విధాత: సరొగసి కాన్సెప్ట్‌తో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు చిత్రయూనిట్ గ్రాండ్‌గా ఏ ఫంక్షన్‌ను నిర్వహించలేదు. కారణం సమంత అందుబాటులో లేకపోవడమే. ఆమె కొంతకాలంగా మయోసైటిస్ […]

విధాత: సరొగసి కాన్సెప్ట్‌తో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు చిత్రయూనిట్ గ్రాండ్‌గా ఏ ఫంక్షన్‌ను నిర్వహించలేదు. కారణం సమంత అందుబాటులో లేకపోవడమే.

ఆమె కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్లుగా రీసెంట్‌గా ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్న పిక్‌ని పోస్ట్ చేసిన సమంత.. తను మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్నానని, ప్రస్తుతం ఫైట్ చేస్తున్నానని.. త్వరలోనే కోలుకుని నార్మల్ అవుతానని తెలిపింది. డబ్బింగ్ చెబుతున్నప్పటికీ.. ఆమె చేతికి సెలైన్ ఉండటంతో.. అయ్యో పాపం అంటూ అందరూ ఆమె త్వరగా కోలుకోవాలంటూ మద్దతు ప్రకటించారు.

ఇక సినిమా విడుదల దగ్గర పడటంతో.. తన ఫ్రెండ్స్ రాజ్ అండ్ డీకే చెప్పిన మాటల స్ఫూర్తితో.. ఎంత కష్టమైనా సరే ఈ సినిమా ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా మరో ట్వీట్‌లో సమంత పేర్కొంది. అయితే ప్రమోషన్స్‌లో పాల్గొంటానని చెప్పింది కానీ.. పబ్లిక్ ఫంక్షన్స్ అని మాత్రం ఆమె చెప్పలేదు. సినిమా ప్రమోషన్ నిమిత్తం.. యాంకర్ సుమతో ఆమె ఓ వీడియో ఇంటర్వ్యూ‌లో పాల్గొని.. సినిమాకు సంబంధించిన అనేక విషయాలను తెలియజేసింది. సినిమానే కాదు.. ఆమె ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ఇంటర్వ్యూలో సమంత తెలిపింది. యాంకర్ సుమతో యశోద స్పెషల్ ఇంటర్వ్యూ..

సుమ: హాయ్ సమంతగారు… ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?

సమంత: థాంక్యూ సుమగారు.. ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం ‘యశోద’ సినిమా విడుదలవుతుంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.

సుమ: మీ ఆరోగ్యం గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు?

సమంత: అవునండి.. నేను కూడా చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే… ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వుతూ). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు.

సుమ: సోషల్ మీడియాలో మీరు చేసిన పోస్ట్ చేసి అంతా ఎంతో బాధపడ్డారు. మీరు మాత్రం ధైర్యంగా పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు ఎక్కడ నుంచి వస్తోంది?

సమంత: సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు… కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది(కళ్లలో నీళ్లతో) చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం. ప్రస్తుతానికైతే నేను చావట్లేదు.

సుమ: కమింగ్ టు యశోద… టీజర్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?

సమంత: చాలా సంతోషంగా ఉంది. చాలా ఎగ్జయింట్‌గా ఉన్నాను. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రైలర్లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

సుమ: ‘యశోద’ అంటే ముందుగా గుర్తు వచ్చేది ఏంటి? ఈ కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చేశారా? లేదంటే ఆలోచించారా?

సమంత: సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, ‘యశోద’ వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో ఈ సినిమా కూడా ఒకటి. యశోద క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్‌బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన కథే కాదు.. అందరికీ తెలియాల్సిన కథ కూడా.

సుమ: ఇప్పుడు సరొగసి అనేది కామన్ అయ్యింది. దానిపై మీ అభిప్రాయం?

మంత: సరొగసి మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది.

