Germany | రానున్న దీపావళి సందర్భంగా జర్మనీ (Germany)లోనే అతిపెద్ద హిందూ ఆలయం (Hindu Temple) లో పూజలు ప్రారంభంకానున్నాయి. భద్రాద్రి ఆలయాన్ని నిర్మించడానికి రామదాసు ఆర్థికంగా కష్టాలు పడి.. సాధించినట్లుగానే.. ఈ జర్మనీ వెనకాలా ఒక రామదాసు కష్టం ఉంది. ఆయనే 70 ఏళ్ల విల్వనాథన్ కృష్ణమూర్తి. ఏకంగా 20 ఏళ్ల క్రితం ఆయన ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణానికి పునాది రాయి పడగా.. ఆగుతూ.. సాగుతూ ఈ ఏడాది దీని నిర్మాణం పూర్తవుతోంది. ఈ […]

Germany |
రానున్న దీపావళి సందర్భంగా జర్మనీ (Germany)లోనే అతిపెద్ద హిందూ ఆలయం (Hindu Temple) లో పూజలు ప్రారంభంకానున్నాయి. భద్రాద్రి ఆలయాన్ని నిర్మించడానికి రామదాసు ఆర్థికంగా కష్టాలు పడి.. సాధించినట్లుగానే.. ఈ జర్మనీ వెనకాలా ఒక రామదాసు కష్టం ఉంది. ఆయనే 70 ఏళ్ల విల్వనాథన్ కృష్ణమూర్తి.
ఏకంగా 20 ఏళ్ల క్రితం ఆయన ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణానికి పునాది రాయి పడగా.. ఆగుతూ.. సాగుతూ ఈ ఏడాది దీని నిర్మాణం పూర్తవుతోంది. ఈ మధ్య కాలంలో ఈ నిర్మాణానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలిచాయి. స్థానిక ప్రభుత్వాల నుంచి సాయం అందేది కాదు. 20 ఏళ్ల క్రితం జర్మనీలో స్థిరపడిన భారతీయులు తక్కువ మందే కావడంతో.. విరాళాలూ అంతంత మాత్రంగానే వచ్చేవి.
సుమారు 50 ఏళ్ల క్రితం జర్మనీ రాజధాని బెర్లిన్‌కు ఉద్యోగం నిమిత్తం కృష్ణమూర్తి వలస వచ్చారు. అప్పటి నుంచి జర్మనీలో ఉండే హిందువుల కోసం ఎలాగైనా ఒక ఆలయాన్నినిర్మించాలని సంకల్పించారు. అలా 2004లో ఆలయ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు. కిందా మీదా పడి బెర్లిన్ డిస్ట్రిక్ట్ అథారిటీ నుంచి ఒక స్థలాన్ని పొందారు.
అనంతరం 2007లో మొదలవ్వాల్సిన గుడి నిర్మాణం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2010కి కానీ ప్రారంభం కాలేదు. ఈ ఇబ్బందులే కాకుండా స్థానిక చట్టాలు, అనుమతుల మంజూరు మొదలైన అంశాల్లోనూ తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. స్థానిక లేదా జర్మనీ ఫెడరల్ ప్రభుత్వాలు సాయం చేయడానికి ఏ మాత్రం ముందుకు రాలేదని, తమ సొంత కష్టంతోనే ఈ ఆలయం నిర్మించామని కృష్ణమూర్తి పేర్కొన్నారు.
ఈ క్రమంలో జర్మనీకి వలస వచ్చే భారతీయుల సంఖ్య పెరగడం.. వారు పెద్ద మొత్తాల్లో విరాళాలు ఇవ్వడంతో గత అయిదారేళ్లలో నిర్మాణం వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తి కాగా.. విగ్రహ ప్రతిష్ఠాపనను నవంబరులో ఆరు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని కృష్ణమూర్తి వెల్లడించారు.
ఇంకా విగ్రహాలు ఇక్కడకి చేరుకోలేదు. 5000 ఏళ్ల నాటి గ్రంథాల ఆధారంగా వాటిని భారత్‌లోనే వాటిని చెక్కిస్తున్నాం. మొత్తం 27 దేవతా విగ్రహాలు ఈ భారీ ఆలయంలో కొలువుదీరుతాయి.
దీపావళి దగ్గర్లో ఆరు రోజుల పాటు జరిగే క్రతువులో వాటిని ప్రతిష్ఠిస్తాం అని తెలిపారు. ఇన్ని కష్టాలు వచ్చినపుడు ఆలయ నిర్మాణాన్ని నిలిపివేయాలని అనిపించలేదా అనే ప్రశ్నకు.. మేము దేవుణ్ని నమ్మాం. ఆయనే ప్రోత్సహించాడని సమాధానమిచ్చారు.
