Natti Kumar
విధాత: ‘‘టికెట్స్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సినీ పరిశ్రమలోని కొందరు ఏపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటారు.. కానీ వారంతా టాక్స్‌లు కట్టేది మాత్రం తెలంగాణ ప్రభుత్వానికే’’ అని అన్నారు నిర్మాత నట్టికుమార్(Natti Kumar). ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అనేక విషయాలపై మాట్లాడేందుకు ఆయన తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
‘‘ఆ మధ్య చిరంజీవి, రాజమౌళిలతో పాటు ఇంకొందరు సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వం పిలుపు మేరకు సీఎం జగన్‌గారిని కలసి వచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 30 శాతం షూటింగ్ ఏపీలో చేస్తామని హామీ ఇచ్చి వచ్చారు.
అక్కడ విశాఖ, భీమిలి, అరకు, తిరుపతి, పాపికొండలు, గోదావరి, హార్సిలీ హిల్స్ వంటి అందమైన లొకేషన్స్ ఉన్నప్పటికీ.. పరిశ్రమకు చెందిన చాలా మంది కనీసం 30 శాతం షూటింగ్ కూడా అక్కడం చేయడం లేదు. ఎలాంటి స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్స్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా నాకయితే కనిపించడం లేదు. కానీ సినిమాల రిలీజ్ టైమ్‌లో టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రం సినీ పరిశ్రమలోని కొందరు ఏపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుని, లబ్ది పొందుతుంటారు.
వాళ్లంతా హైదరాబాద్‌లోనే తమ సంస్థల కార్యాలయాలను కొనసాగిస్తూ, టాక్స్‌లు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కడుతుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వాన్ని వివిధ కోణాలలో పనికట్టుకుని అది చేయలేదు, ఇది చేయలేదు అని విమర్శిస్తుంటారు.
వాస్తవానికి సినీ పరిశ్రమకు కులం, మతం లేదు.. ఇక్కడ అందరూ ఒకటే. చిన్న, పెద్ద నిర్మాతలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న తేడా మాత్రమే ఉంది. ఎంతసేపు చిన్న నిర్మాతలను తొక్కేయాలని చూసే కొద్దిమంది స్వార్ధపరులు ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనే సినీ పరిశ్రమ మనుగడ సాగించడం ప్రమాదకరంగా మారింది.
ఇక తెలంగాణాలో చిన్న సినిమా బతికే పరిస్థితి కనిపించడం లేదు. 7 లక్షలు, 5 లక్షలు థియేటర్స్ రెంటల్స్‌తో చిన్న సినిమాలను ఇక్కడ విడుదల చేయడం ఎంతో కష్టమైపోయింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో 1 లక్ష, రెండు లక్షల రెంటల్స్‌తో చిన్న సినిమాల విడుదలకు కొంతమటుకు ఊపిరి తీసుకునే అవకాశం ఉంది.
లోగడ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌గారు ఓ మీటింగ్‌లో మేము ఐదారు పెద్ద నిర్మాతలనే పరిగణనలోనికి తీసుకుంటామని అన్నారు. అలాంటప్పుడు పరిశ్రమలోని చిన్న నిర్మాతల బాధలను ఎవరికి చెప్పాలి? అని అన్నారు.
ప్రతీ రోజు థియేటర్స్‌లో ఐదు షో లకు.. చిన్న సినిమాల కోసం మధ్యాహ్నం 2-30 గంటలకు ఒక షో వేసుకునేలా నిబంధన తప్పనిసరి చేస్తామని చెప్పిన ప్రభుత్వ హామీలేవీ అమలు కాకపోవడం విచారకరం. ఇప్పటికైనా ఈ దిశగా పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని కోరుతున్నాను’’ అని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.