Coding Ninja | విధాత: కొవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో చిన్నారుల‌కు సైతం కోడింగ్ త‌ర‌గ‌తులు పెట్టి వార్త‌ల్లోకెక్కిన స్టార్ట‌ప్ కంపెనీ కోడింగ్ నింజా మ‌రోసారి చ‌ర్చ‌ల్లో నిలిచింది. గురుగ్రామ్‌లో ఉన్న ఆ కంపెనీ బ్రాంచ్‌లో తీసిన ఓ వీడియో నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌యింది. అందులో సెక్యూరిటీ గార్డు ఒక‌రు.. ఉద్యోగులు కార్యాల‌యంలో ఉండ‌గానే త‌లుపులు మూసేసి తాళాలు వేస్తున్న‌ట్లు ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నార‌ని వీడియో తీసిన వ్య‌క్తి అడగ్గా.. సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాల‌తోనే ఇలా చేస్తున్నాన‌ని స‌మాధాన‌మిచ్చారు. […]

Coding Ninja |

విధాత: కొవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో చిన్నారుల‌కు సైతం కోడింగ్ త‌ర‌గ‌తులు పెట్టి వార్త‌ల్లోకెక్కిన స్టార్ట‌ప్ కంపెనీ కోడింగ్ నింజా మ‌రోసారి చ‌ర్చ‌ల్లో నిలిచింది. గురుగ్రామ్‌లో ఉన్న ఆ కంపెనీ బ్రాంచ్‌లో తీసిన ఓ వీడియో నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌యింది. అందులో సెక్యూరిటీ గార్డు ఒక‌రు.. ఉద్యోగులు కార్యాల‌యంలో ఉండ‌గానే త‌లుపులు మూసేసి తాళాలు వేస్తున్న‌ట్లు ఉంది.

ఎందుకు ఇలా చేస్తున్నార‌ని వీడియో తీసిన వ్య‌క్తి అడగ్గా.. సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాల‌తోనే ఇలా చేస్తున్నాన‌ని స‌మాధాన‌మిచ్చారు. ప‌ని వేళ‌ల్లో ఉద్యోగులు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండానే ఈ ఏర్పాటు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. రెండు వారాల క్రితం షూట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

భార‌త్‌లో అంకుర సంస్థ‌ల ప‌ని సంస్కృతిపై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐటీ సెక్టార్‌లో శ్ర‌మ దోపిడీ రోజు రోజుకీ వెర్రిత‌ల‌లు వేస్తోందని ఒక యూజ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది జైలా, ఆఫీసా అని మ‌రో వ్య‌క్తి లింకిడిన్ లో ప్ర‌శ్నించారు.

మ‌రోసారి జ‌ర‌గ‌దు..

ఈ వీడియోపై కోడింగ్ నింజా స్పందించింది. త‌మ సిబ్బందిలో ఒక వ్యక్తి తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యం వ‌ల్ల ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలిపింది. త‌ర్వాత కొద్ది నిమిషాల్లోనే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించింది. 'దీనికి కార‌ణ‌మైన స‌ద‌రు అధికారి క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు సైతం ఈ వీడియోపై తీవ్ర ఆగ్ర‌హం, విచారం వ్య‌క్తం చేశారు.

అంతే కాకుండా ఆ ఉద్యోగిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోనున్నాం. సంస్థ విలువలు, విధానాలు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఎంత మాత్రం ప్రోత్స‌హించ‌వు. మ‌రో సారి ఇలా జ‌ర‌గ‌దు' అని సంస్థ త‌న స్పంద‌న‌లో వెల్ల‌డించింది. అయితే ఆ అధికారి వివ‌రాలు కానీ, క్ర‌మ‌శిక్ష‌ణా చర్య‌గా ఏ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న దానిపై వివ‌రాలను వెల్ల‌డించ‌లేదు. 27 వేల స్టార్ట‌ప్‌ల‌తో అమెరికా, చైనా త‌ర్వాత అతి పెద్ద అంకుర సంస్థ‌ల దేశంగా భార‌త్ నిలిచిన విష‌యం తెలిసిందే.

Updated On 6 Jun 2023 1:52 AM GMT
krs

krs

Next Story