విధాత : కేంద్రంలో భారత్‌ రాష్ట్ర స‌మితి అధికారంలోకి రాగానే దేశ‌మంతా ఉచిత విద్యుత్, ద‌ళిత బంధు అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఖ‌మ్మం జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీది ప్ర‌యివేటైజేష‌న్, మాది నేష‌న‌లైజేష‌న్’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికల తర్వాత మీరు ఇంటికి పోవడం ఖాయం. మేం ఢిల్లీకి త‌ప్ప‌కుండా వ‌స్తాం’ అన్నారు. […]

విధాత : కేంద్రంలో భారత్‌ రాష్ట్ర స‌మితి అధికారంలోకి రాగానే దేశ‌మంతా ఉచిత విద్యుత్, ద‌ళిత బంధు అమ‌లు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఖ‌మ్మం జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీది ప్ర‌యివేటైజేష‌న్, మాది నేష‌న‌లైజేష‌న్’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికల తర్వాత మీరు ఇంటికి పోవడం ఖాయం. మేం ఢిల్లీకి త‌ప్ప‌కుండా వ‌స్తాం’ అన్నారు.

మోదీ ప్రభుత్వం దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నదన్న కేసీఆర్‌.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్‌ఐసీని మళ్లీ పబ్లిక్‌ సెక్టార్‌లోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ‘ల‌క్ష‌లాది మంది ఎల్ఐసీ ఏజెంట్లు, సిబ్బంది ఉన్నారు. ఎల్ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా? ఈ దేశ ప్ర‌జ‌ల‌తో పేగు బంధం ఉన్న సంస్థ ఎల్ఐసీ. నువ్వు అమ్మినా, మేం తీసుకుంటాం. ఎల్ఐసీ కార్మికుల్లారా సింహంలా గ‌ర్జించండి.. ఎల్ఐసీని బ‌తికించుకుందాం. క‌రెంట్ కార్మికులు కూడా ఉద్య‌మించాలి. విద్యుత్‌ను ప్ర‌భుత్వ రంగంలోనే ఉంచుతాం. క‌రెంట్ కార్మికులారా..? పిడికిలి బిగించండి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

మేకిన్‌ ఇండియా కాదు.. జోక్‌ ఇన్‌ ఇండియా

మిష‌న్ భ‌గీర‌థ‌తో రాష్ట్రంలో అన్ని ఇళ్లకు నల్లా ద్వారా మంచినీళ్లు ఇస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. కానీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. ‘అవ‌స‌రం ఉన్న చోట వ్యాపారం చేయ‌డం ప్ర‌భుత్వ విధానం. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారింది. చైనా బ‌జార్లు పుట్టుకొచ్చాయి. సైన్యంలో జ‌రిగే నియామ‌కాల్లో వేలు పెట్టారు. మేం అధికారంలోకి రాగానే అగ్నిప‌థ్‌ను ర‌ద్దు చేస్తాం’ అని చెప్పారు.

జ్ఞానం ఎక్క‌డ దొరికితే అక్క‌డ స్వీక‌రించాలని అన్నారు. కానీ.. బీజేపీ.. ఈ దేశంలో మ‌త‌పిచ్చి లేపుతున్నదని మండి పడ్డారు. మ‌తం మ‌త్తులో యువ‌త‌ను చెడ‌గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మ‌త విద్వేష‌ం విష వృక్షంగా పెద్ద‌గా అయి భార‌త జీవ‌నాడిని క‌లుషితం చేసే ప్ర‌మాదం ఉంది’ అని హెచ్చరించారు.

అంద‌రం ఏక‌మైతే కేంద్రంలో మూర్ఖుల అస‌మ‌ర్థ పాల‌నను అంతం చేయవచ్చని చెప్పారు. కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పాల‌సీని ప్ర‌జ‌ల ముందు పెడుతామని కేసీఆర్‌ ప్రకటించారు. భార‌త‌దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులతో బీఆర్‌ఎస్‌ భుజం కలిపి పోరాడుతుందని ప్రకటించారు. అంతిమ విజ‌యం మ‌న‌దే అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.

దేశమంతటా తెలంగాణ మోడల్‌

తెలంగాణ మోడ‌ల్‌ను దేశ‌మంతా అమ‌లు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ‘బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే దేశ‌మంతా ఉచిత విద్యుత్ ఇస్తాం. ద‌ళిత జాతిని కాపాడుకుంటాం. అంబేద్క‌ర్, కాన్షీరాం బాట‌లో ద‌ళిత‌జాతి పైకి రావాలి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్ర‌తి సంవ‌త్స‌రం 25 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ద‌ళిత బంధు అమ‌లు చేస్తాం.

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి. లింగ వివ‌క్ష‌ను రూపుమాపాలి. మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 35 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తాం. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని బీజేపీ ప్రభుత్వం అమ్మినా, మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ ప‌బ్లిక్ సెక్టార్‌లో పెడుతాం’ అని స్పష్టం చేశారు. వ్య‌వ‌సాయ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు మోదీ కుట్ర చేస్తున్నాడని కేసీఆర్‌ మండి పడ్డారు.

Updated On 18 Jan 2023 1:12 PM GMT
krs

krs

Next Story