Jamili Elections |  ‘ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అభివృద్ధిని దెబ్బ తీస్తున్నదని మీ అందరికీ తెలుసు. అందుకే ఒకే దేశం.. ఒకే ఎన్నికపై లోతైన అధ్యయనం, చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నది. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, ఇతర ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను ఉపయోగించాలి. ఈ జాబితాల తయారీపై మనం ఎందుకు సమయాన్ని, డబ్బును వృథా చేయాలి? - 2020 ఆగస్ట్‌ 15 ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని […]

Jamili Elections |

‘ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అభివృద్ధిని దెబ్బ తీస్తున్నదని మీ అందరికీ తెలుసు. అందుకే ఒకే దేశం.. ఒకే ఎన్నికపై లోతైన అధ్యయనం, చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నది. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, ఇతర ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను ఉపయోగించాలి. ఈ జాబితాల తయారీపై మనం ఎందుకు సమయాన్ని, డబ్బును వృథా చేయాలి? - 2020 ఆగస్ట్‌ 15 ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ

  • ఉమ్మడి పౌరస్మృతి, మహిళా కోటా బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం
  • అందుకే 5 రోజుల ప్రత్యేక సమావేశాలు?
  • ‘ఇండియా’ బలపడే లోపే ఎన్నికలు..
  • విపక్షాలకు ఊపిరి సలపనీయకూడదు!
  • ఇదే మోదీ అంతరంగం.. అందుకే జమిలి
  • జమిలికి వెళ్లాలంటే భారీ కసరత్తు
  • అనేక అధికరణలకూ సవరణలు
  • అమలు తర్వాతా అనేక సమస్యలు
  • ఈ మూడు బిల్లుల ఆమోదం అసాధ్యం
  • తేల్చి చెబుతున్న రాజకీయ నిపుణులు

మోదీ ప్రభుత్వం జమిలికే జై కొడుతున్నదా? ప్రభుత్వం పట్ల దేశంలో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను మొగ్గలోనే తుంచి వేసేందుకు భారీ ఆలోచననే చేస్తున్నదా? ప్రజాస్వామ్య వ్యవస్థలను ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసుకుంటూ వెళుతున్న తీరును, దర్యాప్తు సంస్థలను తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించే లోపే వారిని మభ్యపెట్టి, చర్చను దారి మళ్లించి.. జమిలితో బురిడీ కొట్టించాలని అనుకుంటున్నదా? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అదే సమయంలో జమిలి ఎన్నిక అంటే ఆషామాషీ కాదని, దానికి సవరించాల్సిన అధికారణాలు, పొందాల్సిన ఆమోదాలు, అధిగమించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని మరికొందరు అంటున్నారు.

న్యూఢిల్లీ : సెప్టెంబర్‌ 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ చర్చలు ఒకే అంశంపై కేంద్రీకృతమయ్యాయి. అదే జమిలి ఎన్నికలు. 22వ తేదీ వరకు సాగే ఈ సమావేశాల్లో ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు ఉద్దేశించిన బిల్లును కేంద్రం తీసుకురానున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంటే.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారన్నది తెలిసిందే.

దీనితోపాటే.. బీజేపీ మూడు నినాదాల్లో ఒకటైన ఉమ్మడి పౌర స్మతికి సంబంధించిన బిల్లును తేనున్నారని సమాచారం. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా కోటా బిల్లును సైతం తీసుకొస్తారని తెలుస్తున్నది. గురువారం ఎక్స్‌లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై పోస్టు చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌.. 17వ లోక్‌సభ 13వ సెషన్‌, రాజ్యసభ 261వ సెషన్‌ ఐదు సిటింగ్‌లు నిర్వహిస్తాయని తెలిపారు. అమృత్‌కాల్‌లో పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ జమిలి అంటే..

అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలి పద్ధతి. నిజానికి ఈ ఆలోచనను బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పలుమార్లు ముందుకు తెస్తూనే ఉన్నది. ఒక దశలో లా కమిషన్‌ వరకూ వెళ్లింది. ప్రస్తుతం మరోసారి ఈ ప్రతిపాదన తీసుకురావడం వెనుక ప్రతిపక్షాలు ఏకం కాకుండా నిరోధించడమేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లోక్‌సభకు గానీ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు గానీ ఎన్నికలు వాటి పదవీకాలం ముగిసిన తర్వాతే నిర్వహిస్తున్నారు.

సాధారణంగా ప్రతి ఏటా రెండు పర్యాయాలు ఎన్నికలు ఉంటున్నాయి. ఆ ఎన్నికలు కూడా వేర్వేరు అసెంబ్లీలకు ఉంటున్నాయి. బీజేపీ చెబుతున్న ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రకారం.. లోక్‌సభకు, అన్ని రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తారు. బహుశా పోలింగ్‌ కూడా ఒకే రోజు ముగిసిపోతుంది. జమిలి ఎన్నికలతో పదే పదే ఎన్నికల ఖర్చు తగ్గి, ఏటా పదివేల కోట్లపైనే ఖజానాకు ఆదా అవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా ఎన్నికల నిర్వహణ కూడా కేంద్రానికి సులువుగా మారుతుందని అంటున్నారు.

మూడో నినాదం.. ఉమ్మడి పౌరస్మృతి

ఉమ్మడి పౌరస్మృతి అనేది బీజేపీ మూడు నినాదాల్లో ఒకటి. ఇప్పటికే అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవుతున్నది. జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేశారు. ఇక మూడోదీ అత్యంత కీలకమైనది అయిన ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీ కేంద్రీకరించబోతున్నది. దీనిని తీసుకొస్తే.. ఇప్పటి వరకూ కులం, మతం, ప్రాంతం, ఆచారం, సంప్రదాయం ఆధారంగా ఉన్న వ్యక్తిగత చట్టాలన్నీ రద్దయిపోయి.. వాటి స్థానంలో ఒకే చట్టం రూపొందుతుంది. వారసత్వ సంక్రమణం, దత్తత, వివాహాలు, విడాకులు ఇలా అన్ని విషయాల్లోనూ కులమతాలు, ప్రాంతాలు, లింగబేధాలు లేకుండా అమలు చేస్తారు. దీనితోపాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా కోటా బిల్లును సైతం తెస్తారని తెలుస్తున్నది.

మూడేళ్లుగా మోదీ జమిలి మంత్రం

గడచిన మూడేళ్లుగా జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా మోదీ సర్కార్‌ తీవ్ర ప్రయత్నాలు చేసింది. 2017లో నీతి అయోగ్ జమిలి సాధ్యాసాధ్యాలపై చర్చించి నివేదిక ఇవ్వగా, లా కమిషన్ ఆమోదించింది. అఖిలపక్ష సమావేశానికి హాజరైన 41 పార్టీలలో 21 పార్టీలు జమిలికి అనుకూలత వ్యక్తం చేశాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం పార్లమెంటు స్థాయీ సంఘాన్ని నియమిస్తే.. అది కూడా సానుకూలంగా స్పందించింది.

ఎన్నికల సంఘం కూడా సైతం జమిలికి జై కొట్టింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం ముందుకే వెళుతుంది అంతా భావించారు. కానీ.. రాజకీయంగా అనుకూలంగా ఉండదని భావించిన కేంద్రం వెనుకడుగు వేసిందని చెబుతుంటారు. ఈ క్రమంలోనే జమిలి ఆలోచన లేదని పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు.

ఐదు అధికరణలు.. అవరోధాలు

జమిలి ఎన్నికలు సాధ్యం కాదని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటన చేసే క్రమంలో లాభనష్టాలను నివేదిస్తునే, ఆటంకాలను కూడా వెల్లడించింది. లాభాలను ప్రస్తావిస్తూ.. పదేపదే ఎన్నికల నిర్వాహణ పరిస్థితులు పోయి, ప్రజాధనం ఆదా అవుతుందని, పరిపాలన, శాంతిభద్రతల విభాగాలు ఎన్నికల విధులను పలుమార్లు నిర్వహించే పరిస్థితి తప్పుతుందని పేర్కొన్నది.

ఎన్నికల ప్రచారంలో పార్టీలకు, అభ్యర్థులకు ఖర్చు ఆదా అవుతుందని, రెండు ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించడం ద్వారా ఎన్నికల కోడ్ ఆంక్షలు ఎక్కువ కాలం అమలులో ఉండకుండా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవ్వడంతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనపై దృష్టి కేంద్రీకరించే సానుకూలత లభిస్తుందని కేంద్రం వివరించింది. ఇదే సమయంలో జమిలి విధానం తీసుకొచ్చేందుకు రాజ్యాంగంలో ఐదు సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఇవీ ఆ ఐదు అధికరణాలు

మొదటిది పార్లమెంట్ కాల పరిమితికి సంబంధించిన అధికరణం 83. లోక్‌సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి ఈ అధికరణం అధికారాలు కల్పిస్తున్నది. రెండోది రాష్ట్రాల శాసన సభల కాల పరిమితిని నిర్ధారించే అధికరణం 172. మూడోది రాష్ట్రాల అసెంబ్లీ రద్దు అధికరణం 174. నాలుగోది రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే 356 అధికరణం. జమిలికి వెళ్లటానికి ముందు వాటిన్నంటినీ సవరించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇవీ సమస్యలు

జమిలిపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాల్సి వస్తుండటం, సమాఖ్య పాలన వ్యవస్థ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తీసుకోవాల్సి ఉండటం, జమిలికి సరిపడా ఈవీయంలు, వీవీ ప్యాట్‌లు సమకూర్చుకునేందుకు వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉండటం, ఒకేసారి ఎన్నికలకు అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలను సమకూర్చుకోవడం వంటి సమస్యలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. జమిలి ఎన్నికలపై సాధ్యాసాధ్యాల పరిశీలనకు మరింత కసరత్తు చేయాల్సి ఉన్నదని, అందుకే స్థాయీ సంఘం నివేదికను లాకమిషన్‌కు పంపినట్లుగా పేర్కొన్నది.

రాజకీయ ఏకాభిప్రాయానికి అడ్డంకులు

జమిలి ఎన్నికలకు వెళ్లేముందు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావలసి ఉండగా ఎన్డీఏను సవాలు చేస్తూ ఏర్పడిన ఇండియా కూటమి అందుకు సహకారం అందించకపోవచ్చు. అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నుంచి జమిలికి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కూడా ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించకపోవచ్చు. అంతేగాక జమిలి ఎన్నికల కోసం ఇప్పటికే ఉన్న కొన్ని రాష్ట్రాల శాసన సభల పదవీ కాలం పొడిగించడం, మరికొన్ని శాసన సభల పదవీ కాలం కుదించడం చేయాల్సి ఉన్నది. దీనికి కూడా రాజ్యాంగ సవరణ అవసరం.

ఆది నుంచి జమిలిపై భిన్నాభిప్రాయాలు

జమిలి ఎన్నికల నిర్వహణపై దేశ రాజకీయ పార్టీలలో ఆది నుంచీ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పదేపదే ఎన్నికల నిర్వహణల ఖర్చు, సమయం, అభివృద్ధి పనులకు కోడ్ ఆటంకాలతో పరిపాలన స్తంభించడం వంటి ప్రధానాంశాలే జమిలికి ఎక్కువ సానుకూల అంశాలు. అయితే భారత్ వంటి విభిన్న సంస్కృతులు, జాతులున్న దేశంలో జమిలి ఎన్నిక సాధ్యం కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనుగడలు అనేక అంశాలపై ఆధారపడిన దేశంలో అసలు ఆ విధానమే ప్రహసనంగా మారుతుందనే అభిప్రాయాలూ ఉన్నాయి.

సానుకూలంగా కేంద్రం చెబుతున్న అంశాలలో పార్లమెంటు స్థాయీ సంఘం 79వ నివేదికలో దక్షిణా ఫ్రికాలో ప్రతి ఐదేళ్లకు జాతీయ, ప్రాంతీయ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. స్వీడన్‌లో నాలుగేళ్లకు ఒకసారి జాతీయ, స్థానిక అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి సెప్టెంబర్ రెండవ శనివారం రోజు జరుగుతాయని తెలిపింది.

యూకేలో పార్లమెంటు పదవీ కాలం స్థిరంగా ఉండేందుకు 2011లో చట్టం చేశారని తెలిపింది. ఆయా అంశాలను జమిలికి అనుకూలంగా కేంద్రం పేర్కొంది. సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్‌లలో పార్టీల జాబితాతో దామాషా ప్రాతిపదికన చట్టసభలలో సీట్లు కేటాయిస్తారన్నఅంశం స్థాయి సంఘం విస్మరించిందన్న విమర్శ ఉంది.

జమిలితో అభివృద్ధి అంతంతమాత్రమే

కేంద్రం పేర్కొన్నట్టు.. జమిలి ఎన్నికలు అమలవుతున్న దేశాలలో అభివృద్ధి పెద్దగా పెరిగిందేమీ లేదన్న వాదన ఉంది. ఇందుకు అమెరికాలో 1962 నుండి 2019 మధ్య 57 ఏళ్ల కాలంలో 22 ఏళ్లలో తిరోగమన వృద్ధిరేటు నమోదైందని, పదహారేళ్లలో ఒక శాతం లోపు, ఐదేళ్లలో ఒకటి నుండి రెండు శాతం వృద్ధిరేటు నమోదైందన్న లెక్కలను జమిలి వ్యతిరేకులు వినిపిస్తున్నారు. అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాలలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీకి ఎలక్ట్రోరల్‌ ఓట్లు కేటాయిస్తారు.

