HomelatestNalgonda | సర్కార్ హెచ్చరికలు బేఖాతార్..! సమ్మెలోనే మెజార్టీ పంచాయతీ కార్యదర్శులు!!

Nalgonda | సర్కార్ హెచ్చరికలు బేఖాతార్..! సమ్మెలోనే మెజార్టీ పంచాయతీ కార్యదర్శులు!!

Nalgonda

విధాత: సమ్మె విరమించి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకల్లా ఉద్యోగాల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుండి బర్తరఫ్ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలను జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు బేఖాతార్ చేసి మెజారిటీ కార్యదర్శులు విధుల్లో చేరకపోవడం సంచలనంగా మారింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1270మందికీ గాను 80 శాతం మందికి పైగా జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలోనే కొనసాగుతుండటం గమనార్హం. ఒక్క దేవరకొండ మండలంలోనే 35 మంది కార్యదర్శులకు కేవలం నలుగురు మాత్రమే ప్రభుత్వ హెచ్చరికకు లోబడి విధుల్లో చేరడం గమనార్హం. సమ్మె కొనసాగింపులో జేపీఎస్, ఓ పి ఎస్ ల పట్టుదలకు ఇది నిదర్శనంగా కనిపించింది.

ఇప్పుడు ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో నన్న ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగాల్లో చేరిన సందర్భంగా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు, అలాగే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు 15వేల వేతనంతో మూడేళ్ల ప్రొఫెషనల్ పీరియడ్ పూర్తి చేసుకున్నందునా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ 9350మంది జూనియర్ ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు, 12 రోజులుగా సమ్మె చేస్తున్నారు.

సహజంగా సీఎం కేసీఆర్ తత్వం తెలిసిన వారు ఎవరైనా బెదిరింపులకు, ఒత్తిళ్లకు లొంగే రకం వ్యక్తి కాదని చెబుతారు. ఆర్టీసీ సమ్మెను ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచివేశారో అందరికీ తెలిసిందే. అలాగే గతంలో అంగన్వాడీలను, ఆశ వర్కర్లను, విఆర్వోలను, విద్యుత్ సబ్స్టేషన్ ఉద్యోగులను సుదీర్ఘ సమ్మె అనంతరం తనదారికి తెచ్చుకొని సమ్మె విరమింప చేసిన వైనం విదితమే.

అంతెందుకు రాజకీయంగా తనతో విభేదించిన ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపికి బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో ఎదురెల్లుతున్న తీరు సీఎం కేసీఆర్ మొండి పట్టుదలకు నిదర్శనం. అంతటి మొండి పట్టుదల మనిషిగా వ్యవహరించే సీఎం కేసీఆర్ తో జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తమ సమ్మెతో ఢీ అంటే ఢీ అంటుండటం అందరిని ఆశ్చర్యపరిచింది.

సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని ప్రభుత్త్వం ఖరాఖండిగా హెచ్చరించినప్పటికీ 80శాతంకు పైగా ఉద్యోగాల్లో చేరకుండా సమ్మెలో కొనసాగుతూ ఉండటం విశేషం. మంగళవారం సాయంత్రం ఐదు గంటలలోగా విధుల్లో చేరని జూనియర్, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగించాలని ఇప్పటికే ప్రభుత్వం ఎంపిడివోలను ఆదేశించింది. ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకుండా జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలోనే కొనసాగుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 353 మందికి ముగ్గురు కూడా విధుల్లో చేరలేదు. దీంతో సమ్మెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్ సర్కార్ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular