- పేదల కోసం ‘జగనన్న చేదోడు’
విధాత: జగన్ స్పష్టంగా తేల్చేశారు. మొదట్నుంచీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడమే పాలసిగా పెట్టుకున్న జగన్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మార్గంలో పయనిస్తారట. సింహం సింగిల్ గా వస్తుంది.. తోడేళ్ళు మాత్రమే గుంపుగా వస్తాయి. అయినా సింహం వెనకడుగు వేసేది లేదంటూ టిడిపి.. జనసేన కూటమిని ఎత్తి పొడుస్తున్నారు.
వచ్చే ఎన్నికలు పేదవాడికి పెత్తందారుకు మధ్య జరిగే యుద్ధమని, ముసలి చంద్రబాబు కావాలో.. యువకుడైన తాను కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఏపీలో చిన్న తరహా వ్యాపారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకమే ‘జగనన్న చేదోడు.
ఈ పథకంలో భాగంగా మూడో విడత నిధుల విడుదలలో భాగంగా వినుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణలుకు ఏటా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు చెందిన 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను ఆన్‌లైన్ ద్వారా బటన్ నొక్కి జమ చేశారు.
తోడేళ్లన్నీ ఒక్కటై వచ్చినా సింహం సింగిల్‌గా వస్తుంది.
– సీఎం వైయస్ జగన్#JaganannaChedhodu pic.twitter.com/2p51FJuFWE— YSR Congress Party (@YSRCParty) January 30, 2023
అనంతరం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ప్రచారం చేస్తున్నారని కానీ ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. సీఎంగా ముసలాయాన ఉన్నప్పుడు ఈనాడు టీవీ5 ఆంధ్రజ్యోతి దత్తపుత్రుడు వీళ్లంతా గజ దొంగల ముఠాలా దోచుకున్నారని ఆరోపించారు.
ఇప్పుడున్న బడ్జెట్ అప్పుడూ ఉందని.. మరి తాను అమలు చేస్తున్న పథకాలను అప్పుడు వారెందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో డీపీటీ అంటే దోచుకో పంచుకో తినుకో అని సీఎం జగన్ ప్రతిపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారుగా అని జగన్ ప్రశ్నించారు. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయన్నారు. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు అన్నారు. మీ బిడ్డకు ఎలాంటి పొత్తుల్లేవని.. మీ బిడ్డ వాళ్ల మీద వీళ్ల మీద నిలబడడని వెల్లడించారు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదని చెప్పారు.
గతంలో సీఎంగా ముసలాయన ఉండేవాడు..దోచుకోవడమే వారి పని
– సీఎం వైఎస్ జగన్#JaganannaChedhodu pic.twitter.com/aI5ilANrf1
— Rahul (@2024YCP) January 30, 2023
ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడని వెల్లడించారు. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే వెన్నుపోట్లు మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు అవినీతికి చోటు లేని పాలన కావాలా? అని ప్రశ్నించారు. మొత్తానికి జగన్ రాజకీయ ప్రచారం ప్రారంభించినట్లేనా.. వైరి పక్షాలకు ఓ వార్నింగ్ ఇచ్చినట్లేనా అని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.