AP | మూణ్ణెల్లుగా 50 వేల మందికి జీతాలు లేవు ఆగస్ట్‌ నెల జీతాలు ఏ ఒక్క‌రికీ అంద‌లేదు ఈఎంఐలు, కుటుంబ పోష‌ణ కోసం పాట్లు బంగారం, ఆస్తులు కుద‌వ‌పెట్టి కిస్తీలు పెన్ష‌న‌ర్ల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం పీఎఫ్, జీఎల్ఐసీ, సీపీఎస్ నిధుల మ‌ళ్లింపు దివాలా తీసే స్థితిలో ఏపీ ఆర్థిక వ్యవస్థ విధాత: సెప్టెంబ‌ర్ నెల‌లో 11 రోజులు పూర్తి అయ్యాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, ఉపాధ్యాయుల‌కు చాలామందికి జీతాలు ప‌డ‌లేదు. మూడు నెల‌ల […]

AP |

  • మూణ్ణెల్లుగా 50 వేల మందికి జీతాలు లేవు
  • ఆగస్ట్‌ నెల జీతాలు ఏ ఒక్క‌రికీ అంద‌లేదు
  • ఈఎంఐలు, కుటుంబ పోష‌ణ కోసం పాట్లు
  • బంగారం, ఆస్తులు కుద‌వ‌పెట్టి కిస్తీలు
  • పెన్ష‌న‌ర్ల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం
  • పీఎఫ్, జీఎల్ఐసీ, సీపీఎస్ నిధుల మ‌ళ్లింపు
  • దివాలా తీసే స్థితిలో ఏపీ ఆర్థిక వ్యవస్థ

విధాత: సెప్టెంబ‌ర్ నెల‌లో 11 రోజులు పూర్తి అయ్యాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, ఉపాధ్యాయుల‌కు చాలామందికి జీతాలు ప‌డ‌లేదు. మూడు నెల‌ల క్రితం బ‌దిలీ అయిన సుమారు 50 వేల మంది ఉపాధ్యాయుల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైందని చెబుతున్నారు. వారికి సాంకేతిక కారణాల పేరుతో ప్ర‌భుత్వం మూడు నెల‌లుగా ఏ ఒక్క‌రికీ జీతాలు చెల్లించ‌డం లేదు. దీంతో ఈఎంఐల చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒంటిమీద బంగారం, ఆస్తుల‌ను వ‌డ్డీ వ్యాపారుల వ‌ద్ద తాక‌ట్టు పెట్టి, అప్పులు చేసి అవ‌స‌రాలు తీర్చుకుంటున్నామని పలువురు వాపోతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వద్ద జీతాలు చెల్లించ‌డానికి అవ‌స‌ర‌మైన నిధులు లేక‌పోవ‌డ‌మే ఈ పరిస్థితికి కార‌ణంగా తెలుస్తున్నది. ఈ ప‌రిస్థితి ఆగ‌స్ట్‌ నెల జీతాల‌కే పరిమితం కాదు. నెల నెలా 10వ తేదీ దాటినా జీతభత్యాలు చెల్లించలేని దివాలా స్థితిలోకి ఏపీ ప్ర‌భుత్వం వెళ్లిపోయిందని విమర్శిస్తున్నారు. మొత్తం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో శుక్రవారం సాయంత్రం వరకు 70 శాతం మందికి మాత్రమే జీతభత్యాలు బ్యాంకు ఖాతాలకు జమ అయిన‌ట్లు అధికారులు చెబుతున్నా, జీతాలు ప‌డ్డాయ‌ని చెబుతున్న ఉద్యోగులు మాత్రం క‌నిపించ‌డం లేదు.

పెన్షనర్లలో సుమారు 60% మందికి మాత్ర‌మే ఆగ‌స్ట్‌ పెన్షన్లు చెల్లించ‌డానికి స‌రిప‌డా నిధులు ఉన్న‌ట్లు స‌మాచారం. జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం కారణంగా బ్యాంకు లోన్లు, గృహ రుణాలు, పర్సనల్‌ లోన్లు తీసుకున్న ఉద్యోగులు నెలవారీ వాయిదాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతుండగా, పెన్షనర్లయితే మందులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక ఆందోళనతో ఉన్నారు. జీతాలు, పెన్షన్ల చెల్లింపునకు పాటిస్తున్న ప్రాధాన్యక్రమం లేదా ప్రామాణికత గురించి తమకు కూడా అర్థం కావడం లేదని ఖజానా వర్గాలు చెబుతున్నాయి.

