మూవీ పేరు: ‘ఓరి దేవుడా’విడుదల తేదీ: 21-10-2022నటీనటులు: విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, మురళీ శర్మ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, విక్టరీ వెంకటేష్ (స్పెషల్ రోల్) తదితరులుసినిమాటోగ్రఫీ: విధు అయ్యన్నఎడిటింగ్: విజయ్మ్యూజిక్: లియోన్ జేమ్స్డైలాగ్స్: తరుణ్ భాస్కర్నిర్మాతలు: పెరల్ వి పొట్లూరి- పరమ్ వి పొట్లూరిదర్శకత్వం: అశ్వత్ మారిముత్తు విధాత: యంగ్ హీరోలలో విశ్వక్‌సేన్ రూటే సెపరేటు. మాస్ కా దాస్‌గా కానే కాదు.. క్లాస్ హీరోని కూడా అని అనిపించుకోవడానికి ఈ మధ్య […]

మూవీ పేరు: ‘ఓరి దేవుడా’
విడుదల తేదీ: 21-10-2022
నటీనటులు: విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, మురళీ శర్మ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, విక్టరీ వెంకటేష్ (స్పెషల్ రోల్) తదితరులు
సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న
ఎడిటింగ్: విజయ్
మ్యూజిక్: లియోన్ జేమ్స్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: పెరల్ వి పొట్లూరి- పరమ్ వి పొట్లూరి
దర్శకత్వం: అశ్వత్ మారిముత్తు

విధాత: యంగ్ హీరోలలో విశ్వక్‌సేన్ రూటే సెపరేటు. మాస్ కా దాస్‌గా కానే కాదు.. క్లాస్ హీరోని కూడా అని అనిపించుకోవడానికి ఈ మధ్య ఆయన చేస్తున్న సినిమాలే సాక్ష్యాలు. ఇటీవల ఆయన నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా వచ్చి.. మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే తరహా కాన్సెప్ట్‌తో మరోసారి క్లాస్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశ్వక్.

తమిళ్‌లో మంచి విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని ‘ఓరి దేవుడా’గా రీమేక్ చేసి.. నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరున్న పీవీపీ బ్యానర్స్ నిర్మాతలు. అంతేకాదు, విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో కనిపిస్తాడని.. ఎప్పుడైతే వార్త బయటికి వచ్చిందో.. సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్ ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తే.. ‘RRR’ హీరోలు ఈ సినిమా రేంజ్‌ను ఇంకాస్త పెంచేశారు.

రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి.. సినిమా గురించి సూపర్బ్ స్పీచ్ ఇస్తే.. విశ్వక్ తన ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడి.. టోటల్‌గా ఇద్దరు హీరోల అభిమానులని బుట్టలో పడేశారు. అంతేకాకుండా, భారీ పోటీ ఉన్నా కూడా ధైర్యంగా ఈ సినిమా థియేటర్లలోకి దిగడంతో.. ఇందులో ఉన్న కంటెంట్‌పై మేకర్స్‌కి ఎంత నమ్మకం ఉందో తెలియజేసింది. మరి ఇంత హడావుడితో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుందో.. మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:


తమిళ్‌లో ‘ఓ మై కడవులే’ సినిమా చూసిన వారికి కథతో పనిలేదు కానీ.. ఇక్కడ చిన్న చిన్న మార్పులు మాత్రం చేశారు. కథలోని సోల్ మిస్ అవకుండా.. అలాగే తెలుగు వారికి నచ్చేలా.. చేసిన ఈ మార్పులు.. అక్కడ చూసిన వారిని కూడా మరోసారి చూడాలని పించేలా చేస్తాయి.

కథలోకి వస్తే.. అర్జున్ దుర్గరాజు (విశ్వక్ సేన్), అను పాల్‌రాజ్ (మిథిలా పాల్కర్) మంచి స్నేహితులు. ఆ స్నేహాన్ని ప్రేమగా ఊహించుకుని.. అర్జున్‌ని పెళ్లి చేసుకోమని అను అడుగుతుంది. స్నేహితురాలి మాట కాదన లేక అర్జున్ కూడా అంగీకరించడంతో.. ఇద్దరి స్నేహం పెళ్లిగా మారుతుంది. అయితే వారిద్దరి కాపురానికి మాత్రం ఆ స్నేహమే అడ్డొస్తుంది. అనుని స్నేహితురాలిగా తప్ప.. భార్యగా అర్జున్ స్వీకరించలేడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది.

