New Year Celebrations | కొత్త సంవత్సరం పురస్కరించుకొని మందుబాబులు మద్యంలో మునిగి తేలడం సహజం. ఇక మద్యానికి దూరంగా ఉండేవారైతే.. వారి కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం మద్యం మత్తులో పాముతో సంబురాలు చేయబోయి అది కాస్తా కాటేయడంతో మరణించాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కడలూరు జిల్లాకు చెందిన మణికందన్ అలియాస్ పప్పు అనే యువకుడు డిసెంబర్ 31వ తేదీన పీకల దాకా మద్యం సేవించాడు. అదే సమయంలో అనుకోకుండా వచ్చిన ఓ పామును మణికందన్ పట్టుకున్నాడు. అంతటితో ఆ యువకుడు ఆగకుండా ఆ పాము న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ తన స్నేహితులకు పామును చూపిస్తూ గట్టిగా అరిచాడు.
దీంతో బెదిరిన పాము రెప్పపాటులో మణికందన్‌ను కాటేసింది. దీంతో అతని పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే చనిపోయాడు. మణికందన్‌తో పాటు మరో యువకుడు కపిలన్‌ను కూడా ఆ పాము కాటేయగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.