స్వీడన్, బెల్జియం, ఫిలిప్స్ లలో జమిలి ఎన్నికలు ఉన్నా పెద్దగా ఆర్ధిక వృద్ధి రేటు సాధించిలేదని, అయితే రాజకీయ సుస్థిరత పెరిగిందన్న భావన ఉంది. పైగా ఆ దేశాల్లో భారత్‌కు భి్న్నంగా ఎక్కువగా ఒకే జాతీ, సంస్కృతులున్నాయి. మనదేశంలో నిజానికి 1951 నుండి 1967 వరకు దాదాపుగా జమిలి ఎన్నికల మాదిరిగా రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. తదుపరి క్రమంగా ఆ పరిస్థితి చెదిరిపోయింది.

Parlament
NewParlament

జమిలితో కొత్త గందరగోళాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకుంటే జమిలి ఎన్నికలకు ఇబ్బందేమీ లేదు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో తరచూ ప్రభుత్వాలు పడిపోతూ వచ్చే ఎన్నికలకు జమిలి చెక్ పెట్టవచ్చని అనుకున్నారు. అయితే ఆచరణలో జమిలి విధానం తెచ్చినా మధ్యలో హంగ్‌, అవిశ్వాసాలు వంటి వాటితో కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలో కూలిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ప్రశ్న. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సదరు రాష్ట్రంలో ఇతర పార్టీలకు లేదా కూటమికి బలం లేకపోతే అక్కడ ఎన్నికల కోసం మళ్లీ తదుపరి సార్వత్రిక ఎన్నికల దాకా ఆగాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యమ్నాయాన్ని రూపొందించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఎన్నికలు జరిపినా ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీలకు మిగిలిన కాలానికే ఎన్నికలు జరుపాల్సి ఉంటుంది. లేదంటే 356 మేరకు రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు ఆర్డినెన్స్‌ ద్వారా రాష్ట్రపతి పాలనను ప్రతి ఆరునెలకొకసారి పొడిగించి జమిలి ఎన్నికల దాకా నెట్టుకురావచ్చు. ఆరు నెలల కంటే ప్రభుత్వం పడిపోయిన రాష్ట్రాల అసెంబ్లీకి గడువు ఎక్కువ ఉంటే మళ్లీ ఆర్డినెన్స్‌తో రాష్ట్రపతి పాలన పొడిగించవచ్చు. ఇలా మూడేళ్ల కాల పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు.

అప్పటికి జమిలి ఎన్నికలకు, ఆ రాష్ట్రంలోని అసెంబ్లీ కాలపరిమితికి సమయం ఉంటే ఎన్నికల నిర్వాహణ, ప్రభుత్వాల ఏర్పాటు ఎట్లా అన్నది సందేహంగా మిగిలింది. అలాగే ఎక్కడైనా ఎంపీ, ఎమ్మెల్యే చనిపోతే ఆ ఖాళీ స్థానం ఎన్నిక జమిలి ఎన్నికల వరకు ఆగాల్సిన వస్తుందా? అనే ప్రశ్నకూ సమాధానం దొరకాల్సి ఉన్నది. ఆయా సమస్యలపై ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసినా దీనిపై అన్ని రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయం అసాధ్యంగా మారింది.

ఇంకోవైపు జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టమని, శాసన సభల ఎన్నికల నిర్వహణలపై కేంద్రం ఆధిపత్యం పెరుగవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో పరోక్షంగా అధ్యక్ష పాలన తరహా రాజకీయ విధానాలు నెలకొనవచ్చని, అవననీ దేశ సమగ్రతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని నీరుగారుస్తాయన్న వాదన కూడా వినిపిస్తున్నది.

బిల్లు ఆమోదం పొందాలంటే

ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల సమ్మతిని సాధించాల్సి ఉంటుంది. ఇదేతీరున రాష్ట్రాల అసెంబ్లీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీ ప్రస్తుతం పది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. మరో ఆరు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నది. ఎన్డీయేకు లోక్‌సభలో 333 సీట్లు ఉన్నయి. అంటే దాదాపు 61శాతం ఎంపీలు అధికార కూటమికి చెందినవారే. మిగిలిన ఐదు శాతం ఎంపీల మద్దతు సాధించడం బీజేపీకి కష్టం కాకపోవచ్చు. రాజ్యసభకు వచ్చే సరికి మొత్తం సీట్లలో 38 శాతం ఎంపీలు మాత్రమే అధికార కూటమికి చెందినవారు.

అయితే ఈ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు.
మరో మూడు నెలల్లో తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నయి. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఉన్నది. అయితే.. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి, లోక్‌సభతోపాటే ఎన్నికలు నిర్వహించడం లేదా లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించడం అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తున్నదనే అభిప్రాయాలు బలంగానే ఉన్నాయి.

Updated On 1 Sep 2023 1:00 AM GMT
krs

krs

Next Story