Saturday, January 28, 2023
More
    Homelatestతెలంగాణకు షాక్‌: మానేరులో ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ NGT ఆదేశాలు

    తెలంగాణకు షాక్‌: మానేరులో ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ NGT ఆదేశాలు

    • ఉల్లంఘిస్తే తీవ్ర ప‌రిణామాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ

    విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా కోర్టులో బుధవారం ఎదురు దెబ్బలు తగిలాయి. పెద్దపెల్లి జిల్లా మానేరు నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలపై చెన్నైలోని సౌత్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

    మానేరు పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ఈ ఆదేశాల్లో ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది.

    నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపెల్లి జిల్లా మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నట్టు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై ట్రిబ్యునల్ ఈ మేరకు పై ఆదేశాలు జారీ చేసింది.

    ప్రభుత్వం, ఇతరుల పై వేసిన పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ లోని జుడిషియల్ మెంబర్ జస్టిస్ పుష్ప సత్యనారాయణ, ఎక్స్‌పర్ట్ మెంబర్ డాక్టర్ కొర్లపాటి సత్యగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి జరిగిన వాదోపవాదాల్లో ఇప్పటివరకు మానేరు పరివాహ‌క ప్రాంతంలో ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వాటి పూర్తి వివరాలు కొనసాగుతున్న తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వ పక్షాన స్పష్టమైన వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

    తదుపరి ఇరువర్గాల వాదనలు విని తమ తీర్పు వెల్లడిస్తామని అయితే అప్పటివరకు తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు జారీ చేసిన ఆదేశాలు అమల్లోనే ఉంటాయని స్పష్టంగా పేర్కొంది. జిల్లా కలెక్టర్ సంబంధించిన అధికారులకు స్పష్టం చేశారు.

    పెద్దపల్లి జిల్లా మానేరు వాగు నుండి ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవద్దని చెన్నై బెంచ్ ఆదేశాలిచ్చింది. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ (EC) వచ్చే వరకు ఇసుక తవ్వకాలు, రవాణా ఏది చేయవద్దని ఆదేశించారు. ఈ ఆర్డర్ ఉల్లంఘన చేస్తే తీవ్రంగా పరిగణించబడుతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది.

    నిలిచిపోనున్న ఇసుక తవ్వకాలు

    నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతి తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఇసుక తవ్వకాలలో, మైనింగ్‌లో అక్రమాలు ఏవైనా జరిగితే త్వరలో వెలుగులోకి రానున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు ప్రభుత్వ అనుమతి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో తాజా ట్రిబ్యునల్ ఆదేశాలు సర్కారుకు ఇబ్బందిగా మారాయి. ఈ ఉత్తర్వుల పైన సంబంధిత అధికారులు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందోననే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్యక్తమవుతోంది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular