ORR
- రూ. 750 కోట్ల ఆదాయం వస్తున్న ORRను రూ. 246 కోట్లకే కట్టబెట్టిన సర్కారు
- కాంగ్రెస్ పార్టీ ORRను నిర్మిస్తే కేటీఆర్ అమ్ముకున్నారు
- అరవింద్ కుమార్ KCR ఫామ్ హౌజ్‌లో ఉన్నాడా?
- ఆర్‌టీఐ దరఖాస్తుకు కనీసం స్టాంప్ కూడా వేయరా?
- అధికారంలోకి రాగానే విచారణ.. ఎవ్వరినీ వదలి పెట్టం
- మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత: ఔటర్ రింగ్ రోడ్(ORR) టోల్ వసూలు టెండర్ లో భారీ కుంబకోణం జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని, దీనికి దోషులైన వారిని ఎవ్వరిని వదలి పెట్టమని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పురపాలక శాఖ పరిపాలనా భవనంలో ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఔటర్ టోల్‌పై ఏడాదికి రూ. 750 కోట్ల ఆదాయం వస్తుంటే కేవలం ముంబైకి చెందిన సంస్థకు రూ. 246 కోట్లకే కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా, భవిష్యత్ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని, అభివృద్ధిని అందించాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6696 కోట్లతో ORR నిర్మించిందని రేవంత్ అన్నారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం నాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేసే ఏర్పాటు చేసిందన్నారు. ఈ విధానం ద్వారా ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ. 750కోట్ల టోల్ ఆదాయం వస్తుందన్నారు.
ఇలా ఆదాయం వస్తున్న ORRను ముంబైకి చెందిన ఐఆర్‌బీ సంస్థకు కేవలం రూ. 7388 కోట్లకు 30 ఏళ్ల లీజుకు అప్పగించారని ఆరోపించారు. ప్రస్తుత విధానంలో ఏడాదికి రూ. 750కోట్లు వస్తుంటే కేవలం రూ. 246కోట్లకే ముంబై కంపెనీకి కట్టబెట్టడాన్ని రేవంత్ తప్పు పట్టారు. బంగారు బాతును కేటీఆర్ 30 ఏళ్లకు ఓఆర్ఆర్ ను తెగనమ్మారు. ఆరునెలల్లో దిగిపోయే ముందు ప్రభుత్వం ORRను అమ్ముకున్నారని ఆరోపించారు.
ఆదివారం నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారని రేవంత్ అన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చిన సీఎం కేసీఆర్ 24గంటలు తిరక్కముందే మరిచారన్నారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదన్నారు. టోల్ కు సంబంధించి టెండర్ ప్రక్రియ లో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు మాత్రమే సచివాలయానికి వెళ్లానన్నారు. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారన్నారు.
🔥What objection does the @TelanganaCMO have if I go to the secretariat as an MP?!
Stopping by the @TelanganaCOPs is undemocratic.🔥 I said that I will go alone and meet the authorities..still was not allowed.
🔥The government is afraid that the corruption on Outer Ring… pic.twitter.com/ASidlcPTuq
— Revanth Reddy (@revanth_anumula) May 1, 2023
హెచ్ఎండీఏ కార్యాలయం ఇంకా షిఫ్ట్ కాలేదని చెప్పి పురపాలక శాఖ పరిపాలనా కార్యాలయానికి తీసుకొచ్చారన్నారు. కానీ ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇస్తే అక్ నాలెడ్జిపై రబ్బరు స్తాంప్ కూడా వేయలేదని తెలిపారు. కార్యాలయం సెక్రటేరియట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాధానం ఇచ్చారన్నారు. మరి అరవింద్ కుమార్ ఇక్కడ లేడు, అక్కడ లేడు.. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా? అని రేవంత్ అడిగాడు.
నయా తెలంగాణ ఈడీ అమీన్ ను సెక్రటేరియట్ లో గొయ్యి తీసి పాతి పెడతారన్నారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను తెగనమ్ముకున్నారని రేవంత్ ఆరోపించారు. ఇది వేల కోట్ల కుంభకోణం.. ఇది ప్రభుత్వ ఆస్తిని తెగనమ్మడమే నని వ్యాఖ్యానించారు. ఈ దోపీడీ వెనక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారన్నారు. పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదన్నారు. దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాల తలుపు తడతామని తెలిపారు.
మంత్రి కేటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడుతామన్నారు. బీఆరెస్ ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. పరిపాలన భవనంలోకి ఎంపీ కి అనుమతి ఎందుకు? ఇవ్వరని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కిలోమీటర్ దూరంలోనే నన్ను అడ్డుకున్నారని, కనీసం గేటు వరకు కూడా రానివ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్లపై విచారణ చేయిస్తామని, ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదన్నారు.