HomelatestNalgonda | BRS నాయకులు.. తెలంగాణను దోచుకుంటున్నరు: కోదండరాం

Nalgonda | BRS నాయకులు.. తెలంగాణను దోచుకుంటున్నరు: కోదండరాం

Nalgonda

విధాత: త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సహజ వనరులను కొల్లగొట్టి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ తమ ఆస్తులను, ఆదాయాలను పెంచుకుంటున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు.

మంగళవారం టీజేఎస్ పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశానికి హాజరైన కోదండరామ్ జూన్ 4వ తేదీన సూర్యాపేటలో నిర్వహించనున్న పార్టీ మూడవ ప్లీనరీ సమావేశాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. చట్టం ప్రకారం, రాజ్యాంగం మేరకు పరిపాలించాల్సిన పాలకులు ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని మరిచి మూస పాలన, దోపిడీ పాలన కొనసాగిస్తున్నారన్నారు.

అందుకే తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో కోట్లు కొల్లగొడుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, భూ దందాలు, ఇసుక దందాలు, మద్యం దందాలలో కూరుకుపోయారన్నారు.

ప్రభుత్వ పథకాలలో ఎమ్మెల్యేలే 30% కమీషన్లు దండుకుంటున్న తీరు రాష్ట్రంలో పెచ్చురిల్లిన అవినీతికి నిదర్శనమన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ వేయకుండా, పేపర్ల లీకేజీతో లక్షలాదిమంది నిరుద్యోగ యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారన్నారు.

కుటుంబ, అవినీతి పాలనకు తెలంగాణ మోడల్ గా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, కుటుంబ, దోపిడీ పాలనను వివరించి రానున్న ఎన్నికల్లో నియంతృత్వ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ పలు తీర్మానాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులకు పైగా ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, ఎగుమతి పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు.

తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, నల్లగొండ నియోజవర్గాలలో లక్ష ఏకరాలకు సాగునీరు అందించే ఉదయ సముద్రం ఎత్తిపోతల ట్రయల్ రన్ పూర్తిచేసినందున, రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు పూర్తి చేసి, రెగ్యులేటర్ గేట్స్ పనులు పూర్తిచేసి రైతులకు నీరందించాలన్నారు.

శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు, నక్కలగండి రిజర్వాయర్ లను వెంటనే పూర్తి చేయాలని, సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్న ఆ ప్రాజెక్టుల పూర్తికి వెంటనే నిధులు కేటాయించాలన్నారు. మునుగోడు, గట్టుప్పల్, చిట్యాల, పెద్దదేవులపల్లి ప్రాంతాలలో స్థాపించిన ఫార్మసీ పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నందున వెంటనే వాటిని తొలగించాలని, కొత్త వాటికి అనుమతి ఇవ్వవద్దన్నారు.

జిల్లాలోని భూర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. నేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి చేనేత వ్యవస్థను కాపాడాలన్నారు. రైతు బీమా లాగా చేనేత కార్మికులకు భీమా కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని తీర్మానాలు చేశారు.

కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్, ఉపాధ్యక్షులు వై.పాపిరెడ్డి, కార్యదర్శులు పులి పాపయ్య, బి.నర్సిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎరుకల మల్లేష్, యువజన సభ జిల్లా అధ్యక్షుడు మేకల శివ, విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పవర్ ప్లాంట్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి: కోదండరాం

యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. నల్గొండ కలెక్టరేట్ ఎదుట పరిహారం కోసం డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు కొనసాగిస్తున్న పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులైన దళితుల ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. పవర్ ప్లాంట్ నిర్మాణ భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన దళితులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వకపోవడం అన్యాయంగా ఉందన్నారు.

వెంటనే జిల్లా అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కార దిశగా టీజేఎస్ అవసరమైతే న్యాయ పోరాటం చేస్తుందన్నారు. దీక్ష‌లో టీజేఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పన్నాల గోపాల్ రెడ్డి. మారబోయిన శ్రీధర్, ఉపాధ్యక్షులు వై. పాపిరెడ్డి, కార్యదర్శులు పులి పాపయ్య, బి. నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎరుకల మల్లేష్, యువజన సభ జిల్లా అధ్యక్షుడు మేకల శివ, విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీరావత్ వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular