Opposition | మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీతో నితీశ్‌ భేటీ కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం ముమ్మరం నెలన్నర కాలంలోనే రాహుల్‌తో నితీశ్‌ రెండుసార్లు భేటీ విధాత: జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న కేజ్రీవాల్‌ను కలిసిన ఆయన నేడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో […]

Opposition |

  • మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీతో నితీశ్‌ భేటీ
  • కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం ముమ్మరం
  • నెలన్నర కాలంలోనే రాహుల్‌తో నితీశ్‌ రెండుసార్లు భేటీ

విధాత: జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న కేజ్రీవాల్‌ను కలిసిన ఆయన నేడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ముగ్గురు నేతలు చర్చించారు. గత నెలన్నర కాలంలో రాహుల్‌గాంధీతో నితీశ్‌కుమార్‌ ఇలా భేటీ కావడం ఇది రెండోసారి కావడం విశేషం.

ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసానికి నితీశ్‌ చేరుకున్నారు. అక్కడే ఉన్న రాహుల్‌తో సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యతకు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు విపక్ష నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, జేడీయూ చీఫ్‌ లలన్‌ సింగ్‌లు కూడా పాల్గొన్నారు.

నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోనూ నితీశ్‌ చర్చలు జరిపారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమైన కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలంతా హాజరయ్యారు. కన్నడనాట విపక్ష నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు.

ఈ కార్యక్రమంలో నితీశ్‌కుమార్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, జార్ణాండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌లతో పాటు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, మక్కల్‌ నీది మయం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తదితరులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచి తామంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాన్ని పంపారు.

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో నితీశ్‌కుమార్‌ భేటీ అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు యత్నిస్తున్న ప్రతిపక్షాలన్నీ త్వరలో సమావేశం కాబోతున్నాయని, ఈ సమావేశం ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనే విషయాన్ని ఒకటి రెండురోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఈ భేటీలో అధిక సంఖ్యలో రాజకీయపార్టీలు పాల్గొనబోతున్నట్టు ఆయన చెప్పారు.

Updated On 23 May 2023 9:22 AM GMT
krs

krs

Next Story