Japan | జనాభా కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న జపాన్ (Japan) లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కుటుంబాలు ఏమీ లేకపోవడంతో ఇక్కడి రెండో శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో ఖాళీ ఇళ్లు (Abandoned Houses) దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటున్న విదేశీ వ్యక్తులు ఇలాంటి ఇళ్లను కారు చౌకగా ఎగబడి కొనేస్తున్నారని సమాచారం. ఒక అంచనా ప్రకారం.. జపాన్‌లోని ప్రతి ఏడు ఇళ్లలో ఒక ఇల్లు ఖాళీగా ఉంటోంది. తాము వీటిని […]

Japan |
జనాభా కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న జపాన్ (Japan) లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కుటుంబాలు ఏమీ లేకపోవడంతో ఇక్కడి రెండో శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో ఖాళీ ఇళ్లు (Abandoned Houses) దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటున్న విదేశీ వ్యక్తులు ఇలాంటి ఇళ్లను కారు చౌకగా ఎగబడి కొనేస్తున్నారని సమాచారం.
ఒక అంచనా ప్రకారం.. జపాన్‌లోని ప్రతి ఏడు ఇళ్లలో ఒక ఇల్లు ఖాళీగా ఉంటోంది. తాము వీటిని విదేశాల నుంచి వచ్చే వారికి అద్దెకు ఇస్తామని, లేదా హోటల్‌గా మార్చి వ్యాపారం చేస్తామని కొనుగోలు చేసి వ్యక్తులు చెబుతున్నారు. తగ్గిపోయిన జనాభానే కాకుండా జపాన్ కరెన్సీ యెన్ భారీగా పతనం కావడమూ విదేశీయులు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తోంది.
ఇటీవలే ఒక ఖాళీ ఇంటిని కొనుగోలు చేసినన కోలిన్ అగిర్రీ అనే యువతి మాట్లాడుతూ.. ఇక్కడ ఒక మంచి భవంతిని కొనుగోలు చేయడానికి నాకు 33 వేల డాలర్లు ఖర్చయింది. అదే ఫ్రాన్స్‌లో అయితే 1,08,000 డాలర్లు పెట్టాల్సి వచ్చేది అని పేర్కొంది.
చాలా మంది ఇలా కొన్న ఇళ్లను వెకేషన్ ఇళ్లను అద్దెకు ఇచ్చే సైట్లలో పెడతారు. అంటే ఎవరైనా జపాన్ వచ్చి కొన్ని రోజులు లేదా నెలలు గడుపుదామనుకుంటే వారు ఈ ఇళ్లలోకి దిగి అద్దె చెల్లిస్తారు. పర్యాటకులను ఆకర్షించే దేశంగా పేరున్న జపాన్‌లో ఈ వ్యాపారం లాభసాటిగా ఉంటుందని విదేశీయులు భావిస్తున్నారు.
తీవ్రంగా సమస్య
2018లో అంచనా వేసిన ప్రకారం జపాన్‌లో 8 లక్షల 49 వేల ఖాళీ ఇళ్లున్నాయి. ఇది 1998తో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువ. పరిస్థితి ఇలానే కొనసాగి.. ఖాళీ ఇళ్లను అధికారులు కూల్చకుండా ఉంటే ఈ సంఖ్య 2038 నాటికి 23 లక్షలకు పెరిగిపోతుందని నొమురా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. అంటే ప్రతి మూడు ఇళ్లలో ఒక ఇల్లు ఖాళీగా ఉండనుంది. ఇలా ఆస్తులన్నీ విదేశీయుల చేతిలోకి వెళితే.. భవిష్యత్తులో జపనీయులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
