- WHO నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదని పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టిన నేపాల్
విధాత: నేపాల్ ప్రభుత్వం భారత ఫార్మాసిటికల్ కంపెనీలు ఎగుమతి చేస్తున్న ఔషధాలు నాణ్యతా లోపంతో ఉన్నాయని గుర్తించి పలు కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధ కంపెనీలు తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించటం లేదని గుర్తించి ఈ చర్యకు పూనుకున్నది. వీటిలో యోగా గురుగా ఖ్యాతిగాంచిన పతంజలి ఉత్పత్తుల యజమానిగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రామ్ దేవ్ బాబా కంపెనీ కూడా నిషేధిత జాబితాలో ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలో నేపాల్ ఔషధ నియంత్రణ మండలి నుంచి భారత్‌కు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్- జూలై మాసాల మధ్య భారత్‌కు పంపింది. వీరు దేశంలోని పలు ఔషధ తయారీ సంస్థలను పరిశీలించి అవి సరియైన ఉత్పత్తి నాణ్యతను పాటించటం లేదని తేల్చారు. దీంతో నేపాల్ భారత్‌కు చెందిన పలు ఔషధ తయారీ కంపెనీలను నేషేధించింది.
హరిద్వార్‌లోని దివ్య ఫార్మసీ కంపెనీ రామ్‌దేవ్ బాబాకు సంబంధించినది. ఇది అనేక ఔషధాలను తయారీ చేసి ఖాట్మాండ్‌కు ఎగుమతి చేస్తున్నది. ఈ కంపెనీ కూడా నాణ్యతను పాటించటం లేదని నేపాల్ ఆరోపిస్తున్నది. దీంతో పాటు భారత్‌కు చెందిన 16 ఫార్మా కంపెనీలను నేపాల్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఈ కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మందులను తయారు చేయటం లేదని ఆరోపించటం గమనార్హం.