- అలహాబాద్ హైకోర్టు వెల్లడి.
- 1979 నాటి వివాహం రద్దు
విధాత: సరైన కారణం లేకుండా భార్య లేదా భర్తను సుదీర్ఘకాలం పడక సుఖానికి (శృంగారానికి) దూరం చేయడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) వెల్లడించింది. వివాహమైనప్పటికీ ఆలుమగలు చాలా ఏండ్లుగా వేర్వేరుగా నివాసముంటున్నందున వారి వివాహాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
సెక్షన్ 13 హిందూ వివాహ చట్టం, 1955 కింద విడాకుల అప్పీల్‌ను తోసిపుచ్చుతూ ప్రిన్సిపల్ జడ్జి ఇచ్చిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను న్యాయమూర్తులు జస్టిస్ సునీత్ కుమార్, జస్టిస్ రాజేంద్ర కుమార్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది.
కేసు వివరాలు ఏమిటంటే.. ఒక జంటకు 1979 మేలో వివాహం జరిగింది. కొన్నాళ్లు వారి కాపురం సక్రమంగానే సాగింది. తర్వాత భర్తతో వెళ్లేందుకు భార్య నిరాకరించింది. ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె అతడితో వెళ్లేందుకు నిరాకరించింది.
అతడితో ఎటువంటి సంబంధం పెట్టుకోవడానికి కూడా అంగీకరించలేదు. తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఆమె విడిగా నివసించడం ప్రారంభించింది. దీంతో భర్త 1994లో గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. గ్రామ పెద్దల సూచన మేరకు భార్యకు రూ.22 వేలు శాశ్వత భరణం కింద చెల్లించాడు. దంపతులు విడాకుల ఒప్పందానికి వచ్చారు. కానీ, భర్త విడాకుల కోసం ప్రయత్నించగా, ఆమె కోర్టుకు గైర్హాజరైంది.
అయితే, భార్య రెండో పెళ్లి చేసుకున్నదని భర్త ఆరోపించారు. కానీ, అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు భర్త చూపించలేకపోయాడు. దాంతో ఫ్యామిలీ కోర్టు విడాకుల అప్పీల్ తోసిపుచ్చింది. ఈ క్రమంలో భార్త అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
సుదీర్ఘకాలంగా తనను విడిచిపెట్టి, మానసికంగా వేధించినందుకు తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. చాలా కాలంగా భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్త చెప్పినట్లుగా, భార్య తమ మధ్య ఉన్న వైవాహిక బంధాన్ని గౌరవించలేదని, అందుకే వారి వివాహం రద్దుచేస్తున్నట్టు హైకోర్టు పేర్కొన్నది.