జాడ‌లేని గ్రూప్ 2,3,4 నోటిఫికేష‌న్‌ టెట్ ఓకే.. మ‌రి డీఎస్సీ.. నిరీక్ష‌ణ‌లో నిరుద్యోగులు ఉన్నమాట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 80 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 10న తెలిపారు. ఇందులో పోలీస్‌ శాఖ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వచ్చింది. ప్రిలిమినరీ పరీక్ష కూడా పూర్తయ్యింది. టీఎఎస్‌పీఎస్సీ నుంచి గ్రూప్‌-1 […]

  • జాడ‌లేని గ్రూప్ 2,3,4 నోటిఫికేష‌న్‌
  • టెట్ ఓకే.. మ‌రి డీఎస్సీ..
  • నిరీక్ష‌ణ‌లో నిరుద్యోగులు

ఉన్నమాట: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 80 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 10న తెలిపారు. ఇందులో పోలీస్‌ శాఖ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వచ్చింది. ప్రిలిమినరీ పరీక్ష కూడా పూర్తయ్యింది.

టీఎఎస్‌పీఎస్సీ నుంచి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వచ్చింది. ప్రిలిమినరీ పరీక్ష కూడా అక్టోబర్‌ 16న జరిగింది. వీటితో పాటు సర్వీస్ కమిషన్‌ నుంచి రెండు మూడు నోటిఫికేషన్లు వచ్చాయి. కానీ నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ II - 582, గ్రూప్ III - 1,373, గ్రూప్ IV - 9,168 నోటిఫికేషన్లపై ప్రభుత్వం నుంచి ప్రకటనలే గాని ఇప్పటికీ వాస్తవ రూపం దాల్చలేదు. అలాగే టెట్‌ నిర్వహించారు కానీ డీఎస్సీ ఊసే లేదని నిరుద్యోగులు వాపోతున్నారు.

అంతేకాదు త్వరలో గ్రూప్‌-4 పోస్టుల భర్తీ అని మార్చి నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటికీ నోటిఫికేషన్లు రాలేదు. దీనికి కారణాలు ఏమిటి అన్నది ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు లేవు. తాజాగా గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచడంతో రోస్టర్‌ పాయింట్లు మళ్లీ మారాయని రానున్న నోటిఫికేషన్లలో వాటికి అనుగుణంగా అమలుచేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఏడు నెలల కాలంగా గ్రూప్స్‌ ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది.

ప్రైవేట్‌ రంగాల్లో చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న చాలామంది ఉద్యోగాలు కోవిడ్‌ అనంతరం పోయాయి. ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామనడంతో నిరుద్యోగులు అప్పులు చేసి మరీ ప్రిపరేషన్‌ మొదలుపెట్టారు. అంతేకాదు ప్రభుత్వం ఇయర్‌ క్యాలెండర్‌ కూడా ఏర్పాటు చేస్తామని, దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది.

సీఎం అసెంబ్లీ వేదికగా మార్చిలో ప్రకటించిన నోటిఫికేషన్ల జారీ, ఇయర్‌ క్యాలెండర్‌, ఉద్యోగాల భర్తీకి నిర్దిష్ట కాలపరిమితి అన్నవేవీ ఆచరణలో అమల్లోకి రాలేదు. ఇప్ప‌టికైనా ప్రభుత్వం నోటిఫికేషన్ల విషయంలో ప్రకటనలకే పరిమితం కాకుండా వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated On 15 Nov 2022 4:26 AM GMT
krs

krs

Next Story