బ‌దిలీ అయిన టీచ‌ర్ల ప‌రిస్థితి మ‌రీ అధ్వాన్నం

ఈ ఏడాది నూతన విద్యా విధానం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప హైస్కూళ్లలోకి విలీనం చేయడం, ఉన్నత పాఠశాలల్లో సెక్షన్లను కుదించడం, పదో తరగతి మినహా మిగతా తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే ఉంచి తెలుగు మాధ్యమాన్ని ఎత్తేయడం, రేషనలైజేషన్‌ తదితర కారణాల వల్ల వర్కింగ్‌ టీచర్ల పనిస్థానాల్లో భారీ కదలికలు వచ్చాయి.

దీనికి అనుగుణంగా గత జూన్‌లో బదిలీలు, పదోన్నతులను విద్యా శాఖ చేపట్టింది. సంస్కరణలకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు టీచర్‌ పోస్టులను సర్దుబాటు చేయడానికి పూర్తిస్థాయిలో కేడర్‌ స్ట్రెంగ్త్‌ను చేపట్టకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల‌మంది ఉపాధ్యాయుల‌కు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించ‌డం లేదు. దీనికి ప్ర‌భుత్వం కొన్ని సాంకేతిక కార‌ణాలు సాకుగా చెబుతోంది.

ఈ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా మూడు నెలల జీతాలు ఖజానా శాఖలోనే ఉండిపోయాయి. తాజాగా కేడర్‌ స్ట్రెంగ్త్‌ సమస్య పరిష్కారం కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచి టీచర్ల జీతాల బిల్లులను ట్రెజరీ శాఖ స్వీకరించడం, వాటిని పరిశీలించి ఆమోదించడం ప్రారంభమయ్యాయి. మరోవైపు హైస్కూల్‌ ప్లస్‌లకు పదోన్నతిపై వెళ్ళిన పీజీటీ/స్కూల్‌ అసిస్టెంట్లకు, ఎంఈవో–2లకు ఇంత వరకు జీతాభత్యాలు అందలేదని సమాచారం.

సీపీఎస్ ఉద్యోగుల‌ను ద‌గా చేస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం

తమను జగన్‌ ప్రభుత్వం భారీగా మోసం చేసిందని సీపీఎస్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీపీఎస్‌ రద్దుపై మాట మార్చిన ప్ర‌భుత్వం.. సీపీఎస్‌ ఉద్యోగుల జీతంలో మినహాయించిన వాటాతోపాటు, తన వాటా కూడా జ‌మ చేయ‌కుండా వారిని గందరగోళానికి గురిచేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 1.94 ల‌క్ష‌ల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్న‌ట్లు స‌మాచారం.

దాదాపు 14 నెలలుగా పర్మనెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌లో పైసా కూడా జమచేయ‌డం లేద‌ని ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇలా ఉద్యోగుల ప్రాన్ ఖాతాలో జ‌మ‌ చేసిన సుమారు 1500 కోట్లు (ఇందులో 750 కోట్లు సీపీఎస్ ఉద్యోగుల వాటా) గల్లంతైనట్టు అంచనా. దీంతో ఉద్యోగులు తాము దాచుకున్న డ‌బ్బుల‌ను కూడా ప్ర‌భుత్వం ఇత‌ర ఖాతాల్లోకి మ‌ళ్లించ‌డంపై మండిప‌డుతున్నారు.

సీపీఎస్‌ విధానంలో ప్రతినెలా పదిశాతం కట్‌

సీపీఎస్‌ విధానంలో ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి ప్రభుత్వం పది శాతం కట్‌ చేస్తుంది. పదవీ విరమణ అనంతరం అందుకునే పెన్షన్‌ కోసం ఉద్యోగి జమ చేసే కంట్రిబ్యూషన్‌ ఇది. అదే సమయంలో ప్రభుత్వం కూడా అంతే వాటాను దానికి జమ చేయాలి. ఇలా మొత్తం 20 శాతం కంట్రీబ్యూషన్‌ను ప్రతి నెలా సీపీఎస్‌ ఉద్యోగి ప్రాన్‌ ఖాతాకు చేరాలి. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు గమనిస్తే.. పైసా కూడా జమ కాలేదని సమాచారం. ఒక 10 శాతం మంది ఉద్యోగులు మాత్రం తమకు చివరిసారిగా ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి తమ ప్రాన్‌ ఖాతాల్లో నగదు జమ అయిందని చెబుతున్నారు.

స్కూళ్ల నుంచి బిల్లులు ఎస్టీవోలకు చేరుతున్నా.. ఏదో కారణంతో వాటిని రిజెక్ట్‌ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి బిల్లు అనేబుల్‌ అవుతుందని, దానితో 20 నాటికి జీతాలు పడతాయని అంటున్నారు. అయితే.. ఆ తేదీ కూడా దాటితే అవి ఎరియర్స్‌లోకి వెళతాయని, అప్పుడు అవి ఎప్పుడు వచ్చేదీ కూడా తెలియదని చెబుతున్నారు. ఏ మాత్రం నిధులు ఉన్నా.. తొలుత సంక్షేమ పథకాలకు విడుదల చేయడానికే ఉపయోగిస్తున్నారని, ఆఖరులో మాత్రమే టీచర్లకు ఇస్తున్నారని సమాచారం.

డీఏల విషయంలోనూ డ్రామా కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. డీఏలు ప్రకటిస్తూ, వాటికి జీవోలు కూడా ఇస్తున్న ప్రభుత్వం.. వాటికి నిధులు మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈఎల్స్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌కూడా ఆగిపోయిందని సమాచారం.

రాష్ట్ర చ‌రిత్ర‌లో మొద‌టిసారి ఈ దుస్థితి: న‌వ్యాంధ్ర టీచ‌ర్స్ అసోసియేష‌న్‌

అధికారుల అలసత్వం వలన దాదాపు లక్ష అరవై వేల మంది ఉపాధ్యాయులు ఆగస్టు నెల జీతాలు సకాలంలో తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఇలాంటి పరిస్థితి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి అని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.

దాదాపు 40 నుంచి 50 వేల మంది ఉపాధ్యాయులు మూడు నెలల నుంచి జీతాలు లేవని, తగిన చర్యలు తీసుకోవాలని రెండు నెలల నుంచి చెప్తున్నా సరైన స్పందన లేక.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరూ ఉపాధ్యాయులకు జీతాల విషయంలో ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సోదిలో లేని జీ20 సదస్సు

జగన్‌ ప్రతీకార రాజకీయాల కోసం చంద్రబాబును అరెస్టు చేయించారన్న చర్చ సంగతి పక్కన పెడితే.. అరెస్టు జరిగిన రోజు, మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం జీ20 సదస్సును గొప్పగా నిర్వహించుకున్నది. యావత్‌ దేశంలోని మీడియా మొత్తం జీ20 విశేషాలను కవర్‌ చేయడంలో బిజీగా ఉన్నాయి. జాతీయ మీడియాలో అవే ప్రధాన వార్తలుగా ఉన్నాయి.

కానీ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టీవీ చానళ్లు అన్నీ పొద్దున్న నుంచి అర్ధరాత్రి దాటే వరకూ చంద్రబాబు అరెస్టు వార్తలనే ప్రసారం చేశాయి. దానిపైనే చర్చోపచర్చలు నిర్వహించాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌తో జీ20 సదస్సు అనేది ఒకటి జరిగిందనేది తెలుగు మీడియాలో ప్రసారం కాకుండా చూడటంలో జగన్‌ తెలిసో తెలియకో తనదైన పాత్ర పోషించడం కొసమెరుపు.

Updated On 12 Sep 2023 1:15 AM GMT
krs

krs

Next Story