Nalgonda | విధాత: తీర ప్రాంతాల్లో ప్రజల జీవన చిత్రాలను తలపించేలా ఉదయ సముద్రం రిజర్వాయర్ పరిసర ప్రాంతాలు దర్శనమిస్తున్నాయి. ఏఎంఆర్పి ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్ కు వస్తున్న కృష్ణా జలాలతో వేసవిలో నిండుకుండలా మారిన రిజర్వాయర్ అలుగు పోస్తుండగా రిజర్వాయర్ కు అనుకొని ఉన్న గ్రామాల్లో, పొలాల్లోకి రిజర్వాయర్ నీరు విస్తరించింది. రిజర్వాయర్ నుండి అయిటిపాముల రిజర్వాయర్‌కు అలాగే ఇతర కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల పరిధిలోని ఆయకట్టుకు నీళ్లు వదులుతున్నారు. రిజర్వాయర్ సమీపాన ఉన్న పానగల్, చందనపల్లి, […]

Nalgonda |

విధాత: తీర ప్రాంతాల్లో ప్రజల జీవన చిత్రాలను తలపించేలా ఉదయ సముద్రం రిజర్వాయర్ పరిసర ప్రాంతాలు దర్శనమిస్తున్నాయి. ఏఎంఆర్పి ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్ కు వస్తున్న కృష్ణా జలాలతో వేసవిలో నిండుకుండలా మారిన రిజర్వాయర్ అలుగు పోస్తుండగా రిజర్వాయర్ కు అనుకొని ఉన్న గ్రామాల్లో, పొలాల్లోకి రిజర్వాయర్ నీరు విస్తరించింది.

రిజర్వాయర్ నుండి అయిటిపాముల రిజర్వాయర్‌కు అలాగే ఇతర కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల పరిధిలోని ఆయకట్టుకు నీళ్లు వదులుతున్నారు. రిజర్వాయర్ సమీపాన ఉన్న పానగల్, చందనపల్లి, రెడ్డి కాలనీ వంటి గ్రామాల చుట్టు నీటిపారుదల కనిపిస్తుంది. ఈ ప్రాంత రైతులు వరి కోతల పనులు పూర్తిచేసి, తదుపరి పంట సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. నిమ్మ, మామిడి తోటల రైతులు దిగుబడుల కోత, అమ్మకాలు సాగిస్తున్నారు.

పని కోసం ఈ ప్రాంతానికి వలస వచ్చే కూలీలు, పక్షులు, బాతుల పోషణతో జీవనోపాధికి వచ్చే సంచార జాతుల వారికి ఉదయ సముద్రం రిజర్వాయర్ పరిసర గ్రామాలు ఆలవాలమవుతున్నాయి. రిజర్వాయర్ జలాల్లో, ఆనుకొని ఉన్న పొలాల్లో పెద్ద ఎత్తున వివిధ జాతుల పక్షులు వేల సంఖ్యలో గుంపులుగా దర్శనమిస్తున్న తీరు కనువిందు చేస్తుంది.

నల్లగొండ నుండి రెడ్డికాలని వెళ్లే మార్గంలో, నల్గొండ- నకిరేకల్ ప్రధాన రహదారి వెంట ఉదయం సముద్రం అలుగు దృశ్యాలు, రిజర్వాయర్ లో తెప్పలపై వెళ్లి చేపలు పడుతున్న వారు, ప్రధాన కాలువల వెంట చేపలు పట్టి విక్రయిస్తున్న దృశ్యాలు నిత్య కృత్యమయ్యాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు పట్టి ఇచ్చే చేపలు దొరుకుతున్నాయి.

అక్కడి తోటల్లో మామిడి ఫలాలు తాజాగా లభిస్తున్నాయి. ఆ దారి వెంట రాకపోకలు సాగించేవారు వాటిని ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. రిజర్వాయర్ లో సరదాగా ఈత కొట్టేందుకు వస్తున్నవారికి, రిజర్వాయర్ పరిసర చందన పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మామిడి ఫలాలు, చేపలు, కల్లు తాజాగా దొరుకుతున్నాయి. చందన పల్లి సహా పరిసర గ్రామాల రైతులు గేదెలు, కోళ్ల పెంపకాలు కూడా సాగిస్తున్నారు.

ఇక ఉదయ సముద్రం రిజర్వాయర్ కట్ట ప్రస్తుతం పట్టణవాసులకు ఉదయం సముద్రం సాయంత్రం వేళల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ఉల్లాస కేంద్రంగా కొనసాగుతుంది. రిజర్వాయర్ లో ఈతకు పెద్ద ఎత్తున నల్గొండ పట్టణవాసులు తమ పిల్లలతో తరలివస్తున్నారు. వారంతా రిజర్వాయర్ లో ఈత కొడుతూ తిరుగు ప్రయాణంలో రిజర్వాయర్‌తో పాటు పరిసర గ్రామాలలో లభించే చేపలు, పండ్లు కొనుగోలు చేస్తూ సందడిగా కనిపిస్తున్నారు.

నాగార్జున సాగర్ రిజర్వాయర్ పరిసరాల్లో, బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాల్లో వైజాగ్ కాలనీ వంటి సందర్శక ప్రాంతాల్లో ఉండే వాతావరణ పరిసరాలు, ప్రజల, ప్రాణుల జీవన దృశ్యాలకు తీసిపోకుండా ఉదయ సముద్రం పరిసర ప్రాంతాలు ఆకట్టుకుంటున్నాయి.

మొత్తం మీద ఉదయ సముద్రం రిజర్వాయర్ పరిసరాలు వేసవిలో నదీ తీర ప్రాంత ప్రజల జీవన పరిస్థితులను తలపిస్తూ ప్రకృతి ప్రేమికులను, పల్లె వాతారణాన్ని, పర్యావరణాన్ని ఆస్వాదించే వారిని ఆకట్టుకుంటున్నాయి.

ఉదయ సముద్రం రిజర్వాయర్ కట్టను ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసి బోటింగ్, స్విమ్మింగ్, హోటల్స్ వంటి వసతులతో టూరిజం.. స్పాట్ గా మారిస్తే పానగల్ ఆలయాలు, మ్యూజియం వంటి వాటితో కలిసి మునుముందు ఈ ప్రాంతం పట్టణ వాసులకి మరింత ఆహ్లాదాన్ని అందించే అవకాశం ఉంది.

Updated On 14 May 2023 5:09 AM GMT
Somu

Somu

Next Story