చెర్నోబిల్ త‌ర్వాత ఇదే అతిపెద్ద విపత్తు జ‌ప‌రోజియా అణు విద్యుత్ కేంద్రానికి పొంచి ఉన్న ముప్పు విధాత‌: ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ జ‌లాశ‌యాల్లో ఒక‌టైన నోవా క‌ఖోవ్కా డ్యాం తెగిప‌డ‌టంతో భారీ జ‌ల విధ్వంసం చోటు చేసుకుంది. చెర్నోబిల్ ఘ‌ట‌న త‌ర్వాత ఇదే అతిపెద్ద విపత్తు అని ఉక్రెయిన్ (Ukraine) డిప్యూటీ ఫారెన్ మినిస్ట‌ర్ ఆండ్రిజ్ మెల్నిక్ వెల్ల‌డించారు. దీని ప్ర‌భావం ఎంత మేరకు ఉంటుంద‌నే విష‌యంపై పర్యావ‌ర‌ణ శాస్త్రవేత్త‌లు మ‌దింపు చేస్తున్నార‌ని తెలిపారు. కొన్ని క‌థ‌నాల […]

  • చెర్నోబిల్ త‌ర్వాత ఇదే అతిపెద్ద విపత్తు
  • జ‌ప‌రోజియా అణు విద్యుత్ కేంద్రానికి పొంచి ఉన్న ముప్పు

విధాత‌: ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ జ‌లాశ‌యాల్లో ఒక‌టైన నోవా క‌ఖోవ్కా డ్యాం తెగిప‌డ‌టంతో భారీ జ‌ల విధ్వంసం చోటు చేసుకుంది. చెర్నోబిల్ ఘ‌ట‌న త‌ర్వాత ఇదే అతిపెద్ద విపత్తు అని ఉక్రెయిన్ (Ukraine) డిప్యూటీ ఫారెన్ మినిస్ట‌ర్ ఆండ్రిజ్ మెల్నిక్ వెల్ల‌డించారు. దీని ప్ర‌భావం ఎంత మేరకు ఉంటుంద‌నే విష‌యంపై పర్యావ‌ర‌ణ శాస్త్రవేత్త‌లు మ‌దింపు చేస్తున్నార‌ని తెలిపారు.

కొన్ని క‌థ‌నాల ప్ర‌కారం.. మంగ‌ళ‌వారం ఉన్న‌ట్టుండి ఈ డ్యాంపై బాంబుల వ‌ర్షం కుర‌వ‌డంతో.. డ్యాం బ‌ద్ద‌లై భారీ జ‌ల‌రాశి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌ను ముంచెత్తింది. ప్ర‌స్తుతం ర‌ష్యా పాక్షిక అధీనంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి జ‌నాభాను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.

ఇది మీ ప‌నంటే మీ ప‌నేన‌ని ఉక్రెయిన్, ర‌ష్యా ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి. ఇది ఉగ్ర‌దాడ‌ని ర‌ష్యాలోని కొన్ని మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు వెలువ‌రించాయి. మ‌రోవైపు ఇటీవ‌ల తీసిన శాటిలైట్ చిత్రాల్లో డ్యాంపైన ఉన్న రోడ్డు బీట‌లు వారిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇది స‌హ‌జంగా జ‌రిగిన ప్ర‌మాదమా, బాంబు దాడి వ‌ల్లే జ‌రిగిందా అనేది బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.

అణు విద్యుత్ కేంద్రానికి ముప్పు

క‌ఖోవ్కా డ్యాంకు 160 కి.మీ. దూరంలో ఉన్న జ‌ప‌రోజియా అణు విద్యుత్ కేంద్రం భ‌ద్ర‌త‌పైనే ఇప్పుడు ప్ర‌పంచం ఆందోళ‌న‌గా ఉంది. రియాక్ట‌ర్ల కూలింగ్ ప్ర‌క్రియ‌కు ఇక్క‌డి నీటినే వినియోగిస్తున్నారు. ప్ర‌స్తుతానికి అక్క‌డ త‌గిన‌న్ని నీటి నిల్వ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. భ‌విష్య‌త్తులో నీటి కొరత ఎదురు కావొచ్చ‌ని ఆందోళ‌న‌లు ఉన్నాయి.

ఇప్ప‌టికిప్పుడు అణు విద్యుత్కేంద్రానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఎన‌ర్జీ ఏజెన్సీ సంస్థ ట్వీట్ చేసింది. మ‌రోవైపు ఉక్రెయిన్ గోధుమ పంట‌ల‌కు, ర‌ష్యా అధీనంలో ఉన్న క్రిమియా ద్వీపానికి ఈ నీరే ప్ర‌ధాన వ‌న‌రు కావ‌డంతో.. క‌ర‌వు ప‌రిస్థితి త‌లెత్తే ప్ర‌మాద‌ముంద‌ని నిపుణులు భావిస్తున్నారు.

చుట్టుప‌క్క‌ల విధ్వంసం

డ్యాం బ‌ద్ద‌లు కాగానే దిగువ‌న ఉన్న ప్రాంతాల ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేత ప‌ట్టుకుని ప‌రుగులు పెట్టారు. ఒక్క సారిగా ఎగసిన భారీ జ‌లరాశి స‌మీపంలోనే ఉన్న అతి భారీ ఎల‌క్ట్రిక్ జ‌న‌రేట‌ర్‌ను ముంచెత్తి ముందుకురికింది. డ్యాం ప‌శ్చిమ భాగం ఉక్రెయిన్ అధీనంలో, తూర్పు భాగం ర‌ష్యా అధీనంలో ఉండగా.. ఇరు దేశాలూ స‌హాయ‌క చ‌ర్య‌లను ప్రారంభించాయి.

ఒక్క ఉక్రెయిన్ భూభాగంలోనే సుమారు 16 వేల మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులుగా మారార‌ని స్థానిక అధికారులు వెల్ల‌డించారు. ఆ నీటిలోనే కొట్టుకొచ్చిన బాతులు, చేప‌లు స‌మీప వీధుల్లో ముంచుకొచ్చిన వ‌ర‌ద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

1986లో జ‌రిగిన చెర్నోబిల్ అణువిద్యుత్ ప్ర‌మాదం నుంచి ఉక్రెయిన్ ఇంకా తేరుకోలేదు. ఒక రియాక్ట‌ర్‌ను స‌రిగా డిజైన్ చేయ‌క‌పోవ‌డం, నైపుణ్యం లేని ఉద్యోగులు దానిని ఆప‌రేట్ చేయ‌డంతో భారీ ప్ర‌మాదం జ‌రిగింది. అక్క‌డ ఉన్న రేడియో యాక్టివ్ మెటీరియ‌ల్‌లో 5 శాతం వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించింది. 70 మంది వ‌ర‌కు చ‌నిపోగా.. 3,50,000 మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఆ అణుధార్మిక‌త ప్ర‌భావానికి ఇప్ప‌టికీ కొన్ని వేల మంది వివిధ క్యాన్స‌ర్ల బారిన ప‌డుతున్నారు.

Updated On 7 Jun 2023 7:48 AM GMT
Somu

Somu

Next Story