Saturday, April 1, 2023
More
    HomelatestWarangal: విపక్షాలకు నో ఛాన్స్.. అధికార పక్షం అలర్ట్.. చకచకా పావులు కదిపిన BRS

    Warangal: విపక్షాలకు నో ఛాన్స్.. అధికార పక్షం అలర్ట్.. చకచకా పావులు కదిపిన BRS

    • మహిళా సర్పంచ్‌కు లైంగిక వేధింపుల ఆరోపణలు
    • ఎమ్మెల్యే రాజయ్యపై సుమోటోగా కేసు
    • విమర్శల నేపథ్యంలో స్పందించిన మహిళా కమిషన్
    • సర్పంచ్‌కు స్వపక్ష వ్యతిరేకం, విపక్షం మద్దతు

    విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో నెలకొన్న హాట్ రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకుండా అధికార గులాబీ పార్టీ అలర్ట్ అయింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కవితపై చేసిన కామెంట్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని ఆయనను టార్గెట్ చేసిన సందర్భంలో, తమ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య పై అదే పార్టీ మహిళా సర్పంచ్ చేసిన ఆరోపణలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే ప్రమాదం ఉందని గుర్తించిన గులాబి పార్టీ చకా చకా పావులు కదిపింది.

    ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఆరోపణలపై విచారించాలని ఆదేశించారు. దీంతో గులాబీ పార్టీపై విమర్శలకు అవకాశంగా తీసుకోవాలని భావించిన బిజెపికి ప్రస్తుతానికి చెక్ పెట్టిన‌ట్టైంది.

    సుమోటోగా స్వీకరించించిన.. మహిళా కమిషన్‌

    మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యపై ఆ పార్టీ మహిళా సర్పంచ్ చేసిన లైంగిక వేధింపుల వ్యవహారంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ఆదివారం డీజీపీని ఆదేశించింది. వ్యక్తిగతంగా రాజయ్యను డీజీపీ విచారించాలని సూచించింది. సర్పంచ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.

    బండి సంజయ్ టార్గెట్‌గా ఆందోళనలు

    ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ చేసిన కామెంట్స్ రచ్చకు దారి తీశాయి. ఇదే విషయంపై శనివారం రాష్ట్రవ్యాప్తంగా సంజయ్‌ని టార్గెట్ చేస్తూ బిఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. ఈ సంఘటనకు రెండు రోజుల ముందు ఎమ్మెల్యే రాజయ్య పై మహిళా సర్పంచ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు చేసిన సంగతి విదితమే.

    ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ ఆరోపణలు

    ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్ తనను ఓ మహిళ ద్వారా ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు బహిరంగంగానే ఆరోపించిన విషయం స్థానికంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు మూడు రోజులుగా ఈ అంశం అధికార పార్టీని ఇరుకున పెడుతోంది. విపక్షాలకు మంచి ఆయుధం లభించింది.

    నవ్య ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఎమ్మెల్యే రాజయ్య ఇప్పటికే విమర్శించారు. తమ పార్టీలోని కొందరు నాయకుల సహకారంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో మహిళా కమిషన్ స్పందించడంతో మరోసారి రాజయ్య ఇబ్బందుల్లో పడ్డారు.

    నవ్యకు విపక్షాల మద్దతుతో అధికార పక్షం అలర్ట్

    ఎమ్మెల్యే రాజయ్య పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సర్పంచ్ కురసపల్లి నవ్య పై స్వపక్ష గులాబీ నాయకులు విమర్శలు చేస్తుండగా, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ రఘునాథపల్లిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, బీజేపీ హనుమకొండ జిల్లా నాయకత్వం సరాసరి నవ్య ఇంటికి వెళ్లి పరామర్శించి మద్దతు తెలిపారు.

    కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని బీజేపీ గుర్తించింది. టీఆర్ఎస్ విమర్శలకు పోటీగా గులాబీ పార్టీ మహిళ సర్పంచ్ నవ్య పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లైంగిక వేధింపుల అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమయ్యింది.

    సంజయ్ పై బీఆర్ఎస్ చేస్తున్న దాడికి కౌంటర్‌గా నవ్య అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నది. ఈ సమాచారం తెలిసిన అధికార పార్టీ అన్ని రకాలుగా అలర్ట్ అయింది. విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని భావించి అప్రమత్తమైంది.

    నిన్నటివరకు స‌డీ చప్పుడులేని రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డీజీపిని ఆదేశించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితులలో ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం కూడా దక్కకుండా చేసేందుకు, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ మేరకు మహిళా కమిషన్ స్పందించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular