NASA విధాత: ఎప్పటికప్పుడు అంతరిక్షం గురించి అప్‌డేట్లు ఇస్తూ అలరించే నాసా (NASA) .. తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. సౌర కుటుంబంలో అత్యంత చిన్నదైన బుధ గ్రహం (Mercury) ఫొటోనూ అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేసి అధికారిక ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. భూమి లాగే ఎక్కువ భాగం నీలంగా కనిపిస్తుండగా.. అక్కడక్కడా నారింజ రంగులోనూ కనిపిస్తూ.. బుధ గ్రహం అబ్బురపరుస్తోంది. ఈ గ్రహాన్ని పరిశీలించడానికి నాసా ఒకే ఒక ఉపగ్రహం.. మెసెంజర్‌ను పంపింది. అది […]

NASA
విధాత: ఎప్పటికప్పుడు అంతరిక్షం గురించి అప్‌డేట్లు ఇస్తూ అలరించే నాసా (NASA) .. తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. సౌర కుటుంబంలో అత్యంత చిన్నదైన బుధ గ్రహం (Mercury) ఫొటోనూ అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేసి అధికారిక ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. భూమి లాగే ఎక్కువ భాగం నీలంగా కనిపిస్తుండగా.. అక్కడక్కడా నారింజ రంగులోనూ కనిపిస్తూ.. బుధ గ్రహం అబ్బురపరుస్తోంది.
ఈ గ్రహాన్ని పరిశీలించడానికి నాసా ఒకే ఒక ఉపగ్రహం.. మెసెంజర్‌ను పంపింది. అది తీసిన కొన్ని వేల ఫొటోలను క్రోడీకరించి తాజా ఫొటోను నాసా తయారు చేసింది. ప్రస్తుతం 'మెసెంజర్' ఒకటే బుధుని చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇతర ఏ దేశమూ కూడా ఈ గ్రహాన్ని పరిశీలించడానికి ఆసక్తి చూపకపోవడం విశేషం. ఈ గ్రహం గురించి పలు విశేషాలను నాసా పంచుకున్న విశేషాలు ఇవీ..
బుధ గ్రహం మన చంద్రుడి కంటే కాస్త పెద్దగా ఉంటుంది. ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించిన అనంతరం దీనినే సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహంగా పరిగణిస్తున్నారు. అంతే కాకుండా సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం కూడా ఇదే. సూర్యునికి బుధుడికి మధ్య దూరం కేవలం 58 మిలియన్ కి..మీ. మాత్రమే.
అందుకే ఇక్కడ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిల్లో ఉంటాయి. పగటి పూట బుధుడి ఉపరితలంపై 430 డిగ్రీల సెంటీగ్రేడ్.. రాత్రి పూట - 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అంతే కాకుండా ద్రవ్యరాశి తక్కువగా ఉన్న మూలంగా ఇది అత్యంత వేగంగా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సెకను 47 కి.మీ. వేగంతో తిరుగుతూ 88 రోజులకే సంవత్సరాన్ని పూర్తి చేసేస్తుంది. బుధుడిపై వాతావరణం లేకపోయినా.. దాని చుట్టూ వివిధ వాయువులతో కూడిన ఒక పొర ఉంటుంది.
ఇందులో ఆక్సిజన్, సోడియం, హీలియం, పొటాషియం తదితర వాయువులుంటాయి. బాగా బలహీనంగా ఉన్న బుధుడి మాగ్నెటెక్ ఫీల్డ్‌ను సౌర పవనాలు ఢీకొట్టడంతో దీని ఉపరితలంపై తరచుగా మాగ్నెటెక్ టోర్నడోలు ఏర్పడతాయి. ఇక్కడ మానవునికి నివాస యోగ్యమైన వాతావరణం లేకపోయినప్పటికీ.. సౌర కుటుంబం పుట్టక, పరిణామక్రమాన్ని తెలుసుకునేందుకు నాసా బుధునిపై ప్రయోగాలు చేస్తోంది.
