Wednesday, December 7, 2022
More
  Homelatestస‌చివాల‌యం లేదు.. సీఎం రాడు.. అందుకే CSను క‌లిశాం: రేవంత్‌ రెడ్డి

  స‌చివాల‌యం లేదు.. సీఎం రాడు.. అందుకే CSను క‌లిశాం: రేవంత్‌ రెడ్డి

  • ధ‌ర‌ణి ర‌ద్దు చేసి టైటిల్ గ్యారెంటీ చ‌ట్టాన్ని అమ‌లు చేయండి
  • ఈనెల 24 నుంచి డిసెంబ‌ర్ 5 వ‌ర‌కు కాంగ్రెస్‌ ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు
  • ప్ర‌మాదంలో 24 ల‌క్ష‌ల ఎక‌రాల అసైన్డ్ భూములు
  • పోడు భూముల‌కు ప‌ట్టాలేవి
  • డిమాండ్ చేసిన కాంగ్రెస్

  విధాత‌: ‘రాష్ట్రంలో కూర్చోవ‌డానికి స‌చివాల‌యం లేదు.. క‌లువ‌డానికి సీఎం రాడు…భౌతికంగా సీఎం లేడ‌ని అనుకొని తాము రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని క‌లిశాం’ అని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే వారికి ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేసీఆర్ ద‌ర్శ‌నం ఇవ్వ‌లేద‌న్నారు. రాష్ట్రంలో అమ‌లులో ఉన్న ధ‌ర‌ణిన పోర్ట‌ల్‌ను ర‌ద్దు చేసి టైటిల్ గ్యారెంటీ చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

  ఈ మేర‌కు సోమ‌వారం తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల బృందం బీఆర్కే భ‌వ‌న్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్‌తో స‌మావేశ‌మైంది. తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించాలని సీఎస్‌కు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్వీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం జ‌నార్థ‌న్‌రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ పలువురు నేతలు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

  ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఓ గుదిబండ‌..

  రైతుల పాలిట ధ‌ర‌ణి పోర్ట‌ల్ గుదిబండ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కోటిన్న‌ర ఎక‌రాల భూముల వివ‌రాల‌ను, సీసీఎల్ఏ ను ధ‌ర‌ణి పేరుతో కేసీఆర్‌ను ప్ర‌స‌న్నం చేసుకున్న ఒక ప్రైవేట్ సంస్థ‌కు అప్ప‌గించార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల‌లో పేద‌ల‌కు అసైన్ చేసిన 24 ల‌క్ష‌ల ఎక‌రాల భూములు ప్ర‌మాదంలో ప‌డ్డ‌యాన్నారు. ఈ భూములు ధ‌ర‌ణిలో క‌నిపించ‌డం లేద‌ని తెలిపారు. ఈ రైతులు చ‌నిపోతే రైతు బీమా రావ‌డం లేద‌ని, సేద్యం చేయ‌డానికి రైతు బంధు రావడం లేద‌ని, బ్యాంకులు రుణాలు ఇవ్వ‌డం లేద‌న్నారు. రైతుల‌కు రుణ‌మాఫీ అమ‌లు చేయ‌లేద‌న్నారు. పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇవ్వ కుండా, క్యాబినెట్ స‌బ్ క‌మిటీ పేరుతో కాల‌యాప‌న చేస్తున్నార‌న్నారు. గిరిజ‌న హ‌క్కుల చ‌ట్టం ప్ర‌కారం పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి.. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు.

  ద‌శ‌ల వారీగా ఆందోళ‌న‌లు..

  ధ‌ర‌ణి పోర్ట‌ల్ ర‌ద్దుతో పాటు రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించాల‌ని ద‌శ‌ల వారీగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యించిన‌ట్లు రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఈనెల 24వ తేదీన అన్ని మండ‌ల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతుల‌తో క‌లిసినిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేయాల‌ని పిలుపు ఇచ్చారు. అలాగే ఈనెల 30వ తేదీన అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, రైతుల‌తో క‌లిసి ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల‌కు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని పిలుపు ఇచ్చారు.

  డిసెంబ‌ర్ 5వ తేదీన అన్ని జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల ముందు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేయాల‌ని రేవంత్ తెలిపారు. 5వ తేదీన జ‌రిగే నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో మొత్తం పీసీసీ నాయ‌క‌త్వం, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, స‌ర్పంచ్‌లతో పాటు ప్ర‌తి కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త ఈనిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని రేవంత్ పిలుపునిచ్చారు. శీతాకాల స‌మావేశాలు ఏర్పాటు చేసి, రైతుల‌ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు అమ‌లు చేయ‌డానికి స‌మ‌యం లేద‌ని, కేవ‌లం ఒక్క బ‌డ్జెట్ మాత్ర‌మే ఉంద‌న్నారు. వెంట‌నే ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేయాల‌ని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page