విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు సింహముఖ నరసింహ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. కృతయుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు స్తంభోద్భవుడిగా శ్రీవారు నరసింహ అవతారమెత్తారు.
అపూర్వమైన నరసింహ అవతారంతో పంచ నారసింహుడిగా యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తజన సంరక్షకుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. నరసింహుడి అలంకార సేవలో స్వామివారికి మాడవీధుల్లో ఊరేగింపు వేడుక నిర్వహించగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు.
ఆరు రోజులపాటు అలంకార సేవలతో వైభవంగా సాగిన అధ్యయనోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమాల్లో ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.