అంతలో ఈ కథలోకి అర్జున్ చిన్ననాటి క్రష్ మీరా(ఆశా భట్) ఎంటరవుతుంది. ఆమెతో అర్జున్ క్లోజ్‌గా మూవ్ అవడంతో.. అను-అర్జున్‌ల వ్యవహారం విడాకుల వరకు వెళ్లిపోతుంది. అర్జున్ ఎటూ తేల్చుకోలేక దేవుడా.. అంటూ జుట్టు పీక్కుంటున్న సమయంలో దేవుడు (వెంకీ) ఎంటరై.. అర్జున్‌ని ఆట పట్టిస్తూ.. అతనికి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. దేవుడిచ్చిన ఆ సెకండ్ ఛాన్స్ ఏమిటి? ఆ అవకాశాన్ని అర్జున్ ఎలా వినియోగించుకున్నాడు? అర్జున్ కాపురం చక్కబడిందా? అనేది తెలియాలంటే థియేటర్‌లో సినిమా చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాకి ఎన్నుకున్న తారాగణం విషయంలోనే దర్శకుడి గొప్పతనం తెలిసిపోతుంది. తమిళ్‌లో హిట్టు కొట్టి.. మళ్లీ అదే కథతో వేరే తారాగణాన్ని తీసుకునేటప్పుడు.. అతను కూడా రెండో ఛాన్స్ తీసుకున్నాడా? అని అనిపిస్తుంది. అక్కడ మిస్సయిన అంశాలను ఈ సినిమాలో ఆయన పొందుపరిచిన తీరు చూస్తే అదే అనిపిస్తుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ ప్రథమార్థంలో ఎనర్జిటిక్‌గా.. తన పవర్ చూపించాడు.

సెకండాఫ్‌లో భావోద్వేగాలతో కట్టి పడేశాడు. విశ్వక్ సేన్‌‌ని ఈ సినిమా ఇంకో మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ఈ సినిమాపై ఆయనకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో.. సినిమా చూస్తే తెలుస్తుంది. విశ్వక్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ హీరో అని అనిపించుకున్నాడు. అతని డ్యాన్స్ గురించి కూడా మాట్లాడుకునేలా ఈ సినిమాలో డ్యాన్స్‌ చేశాడు.

హీరోయిన్లలో అనుగా చేసిన మిథిలా పాల్కర్‌ మంచి మార్కులు కొట్టేస్తుంది. ఆమె నటన, భావోద్వేగాలు పండించిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది. మరో హీరోయిన్ ఆశా భట్ కూడా నటనతో ఆకట్టుకుంది. అను తండ్రిగా మురళీశర్మ పాత్ర చాలా పెద్దరికంగా, హుందాగా అనిపిస్తుంది. ‘గాడ్‌ఫాదర్’లో కీలక పాత్రలో కనిపించిన పూరీ.. ఈ సినిమాలోనూ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఇంకా ఇతర పాత్రలలో నటించిన రాహుల్ రామకృష్ణ, విశ్వక్ ఫ్రెండ్ పాత్రలో చేసిన నటుడు.. అంతా ఓకే అనిపించుకున్నారు.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెంకీ పాత్ర గురించి. ఒరిజినల్‌గా ఈ పాత్రను విజయ్ సేతుపతి చేశాడు. ఇక ఈ సినిమా విషయంలో వెంకీ పాత్ర పేరు వినబడినప్పుడు.. సినిమాకి ఎటువంటి హైప్ వచ్చిందో.. సినిమాలో వెంకీ కనిపించినప్పుడు.. చూసే వాళ్లకి అంతే ఎనర్జీ వస్తుంది. మోడ్రన్ గాడ్‌గా వెంకీ కనిపించిన తీరు, ఆయన నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెంకీ అనుభవం, ఆయన స్టయిల్.. ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మెయిన్ హైలెట్స్ అని చెప్పు కోవచ్చు. ఎక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఎలా ఇవ్వాలో అలా.. ఇచ్చి, సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ తన ప్రతిభను చాటుకున్నాడు. అలాగే కెమెరామెన్ విధు అయ్యన్న కూడా మూడ్‌కి తగినట్లుగా.. ముఖ్యంగా ప్రేక్షకులకు నచ్చే ఫ్రేమ్స్‌తో సినిమాని తన కెమెరాలో బంధించాడు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ బాగున్నాయి. న్యాచురల్‌గా అనిపించాయి. ఎడిటింగ్ పరంగా కూడా ఓకే. ఇంకా మిగతా సాంకేతిక నిపుణులు.. మంచి ఆర్టిస్ట్‌లు, సన్నివేశాలు పడితే.. ఏమేం చేయగలరో అది చేసి చూపించారు.

నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది పీవీపీ వాళ్ల సినిమా. ఒక సినిమాని ఎలా ప్రొమోట్ చేస్తే.. ప్రేక్షకులలోకి వెళుతుందో తెలిసిన పీఆర్వో వంశీకాక ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావడంతో.. అన్ని రూట్స్‌ని వాడుకుని.. ఆయన ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లాడు. బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదలైనా.. ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఈ సినిమాపైనే పడేలా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అలా వచ్చిన ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో సినిమా కూడా సక్సెస్ అయింది.

విశ్లేషణ:

ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక చోట సెకండ్ ఛాన్స్ ఉంటే బాగుండేదే.. అని అనుకోవడం సహజం. ఒక గేమ్‌లో ఓడిపోయిన వాడు.. ఇంకో ఛాన్స్ వస్తే.. ఖచ్చితంగా గెలుస్తానని అనుకుంటాడు. అలాగే గెలిచిన వాడు.. ఇంకో ఛాన్స్ వస్తే.. ఇంకాస్త బెటర్‌గా ట్రై చేయాలని అనుకుంటాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో సెకండ్ ఛాన్స్ ఆలోచన చేసే ఉంటారు. ఆ సెకండ్ ఛాన్స్‌నే తీసుకుని దర్శకుడు అశ్వత్ ఓ ఫాంటసీ కథను తయారు చేసుకున్నాడు.

అందులో రొమాంటిక్ కామెడీని జోడించాడు. ఫస్టాఫ్ అంతా హీరోహీరోయిన్ల మధ్య స్నేహం, పెళ్లి అంటూ సరదాసరదాగా నడిపించి.. ఇంటర్వెల్‌కి మంచి కిక్ ఇచ్చి.. సెకండాఫ్ మొత్తాన్ని భావోద్వేగాలతో నడిపించాడు. ఆర్టిస్ట్‌ల నుండి మంచి నటనను రాబట్టాడు. వెంకీని మోడ్రన్ దేవుడిగా రప్పించి.. ఆటని మరింతగా రక్తి కట్టించాడు. ఆల్రెడీ చేసిన సినిమానే కావడంతో.. దర్శకుడు ఎక్కడా తడబడినట్లు అనిపించలేదు. అలాగే మంచి ఆర్టిస్ట్‌లు లభిస్తే.. ఎలా చెలరేగిపోవచ్చో.. అదే చేశాడు.

అయితే ఇంకాస్త హాస్యానికి చోటిచ్చి ఉండే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఎక్కువగా భావోద్వేగాలతో నింపేశాడు. అక్కడక్కడా కాస్త ల్యాగింగ్‌గా అనిపించింది. వెంకీ దిగాక.. ఇక సినిమా రేంజే మారిపోయింది. ఓవరాల్‌గా అయితే.. దీపావళికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇంటిల్లిపాదీతో కలిసి చూసే సినిమాగా ఈ సినిమాని దర్శకుడు మలిచాడు. అతను ఈ సినిమాని డీల్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. కాబట్టి.. సెకండ్ ఛాన్స్ థాటే వద్దు.. హాయిగా ఈ సినిమాతో ఎంజాయ్ చేయవచ్చు.

ట్యాగ్‌లైన్: తర్వాత చూద్దాం.. అనే థాటే వద్దు
రేటింగ్: 3/5

Updated On 21 Oct 2022 5:38 PM GMT
krs

krs

Next Story