మారిన దశాబ్ది ఉత్సవ స్వాగత ఫ్లెక్సీలు.! విధాత: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రం నల్గొండ (Nalgonda)లో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం పట్ల నెలకొన్న వివాదంపై స్పందించిన పురపాలక సంఘం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటులో ప్రోటోకాల్ ఉల్లంఘనపై " దశాబ్ది సన్నాహాల్లో గ్రూప్ వార్.. నల్గొండలో గుత్తా-కంచర్ల ఫ్లెక్సీ షో " శీర్షికన విధాత వార్తా కథనం […]

- మారిన దశాబ్ది ఉత్సవ స్వాగత ఫ్లెక్సీలు.!
విధాత: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రం నల్గొండ (Nalgonda)లో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం పట్ల నెలకొన్న వివాదంపై స్పందించిన పురపాలక సంఘం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటులో ప్రోటోకాల్ ఉల్లంఘనపై " దశాబ్ది సన్నాహాల్లో గ్రూప్ వార్.. నల్గొండలో గుత్తా-కంచర్ల ఫ్లెక్సీ షో " శీర్షికన విధాత వార్తా కథనం ప్రచురించింది.
ఈ నేపథ్యంలో స్పందించిన పురపాలక సంఘం సదరు ఫ్లెక్సీలను తొలగించి గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటోతో ముద్రించిన నూతన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ప్రోటోకాల్ రహిత మున్సిపాలిటీ ఫ్లెక్సీలపై రేగిన విమర్శలకు తెర పడినట్లయ్యింది.

అయితే ఫ్లెక్సీలు మారినంత సులువుగా గుత్తా , కంచర్లల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, గుత్తాకు నెలకొన్న వర్గపోరు నేపథ్యంలోనే ఫ్లెక్సీలో గుత్తా ఫోటో పెట్టలేదన్న వాదన వినిపించింది.

రానున్న ఎన్నికల్లో కంచర్లకు పోటీగా గుత్తా తనయుడు గుత్తా అమిత్ రెడ్డి నల్లగొండ సెగ్మెంట్ టికెట్ రేస్ లో ఉన్నారు. దీంతో గుత్తా, కంచర్ల మధ్య అంతర్గతంగా ప్రచ్చన్న యుద్ధం సాగుతుంది. పైకి పార్టీ కార్యకలాపాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నప్పటికీ ఎవరి గ్రూపులను వారు బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమవడంతో గుత్తా, కంచర్ల మధ్య సాగుతున్న ప్రచ్చన్న యుద్ధం ఎన్నికలనాటికి ప్రత్యక్ష రూపం దాల్చవచ్చని గులాబీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
