Nirmala Sitharaman | గత కొద్దిరోజులుగా రూ.2000నోట్ల చెలామణి తగ్గింది. బ్యాంకులతో పాటు ఏటీఎం మిషన్లలో నోట్లు ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో రూ.2000నోట్లను కేంద్రం రద్దు చేయబోతుందని, అందుకే చెలామణి తగ్గిందన్న వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ కేంద్రం ఖండించింది. ఈ క్రమంలో ఏటీఎంలో రూ.2000నోట్ల లోడింగ్‌పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగదు వెండింగ్ మెషీన్లలో నోట్లను లోడ్ చేసే విషయంలో బ్యాంకు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయని, రూ.2000నోట్లు ఏటీఎంలలో ఉంచొద్దని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పార్లమెంట్‌కు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వార్షిక నివేదికల ప్రకారం.. 2022 మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ. 500, రూ. 2,000 డినామినేషన్ బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 27.057లక్షల కోట్లు అని ఆర్థికమంత్రి లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏటీఎంలలో రూ.2వేల నోట్లను పెట్టొద్దని బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, గత వినియోగం, వినియోగదారుల అవసరాలు, సీజనల్ ట్రెండ్ మొదలైన వాటి ఆధారంగా ఏటీఎంలలో మొత్తం, డినామినేషన్ అవసరాలను బ్యాంకులు సొంతంగా అంచనా వేస్తాయని పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ మార్చి 31, 2023 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాల మొత్తం సుమారు రూ. 155.8 లక్షల కోట్లనీ, ఈ అప్పుల శాతం జీడీపీలో 57.3 శాతంగా అంచనా వేసినట్లు తెలిపారు.