NDA | విధాత: బీజేపీ కొత్త మిత్రల కోసం వేట మొదలు పెట్టింది. ఛిన్నాభిన్నమైపోయిన ఎన్‌డీఏను తిరిగి నిర్మించడానికి తంటాలు పడుతున్నది. శివసేన, అకాలీదళ్‌, జేడీయూ దూరమైన తర్వాత బీజేపీ దాదాపు ఒంటరయింది. బీజేపీ నాయకత్వం కూడా గత మూడేళ్లలో ఏనాడూ ఎన్‌డీఏ గురించి పెద్దగా బెంగ పడలేదు. మొన్న పార్లమెంటు భవనం సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై బహిష్కరణ కార్యక్రమం ప్రకటించిన తర్వాతనే బీజేపీ మళ్లీ ఎన్‌డీఏ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఎన్‌డీఏలో […]

NDA |

విధాత: బీజేపీ కొత్త మిత్రల కోసం వేట మొదలు పెట్టింది. ఛిన్నాభిన్నమైపోయిన ఎన్‌డీఏను తిరిగి నిర్మించడానికి తంటాలు పడుతున్నది. శివసేన, అకాలీదళ్‌, జేడీయూ దూరమైన తర్వాత బీజేపీ దాదాపు ఒంటరయింది. బీజేపీ నాయకత్వం కూడా గత మూడేళ్లలో ఏనాడూ ఎన్‌డీఏ గురించి పెద్దగా బెంగ పడలేదు.

మొన్న పార్లమెంటు భవనం సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై బహిష్కరణ కార్యక్రమం ప్రకటించిన తర్వాతనే బీజేపీ మళ్లీ ఎన్‌డీఏ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఎన్‌డీఏలో పెద్ద పార్టీలేవీ లేవు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న పార్టీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరయిన పార్టీలతో మళ్లీ దోస్తీ చేయడానికి బీజేపీ ఉత్సాహం చూపిస్తున్నది.

అందులో భాగంగానే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో హోంమంత్రి అమిత్‌షా సమావేశం జరిగినట్టు చెబుతున్నారు. అకాలీదళ్‌ నాయకులతో కూడా మళ్లీ దోస్తీ మొదలయింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు రాకపోతే ఏమి చేయాలన్న ఆందోళన బీజేపీని తొందర పెడుతున్నది. ఎన్‌సీపీని కూడా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం జరిగింది.

కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అంచనా వేసిన ఎన్‌సీపీ నాయకత్వం వెనుకడుగు వేసింది. బీజేపీ కర్ణాటకలో జేడీఎస్‌ను దగ్గరకు తీసుకుంటుందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కుమార స్వామి.. ఓటమి పాలైన బీజేపీతో జతకడతారా అన్నది వేచి చూడాలి. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య బంధం ఏమీ లేదని రాష్ట్ర నాయకులు చెబుతున్నా.. ఢిల్లీ స్థాయిలో ఏదో నడుస్తున్నదన్న చర్చ మాత్రం సాగుతున్నది.

బిజూ పట్నాయక్‌ ఎలాగూ మద్దతు ఇస్తారన్న నమ్మకం బీజేపీకి ఉంది. అయినా మెజారిటీకి ఈ సీట్లు చాలకపోవచ్చు. చాలా రాష్ట్రాలలో బీజేపీ గ్రాఫ్‌ బాగా పడిపోయింది. గత ఎన్నికల్లో నూటికి నూరు శాతం లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న బీజేపీ ఈసారి సగం స్థానాలు గెల్చుకోవడం కూడా కష్టమేనని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అకాలీదళ్‌, అప్నాదళ్‌, జేడీఎస్‌, టీడీపీ, వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ, నాగాలాండ్‌ పీపుల్స్‌పార్టీ, ఎన్‌డీపీపీ వంటి అనేక పార్టీలను మళ్లీ ఎన్‌డీఏలోకి తీసుకురావడానికి బీజేపీ సకల ప్రయత్నలూ చేస్తున్నట్టు కనిపిస్తున్నది.

లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే ఏకైక పెద్ద పార్టీ లేక కూటమిని ముందుగా అధికారం చేపట్టవలసిందిగా ఆహ్వానించాల్సి ఉంటుంది. బీజేపీకి సొంతంగా ఈ సారి 150 నుంచి 200 స్థానాలలోపే వస్తాయని పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. అటువంటప్పుడు తప్పనిసరిగా మిత్రపక్షాలు అవసరం అవుతాయి. అదికూడా ఎన్నికలకు ముందు జట్టు కట్టిన కూటమి కావాలి. అందుకే ఎన్‌డీఏను పునరుద్ధరించడం బీజేపీకి తప్పనిసరి అయింది.

అటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు ముందే వీలైనన్ని పార్టీలు ఒకే కూటమిగా ఆవిర్భవించడానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌, జేడీయూ, ఎన్‌సీపీ, శివసేన, డీఎంకె, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్‌, ఐయూఎంఎల్‌ వంటి పక్షాలన్నీ ముందుగానే ఒక కూటమిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా ఈ రాజకీయ పక్షాలు ఒక వేదిక మీదికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ తన ప్రయత్నాల్లో తాను ఉన్నది.

Updated On 5 Jun 2023 2:54 PM GMT
krs

krs

Next Story