HomelatestNalgonda | మైనింగ్ కంపెనీ రద్దు చేయాల‌ని కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల ధర్నా

Nalgonda | మైనింగ్ కంపెనీ రద్దు చేయాల‌ని కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల ధర్నా

Nalgonda

  • ర‌ద్దు చేయ‌క‌పోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చ‌రిక‌

విధాత: నల్లగొండ మండలం నర్సింగ్‌భ‌ట్ల గ్రామంలో శ్రీ గాయత్రి మైనింగ్ బ్లాక్ గ్రానైట్ కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్‌భ‌ట్ల, కూతురుగూడెం నారబోయిన గూడెం, గూడపూర్ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం వార్డు సభ్యులకు, ఎంపీటీసీకి సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా శ్రీ గాయత్రీ మైనింగ్ బ్లాక్ గ్రానైట్ కంపెనీకి రహస్యంగా నివేదిక ఇచ్చిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మైనింగ్ కంపెనీ ఏర్పాటు వలన నర్సింగ్‌భ‌ట్ల గ్రామంతో పాటు కూతురు గూడెం, నారబోయిన గూడెం,గూడపూర్ గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో శ్రీ గాయత్రి మైనింగ్ కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళన తీవ్ర ఉధృతం చేస్తామని ఆయా గ్రామాల ప్రజలు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ధర్నాలో నల్గొండ మాజీ జెడ్పిటిసి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నర్సింగ్‌భ‌ట్ల గ్రామంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలకు సరైన సమాచారం ఇవ్వకుండా మైనింగ్ కంపెనీకి అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని ఆరోపించారు. గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే అధికారులు పోలీసు పహారాతో మైనింగ్ కంపెనీ అనుమతి కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారన్నారు. గ్రామ ప్రజలను బెదిరించి వారికి అనుకూలంగా ఉన్నవారితో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని ధ్వజమెత్తారు.

రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కై గ్రానైట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ కంపెనీ బ్లాస్టింగ్ వలన చెరువులలో చేపలు పట్టే మత్స్య కార్మికులకు, గీత కార్మికులతో పాటు గ్రామ ప్రజలందరికీ తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకతను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నా కార్యక్రమంలో ఎంపీటీసీ జాకిర తాజుద్దీన్, ముక్కమాల యాదయ్య, మాధగోని సత్తయ్య, చామకూరి మహేష్, నారబోయిన నరసింహ, కాసాని లింగస్వామి ముక్కమల శేఖర్, తిరుమల సత్యనారాయణ, తిరుమల రాము, ప్రవీణ్, చామకూరి అశోక్, ఓర్సు శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular