- ఈ నెల16 నుంచి పాదయాత్ర చేప్టిన భట్టి
- తన పాదయాత్ర ఎందుకు ఆపారన్న మహేశ్వర్‌రెడ్డి
విధాత: అంతా సర్దుకుంటున్నది అనుకున్న సమయంలో కాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి మొదలైందా? పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (PCC Chief Revanth Reddy) పాదయాత్రతో అంతా కలిసి నడుస్తారన్నకున్న సమయంలో ఎవరికి వారు పాదయాత్రలకు సిద్ధమవుతుండటం పార్టీకి సానుకూలమవుతుందా? వ్యతిరేకమవుతుందా? అన్న చర్చ నడుస్తున్నది.
ఇప్పటికే రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో (Hath Se Hath Jodo) పేరిట యాత్ర నిర్వహిస్తుంటే.. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మరో పాదయాత్రకు సన్నద్ధమయ్యారు. షెడ్యూలు కూడా విడుదల చేశారు. ఈయనకు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మద్దతు కూడా పలికారు.
మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన కొన్నాళ్లకు ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి తాను సైతం పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే కారణాలేమిటనేది తెలియదు కానీ మహేశ్వర్‌రెడ్డి (Maheswar Reddy) పాదయాత్ర నాలుగు రోజుల తర్వాత ముందుకు సాగలేదు. ఇన్నాళ్లూ నోరు మెదపని మహేశ్వర్‌రెడ్డి.. తాజాగా తన పాదయాత్రను ఎవరో ఆపారని ఆరోపణ చేశారు.
దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరో తేలాలని పట్టుబట్టారు. ఈ మేరకు పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేకు భారీ లేఖ రాశారు. సీనియర్లంతా పాదయాత్రలు చేయాలని చెప్పిన మేరకే తాను యాత్ర మొదలు పెట్టానని అయితే.. మీరే ఈ యాత్ర ఆపాలంటూ తనను ఆదేశించారని గుర్తు చేశారు. ఇన్నాళ్లూ దీనిపై మాట్లాడని మహేశ్వర్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. రేవంత్ పాదయాత్రకు ప్రజల్లో స్పందన కూడా బాగానే కనిపిస్తున్నది.
నాయకులు కూడా విబేధాలు పక్కనపెట్టి పాదయాత్రలో కలుస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ వాతావరణాన్ని సరిగ్గా వాడుకుంటూ కాంగ్రెస్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు లేకపోలేదన్న చర్చ కూడా ఉన్నది. కాంగ్రెసోళ్లు ఒక్కటైతే చాలు.. అధికారం వాళ్లకే వస్తుందని సామాన్య గ్రామీణ ప్రజలు కూడా అంటున్నారు.
ఒక మంచి వాతావరణ నెలకొన్నదని పార్టీ అధిష్ఠానం భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో విబేధాలు పూర్తిగా కనుమరుగు కావడం అనేది అసాధ్యమని ఆ పార్టీ నేతలే రుజువు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమలో అంతర్గత విబేధాలు ఇంకా ఉన్నాయనే సంకేతాలను పలువురు నేతలు పంపుతున్నారని అంటున్నారు.