సుమ: సినిమాలో సరొగసి మాత్రమే కాకుండా.. పాలిటిక్స్, వరల్డ్ రిచ్ విమెన్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తోంది. కథ గురించి ఇంకొంచెం ఏమైనా?

సమంత: కథ గురించి ఇంకేమైనా చెప్పానంటే… సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. యశోద ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని థ్రిల్ అవుతూ.. కుర్చీ అంచుకు వచ్చేస్తారు. దర్శకులు కథ, స్క్రీన్‌ప్లే రాసిన విధానం… స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు… ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్… ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. వెండితెరపై ఎంజాయ్ చేయాలి.

సుమ: మీరు డిఫరెంట్ జానర్ సినిమాలు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయడంలో ఉండే థ్రిల్ ఏమిటి?

సమంత: కథలు వినేటప్పుడు, తర్వాత సినిమాలో క్యారెక్టర్ విషయంలో, ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్‌గా, కొత్తగా ఉండాలని ప్రతిసారీ ఆలోచిస్తాను. అలా ఉండేలా చూస్తాను. ‘యశోద’ కంటే ముందు ‘యు - టర్న్’ చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, ‘యశోద’ చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే… యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను.

సుమ: యాక్షన్ సీన్స్ కోసం ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? యాక్షన్ ఎలా అనిపించింది? ఇంతకు ముందు మీరు యాక్షన్ చేసినా.. ఈ రేంజ్ ఫైట్స్ చేయలేదు కదా!

సమంత: యానిక్ బెన్‌తో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’కి పని చేశా. ఆ క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. ‘యశోద’లో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేశా. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్. ఇద్దరూ ఫైట్స్ అన్నీ రా అండ్ రియల్‌గా ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో పాత్రకు తగ్గట్టు ఉండేలా చూశారు. చాలా ప్రిపేర్ అయ్యాను.

సుమ: వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్.. సినిమాలో భారీ తారాగణం ఉంది. సెట్స్‌లో అందరూ కలిసినప్పుడు ఎలా ఉండేది. ఇందులో కొంత మందితో మీరు ముందు కూడా నటించారు కదా!

సమంత: సినిమాలో నటీనటులు అందరితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మన చుట్టూ ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ‘యశోద’లో వివిధ భాషల నటీనటులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే విషయం ఒకటి ఉంది. మలయాళం యాక్టర్ డైలాగ్ చెప్పే విధానం, తెలుగు యాక్టర్లు చెప్పే విధానానికి వేరుగా ఉంటుంది. అంత మందితో కలిసి నటించడం ఆసక్తికరంగా అనిపించింది. వాళ్ళందరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.

సుమ: ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో మీ అనుబంధం?

సమంత: సరొగసి ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌గారు సినిమా గొప్పగా ఉండాలని ఎప్పుడూ తపిస్తారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు.

సుమ: పాన్ ఇండియా రిలీజ్ ఆలోచనతో కథ మీ దగ్గరకు వచ్చిందా? లేదంటే…

సమంత: ఈ సినిమా కథలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా ‘పాన్ ఇండియా’ అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా.

సుమ: సెలైన్ బాటిల్‌తో డబ్బింగ్ చెప్పారు. వేరొకరితో డబ్బింగ్ చెప్పించే అవకాశం ఉన్నప్పటికీ… మీరే డబ్బింగ్ చెప్పడానికి కారణం?

సమంత: ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే.. చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే.. వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే.. నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.

సుమ: ఇందులో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన పాత్ర?

సమంత: వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర. సినిమా చూస్తే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానో అర్థం అవుతుంది. ఇంతకు మించి ఏమైనా చెబితే స్పాయిలర్ అవుతుంది.

సుమ: ప్రజెంట్ మీ హెల్త్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. అభిమానులకు ఏం చెబుతారు?

సమంత: వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే నాకు ధైర్యాన్నిస్తున్నాయి.

Updated On 10 Nov 2022 4:42 PM GMT
krs

krs

Next Story