Thursday, March 23, 2023
More
  Homelatestయాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం

  యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం

  • అధినాయకత్వం మాట బే ఖాతర్!
  • ‘పుర’ అవిశ్వాసాల్లో గులాబీ కౌన్సిలర్లు!
  • నందికొండ, యాదగిరిగుట్టలలో అవిశ్వాసం ప్రతిపాదనలు

  విధాత: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల పాలకవర్గాలకు మూడేళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రస్తుత చైర్మన్లపై అసమ్మతితో ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలకు సిద్ధపడుతుండటం అధికార బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది.

  బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఒకవైపు పార్టీని జాతీయ రాజకీయాల్లో ముందుకు దూకించే పనిలో ఉండగా, రాష్ట్రంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన అసమ్మతి స్వరాలు పెరుగుతుండటం సమస్యగా మారింది. దీనికి తోడు మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టేందుకు మూడేళ్ల పదవి కాలం పూర్తి కావాలన్న నిబంధన ముగిసిపోవడంతో మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘట్టాలకు తెరలేవడం మరిన్ని చికాకులు కల్పించేదిగా తయారైంది.

  స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు చెప్పిన మున్సిపాల్టీలలో అవిశ్వాసాలపై అసమ్మతి కౌన్సిలర్లు వెనక్కి తగ్గకపోవడం పార్టీ వ్యవహారాల నియంత్రణకు సవాల్ విసురుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నందికొండ, యాదగిరిగుట్టలలో అసమ్మతి కౌన్సిలర్లు ప్రస్తుత చైర్మన్లపై అవిశ్వాసానికి సిద్ధమవడం బీఆర్ఎస్ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది.

  నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ కర్ణ అనూషపై అవిశ్వాసం పెట్టేందుకు అసమతి కౌన్సిలర్లు ఏడుగురు సిద్ధమై క్యాంపు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో తొమ్మిది మంది బీఆర్ఎస్ ,ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లుగా ఉండగా వారిలో ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ మృతి చెందారు. ప్రస్తుత చైర్మన్ కర్ణ అనూషపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమై క్యాంపు రాజకీయాలకు తెరలేపడం ఆసక్తికరం.

  యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ చైర్మన్ ఎరుకల సుధా హేమేంధర్ గౌడ్ పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. చైర్మన్ పదవి హామీతో ఇటీవల కాంగ్రెస్ నుండి పలువురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ లో చేరారు. మారిన సమీకరణల నేపథ్యంలో ప్రస్తుత చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ పై కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌన్సిలర్లు, బీఆర్ఎస్ అసమతి కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

  మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ నాలుగు, ఆ పార్టీతో కలిసి పోటీ చేసిన సిపిఐ ఒకటి, ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ కూటమికే చైర్మన్ పీఠం దక్కుతుందని భావించారు. అయితే బిఆర్ఎస్ నలుగురు కౌన్సిలర్లకు తోడు మరో ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఎక్స్ అఫీషియ సభ్యులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి , కర్నే ప్రభాకర్, ఎమ్మెల్యే విప్ గొంగడి సునీత ఓట్లతో కలిపి సుధా మహేందర్ గౌడ్ చైర్మన్ పీఠం సాధించారు.

  కాంగ్రెస్ నుంచి ఇటీవలె బీఆర్ఎస్ లో చేరిన గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ చైర్మన్ పీఠం సాధనకు మొత్తం పదిమంది కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాసం ప్రతిపాదన పెడుతున్నారు. మారిన రాజకీయాల నేపథ్యంలో సిపిఐ పార్టీ కౌన్సిలర్ బీఆర్ఎస్‌లో చేరిన వాణి భరత్‌కు మద్దతిస్తున్నారు.

  గుట్ట చైర్మన్ పై అవిశ్వాస విషయం తెలుసుకున్న అధిష్టానం ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని సునీత మహేందర్రెడ్డిలను ఆదేశించగా, సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్లతో వారు భేటీయై చర్చలు జరిపారు. అయితే వాణి భరత్ వర్గం మాత్రం అవిశ్వాసం ప్రతిపాదనపై వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు. ఆ వెంటనే గుట్ట మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలని కోరుతూ అసమ్మతి కౌన్సిలర్లు పది మంది జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి కలిసి అవిశ్వాసం నోటీసును అందజేశారు.

  వారిలో వైస్ చైర్మన్ కాటం రాజు, కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, ముక్కెర్ల మల్లేష్, అనిల్, మమత, సురేందర్, విజయలక్ష్మీ, అరుణ, నాగరాజు, మౌనికలు ఉన్నారు. వారంతా అక్కడి నుంచి క్యాంప్‌కి వెళ్లేందుకు బయలు దేరారు. ఈ సమస్య రచ్చ కాకుండా ఉండేందుకు ప్రస్తుత చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్‌ను స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని ఒప్పించే ప్రయత్నాల్లో సునీత మహేందర్ రెడ్డిలు చర్చలు కొనసాగిస్తుండటం విశేషం.

  ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాలియా, దేవరకొండలలో సైతం అవిశ్వాసం ఆలోచనలో చేస్తున్నట్లుగా ప్రచార సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో వికారాబాద్, తాండూర్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట్, జనగామ, మేడ్చల్, నిజాంపేట్, బోడుప్పల్, గుండ్ల పోచంపల్లి, ఘట్కేసర్ ,పోచారం, నాగారం మున్సిపాలిటీలలో సైతం అవిశ్వాసం ప్రతిపాదనల రాజకీయాల్లో మునిగిపోవడంతో అధికార బీఆర్ఎస్‌కు పెద్ద తలనొప్పిగా తయారైంది.

  యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ను కలిసిన కౌన్సిలర్లు వైస్ చైర్మన్ కాటం రాజు, గుండ్లపల్లి వాణి, ముక్కెర్ల మల్లేష్, అనిల్, మమత, సురేందర్, విజయలక్ష్మీ, అరుణ, నాగరాజు, మౌనికతో పాటు బిట్టు సరోజ కూడా ఉన్నారు. మొత్తం11మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతునిచ్చారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular