరలు, వస్త్రాలు, కొయ్య బొమ్మలు, నగిషీలన్నింటిని ఒకచోట సందర్శించే అవకాశం కల్పించే చేనేత హస్త కళా మేళా ఇప్పుడు నల్గొండ పట్టణంలో కొనసాగుతుంది. జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ఉత్పత్తుల మేళా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.

కరోనా సమయంలో ఆగిన చేనేత హస్తకళా ప్రదర్శనలు మళ్లీ జనాదరణ దిశగా సాగుతున్న తీరు చేనేత కార్మికుల్లో, హస్త కళా కళాకారుల్లో, విక్రయదారుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.ఈ శ్రీ ఉషోదయ చేనేత అఖిలభారత హస్తకళా మేళాలో చేనేత ఉత్పత్తులు, హస్తకళాకృతుల ప్రదర్శన, విక్రయం సాగుతుంది.

ఈ ప్రదర్శనలో ప్రసిద్ధ పోచంపల్లి చేనేత చీరలతో పాటు మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, గద్వాల చీరలు, బెంగాలీ కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్ షీట్స్, ఖాదీ వస్త్రాలు, అలంకృత ఆభరణాలు, కొండపల్లి బొమ్మలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని చేనేత హస్త కళా ఉత్పత్తులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత వస్త్రాలు, చీరలు హస్త కళా ఉత్పత్తులను కూడా ప్రదర్శనలో అమ్మకానికి పెట్టారు.

దీంతో చేనేత హస్తకళల పట్ల మక్కువ కనబరిచే ప్రజలు, మహిళలు, పెద్ద సంఖ్యలో చేనేత హస్త కళా ప్రదర్శనను సందర్శిస్తూ తమకు నచ్చిన చీరలు, వస్త్రాలు, చేతి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండగా వారి సందర్శనతో హస్తకళా మేళా నిత్యం జనంతో సందడిగా కనిపిస్తుంది.

తమ ప్రదర్శన స్టాల్స్ లో పోచంపల్లి పట్టు చీరలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రసిద్ధ చీరలు వస్త్రాలు, హస్త కళా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని సందర్శించి కొనుగోలు చేయడం ద్వారా చేనేత, హస్తకళలకు తోడ్పాటు అందించాలని ప్రదర్శన నిర్వాహకులలో ఒకరైన పుట్టపాక చేనేత కార్మికుడు గంజి సంతోష్ కుమార్ కోరారు.

Updated On 10 May 2023 11:52 AM GMT
Somu

Somu

Next Story