Medical colleges విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను శుక్రవారం ప్రారంభించనున్నారు. వర్సవల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఒకేసారి ప్రారంభించనున్నారు. కాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు గత ఏడాది మే నెలలోనే ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో సుమారు ఐదు ఎకరాల స్థలంలో రూ.166 కోట్ల నిధులతో ఈ పనులను చేపట్టారు. మొత్తం […]

Medical colleges
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను శుక్రవారం ప్రారంభించనున్నారు. వర్సవల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఒకేసారి ప్రారంభించనున్నారు. కాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు గత ఏడాది మే నెలలోనే ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో సుమారు ఐదు ఎకరాల స్థలంలో రూ.166 కోట్ల నిధులతో ఈ పనులను చేపట్టారు. మొత్తం 6 బ్లాకులు ఉన్నాయి. ల్యాబ్ పరికరాలు కూడా వచ్చాయి.
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తరగతులు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కాళోజీ నారాయణ రావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించిన కౌన్సెలింగ్ లో ఇప్పటి వరకు 68 మంది విద్యార్థులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈ కళాశాలను ఎంపిక చేసుకున్నారు. సంవత్సరానికి 100 చొప్పున, ఐదేళ్లలో 500 సీట్లు భర్తీ కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల నియామకం కూడా చేపట్టింది. నిబంధనల మేరకు ఫౌండేషన్ కోర్సులను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
26 మంది ప్రొఫెసర్ల నియామకం
ఆదివాసి గిరిజన జిల్లా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసుకొని, ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, ఆసిఫాబాద్ శాసనసభ్యుడు ఆత్రం సక్కు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జున చారితో కలిసి మెడికల్ కాలేజీ బిల్డింగ్, లేబొరేటరీ, సిబ్బంది గదులు, తరగతి గదులు, వివిధ విభాగాలను పరిశీలించారు. అయితే తరగతులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం 26 మంది ప్రొఫెసర్లను కూడా నియమించింది. ఈ కాలేజీలో వంద సీట్ల భర్తీకి ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
ఇప్పటికే కౌన్సెలింగ్ ద్వారా ఈ కళాశాలను ఎంపిక చేసుకున్న విద్యార్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తయ్యింది. పలువురు స్థానిక వైద్య విద్యార్థులకు ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో సీట్లు రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతోపాటు కొమరం భీం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. గిరిజన ప్రాంతమైన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ప్రారంభం కాబోతుండటంతో ఇక్కడి గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
