- స్వపక్ష గులాబీ మహిళల సీరియస్
- ఆరోపణల్లో కుట్ర దాగుందన్న ఎమ్మెల్యే
MLA sexual allegations
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే(MLA) డాక్టర్ తాటికొండ రాజయ్య(Tatikonda Rajayya) పై లైంగిక వేధింపుల ఆరోపణలు(sexual allegations) చేసిన జానకిపురం సర్పంచ్(Sarpanch) కురసపల్లి నవ్య(Kurasapalli Navya) పై స్వపక్ష గులాబీ నాయకులు విమర్శలు చేస్తుండగా, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది.
ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్ కురసపల్లి నవ్య తనను ఓ మహిళ ద్వారా ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు బహిరంగంగానే ఆరోపించిన విషయం స్థానికంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
కుట్ర దాగి ఉంది: ఎమ్మెల్యే
ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమైనవని ఎమ్మెల్యే రాజయ్య ఇప్పటికే వివరించారు. నవ్య ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని విమర్శించారు. తమ పార్టీలోని కొందరు నాయకుల సహకారంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్యపై కేసు నమోదు చేయాలని కోరుతూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా సర్పంచులు శుక్రవారం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ మహిళా సర్పంచ్‌ని లైంగిక వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యే పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ సర్పంచ్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతునందించడం గమనార్హం. అధికార పార్టీ మహిళా సర్పంచ్‌కు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల నరేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ఉపాధ్యక్షురాలు తుమ్మ విజయమేరి, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు పేర్ని ఉషా రవి, తూడి విజయ సుదర్శన్, సర్పంచ్ బిర్రు లక్ష్మీ తదితరులు ఉన్నారు.
నవ్యను పరామర్శించిన బిజెపి నేతలు
బిఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకుడు వేధిస్తున్నారు అని ఆరోపించిన జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్యను శనివారం బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్వర్యంలో బిజెపి బృందం కలిసి పరామర్శించింది. ఈ సందర్భంగా వాస్తవాలను తెలుసుకొని, తనకి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బృందంలో మాజీ మంత్రి డా. గుండె విజయరామారావు, గాంకిడి శ్రీనివాస్ రెడ్డి, చిలుక విజయరావు, బొజ్జపల్లి సుభాష్, అంజి రెడ్డి, యుగెందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అధికార పార్టీ మహిళల ఆగ్రహం
నవ్య ఆరోపణల పై ధర్మసాగర్ మండల టిఆర్ఎస్ మహిళా నాయకులు నవ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకులు కొలిపాక రజిత, జుబేదా మహ్మద్, కళ్ళెపు రాజమణి తదితరులు విమర్శించారు. సొంత ప్రయోజనాలు ఆశించి నవ్య ఎమ్మెల్యే పైన తప్పుడు ఆరోపణలు చేసినట్లు విమర్శించారు. మీ పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుదామంటూ హెచ్చరించారు. వాస్తవానికి తమ తోటి మహిళ తమ పార్టీకి చెందిన దళిత మహిళా ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసినప్పుడు సొంత పార్టీ నుంచి మద్దతు ఉండాల్సి ఉండగా భిన్నమైన వైఖరిని స్థానిక గులాబీ మహిళా నాయకురాలు ప్రదర్శించారు.
నవ్యని విమర్శిస్తూ ఎమ్మెల్యే గొప్పతనాన్ని వివరిస్తూ ఆయనకు మద్దతు పలికారు. నవ్య ఆరోపణల్లో రాజకీయ కుట్ర ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. టిఆర్ఎస్ మహిళలు ఎమ్మెల్యేకు మద్దతు తెలపడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే ఆమెపై ఆరోపణలు చేసినట్లు కొందరు భావిస్తుండగా, నిజా నిజాలు ఏంటో తెలియవని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.