రెండు రోజుల్లో 39 మందికి కోవిడ్ నిర్ధారణ
విధాత: చైనాతో పాటు పలుదేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు మరోసారి ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. కొత్త వేరియంట్లతో మరో వేవ్ తప్పదని ఇది వరకు నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. డ్రాగన్ కంట్రీలో ఒమిక్రాన్ బీఎఫ్7 వేరియంట్‌తో పాటు పలు వేరియంట్లు విలయం సృష్టిస్తున్నాయి.
ఈ క్రమంలో కీలక వార్త వెలుగులోకి వచ్చింది. జనవరిలో భారత్‌లో కొవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే 40 రోజులు భారత్‌కు కీలకమని పేర్కొంటున్నారు. గతంలో కొవిడ్ విజృంభించిన తీరును బట్టి వచ్చే జనవరి నెల మధ్యలో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
తూర్పు ఆసియా కరోనా బారిన పడిన 30-35 రోజుల తర్వాత భారతదేశంలో కేసులు వచ్చాయని, ఇదో ట్రెండ్‌గా మారిందని పేర్కొన్నాయి. కరోనా కేసులు పెరిగినా మరణాల సంఖ్య, ఆసుపత్రిలో చేరే రేటు చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.
చైనా, దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సన్నద్ధం కావాలని కేంద్రం సూచిందింది. బీఎఫ్.7 ముప్పు, కోవిడ్ కేసుల పెరుగుదలను నివారించేందుకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం వరుస భేటీలు నిర్వహించారు.
BF.7 వేరియంట్ వ్యాప్తి రేటు భారీగా ఉంటుందని, ఈ వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి 16 మంది వరకు సోకుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
గత రెండు రోజుల్లో 39 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పరిశీలించనున్నారు.