ఉన్నమాట: మునుగోడు రణగోడులా మారింది. పొటాపోటీగా జరుగుతున్న ప్రచారంలో కొన్నిచోట్ల బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, కొన్నిచోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఘర్షణలు సైతం చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంట్రాక్టుల కోసం తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ పలు పార్టీల కార్యకర్తలు ఆయన ప్రసంగాలకు అడ్డు తగులుతున్నారు. కాంట్రాక్ట్ ల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉండగా రాజగోపాల్ వ్యవహరం గడిచిన మూడు సంవత్సరాలుగా వివాదాస్పదంగానే ఉంటూ వస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి […]

ఉన్నమాట: మునుగోడు రణగోడులా మారింది. పొటాపోటీగా జరుగుతున్న ప్రచారంలో కొన్నిచోట్ల బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, కొన్నిచోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఘర్షణలు సైతం చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంట్రాక్టుల కోసం తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ పలు పార్టీల కార్యకర్తలు ఆయన ప్రసంగాలకు అడ్డు తగులుతున్నారు. కాంట్రాక్ట్ ల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలాఉండగా రాజగోపాల్ వ్యవహరం గడిచిన మూడు సంవత్సరాలుగా వివాదాస్పదంగానే ఉంటూ వస్తోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన తనకు, సోదరుడు భువనగిరి ఎంపీ వెంకట్‌రెడ్డిలకు అది దక్కక పవడంతో సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లపై విమర్శలు చేస్తూ రాజకీయంగా వివాదాస్పదమయ్యారు. ఇదేక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ ను బూచిగా చూపెట్టి బీజేపీలో చేరుతామంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నమూ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు అవసరమని ఆ పార్టీ అధినాయకత్వంపై అసమ్మతి స్వరం వినిపించిన జీ-23 నేతల పరిస్థితి ఏమైందో అర్థమైన తర్వాత కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ రియలైజ్ కాలేదు. తమను తాము అతిగా ఊహించుకున్నారు. ఇది ప్రస్తుతం రాజకీయంగా వారు ఎదుర్కొంటున్న విమర్శలకు, ఇబ్బందులకు ఓ కారణం అయింది.
మొదట రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడానికి సుముఖం వ్యక్తం చేసినా రాజీనామా చేయడానికి ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే బీజేపీ అధిష్ఠానం తన బలాన్ని అంచనా వేసుకోవడానికి ప్రయోగాత్మకంగా ఆయనతో రాజీనామా చేయించారనే ప్రచారం ఉన్నది.
చివరకు బీజేపీ బలవంతం మేరకు రాజగోపాల్ రాజీనామా చేయడానికి సిద్ధపడి ఆరు నెలల పాటు నియోజకవర్గంలో కొంత వర్క్ ఔట్ చేసుకోవడం.. అనంతరం రాజీనామా చేయడం వల్లనే ప్రస్తుతం ఆయన గట్టి పోటీ ఇచ్చే స్థితికి చేరుకున్నాడు.
ఈ మొత్తం వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డికి జరిగిన లాభనష్టాల కంటే రాజకీయంగా వెంకట్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక ఆ పార్టీలో నేతలు ఎవరు ఏదైనా మాట్లాడుతారు.
కానీ రేవంత్‌పై కోపంతో కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వారిని భవిష్యత్ లో రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా రేపటి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వారు తమ మనుగడ కోసం పోరాటం చేయాల్సిన దుస్థితిని కొని తెచ్చుకున్నారు.
నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రేపు ఉప ఎన్నిక ఫలితం తేల్చనుంది. ఫలితం ఏమాత్రం తేడా జరిగినా అదే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనే మాటలను కోమటిరెడ్డి అన్నదమ్ములు మరోసారి రుజువు చేసిన వారవుతారు.
