Thursday, March 23, 2023
More
  HomelatestWARANGAL: ఓరుగల్లు అన్నదాత కంట నీరు.. అకాల వర్షంతో అతలాకుతలం

  WARANGAL: ఓరుగల్లు అన్నదాత కంట నీరు.. అకాల వర్షంతో అతలాకుతలం

  • రైతుల కష్టంపై రాళ్ల వాన దాడి
  • చేతికొచ్చిన పంట నేలపాలు
  • భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం
  • దుఃఖం మిగిల్చిన మొక్కజొన్న
  • పండ్ల తోటలపై వడగండ్ల పగ
  • కూరగాయల పంటలు ధ్వంసం
  • పడిపోయిన భారీ వృక్షాలు
  • తెగిపోయిన కరెంటు వైర్లు
  • లేచిపోయిన రేకుల ఇళ్ల కప్పులు
  • అలుముకున్న అంధకారం

  అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. అకాల వర్షం రైతన్నను అతలాకుతలం చేసింది. ఏపుగా ఎదిగిన పంటలపై సాగిన రాళ్ల వాన దాడితో పంట నేలపాలయ్యి రైతు కష్టం నీట కలిసింది. కంటిపాపలా సాకిన పంటచేలు కళ్ళముందే నాశనం కావడంతో ఓరుగల్లు రైతన్న కంటనీరు పెడుతున్నారు. శనివారం రాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగిన వడగళ్ల వాన దాడి రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వచ్చిన రాళ్ళ వాన పంటలపై పడి పగ తీర్చుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. రాళ్ళవానకు రేకుల ఇండ్ల పైకప్పులు రంద్రాలు పడ్డాయి. కరెంటు నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. ఒకటి రెండు చోట్ల గోడలు కూలి ప్రమాదం జరిగింది. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి బావురు మంటున్న ఇల్లు లాగా పంటచేలు నెలకొరిగిపోయాయి. రైతుల బాధ చెప్పనలవిగా ఉంది.

  విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అకాల వర్షం అన్నదాతను ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా, అధోగతి పాలు చేసింది. రొక్క మిగులుస్తుందనుకున్న మొక్కజొన్న దుఃఖం మిగిల్చింది. కంకి పాలు పోస్తున్న దశలో ఉన్న మొక్కజొన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేతికి రాకుండా పోయింది.

  పండ్లతోటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కాతదశలో ఉన్న మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. కాత రాలి పోయింది. కూరగాయ తోటలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. ముఖ్యంగా బొప్పాయి, మునగ, అరటి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, జనగామ, భూపాల్ పల్లి జిల్లాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

  మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో

  మానుకోట, జనగామ లోని మరిపెడ, దంతాలపల్లి, నెల్లికుదురు, తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల తదితర మండలాల్లోని తొర్రూరు మండలం మడిపల్లి, చందూర్ తండా, మాటేడు, పోలే పల్లి, వడ్డే కొత్త పల్లి, పెద్ద వంగర, చిన్న వంగర, భారీ వడగండ్ల వానలతో అతలాకుతలమైంది. భారీ వృక్షాలు విరిగి రహదారులకు అడ్డుపడగా రాకపోకలకు అంతరాయం కలిగింది.

  చేతి కందిన వరిచేన్లు,ఇతర పంటలు నేలకొరిగి రైతులకు శాపంగా మారింది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సునామీలా వడగండ్లతో ఎగసిపడ్డ ఆయా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. గ్రామాల్లో పంట నష్టాలను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. మామిడి తోటలు, నిరాశ్రయులైన ప్రజలకు కలిసి మాట్లాడి పంటలు పరిశీలించారు.

  వరంగల్ జిల్లా

  వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గం పరిధిలో నిన్నరాత్రి కురిసిన భారీ వడగండ్ల వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయి. నర్సంపేట నియోజకవర్గంలో పంటలను, ఇండ్లను క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. జరిగిన పంట నష్టాన్నీ, ప్రజాప్రతినిధులు, సoబంధిత అధికారులతో కలిసి పర్యటించారు.

  బాధితులు, రైతులు ఎవ్వరూ ఆందోళన పడవద్దన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. నష్టపరిహారాన్ని అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వర్ధన్నపేట పరిధిలో తాళ్లకుంటతండా, డిసీ తండాలో భారీ వర్షానికి మొక్క జొన్న, మామిడి తోటలు దెబ్బతిన్నాయి.

  హనుమకొండ జిల్లా

  హనుమకొండ జిల్లా పరకాల, భీమదేవరపల్లి, ధర్మసాగర్, కమలాపూర్ మండల వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి, వడగళ్ల వానకు వందలు ఎకరాల్లో మొక్కజొన్న పంట, మిర్చి దెబ్బతింది. మామిడి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. చెట్లు విరిగి, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి.

  వరంగల్ నగరంలో భారీ వడగండ్లు

  వరంగల్ నగరంలో వడగండ్ల వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన వల్ల
  విద్యుత్ సరఫరా రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు నిలిచిపోయింది. దీంతో నగరం మొత్తం విద్యుత్ లేక అంధకారంగా మారింది. పెద్ద సైజ్ రాళ్ళు పడటంతో చాలా దిక్కుల ఇంటి అద్దాలు, కారు అద్దాలు పగిలి పోయాయి. రాళ్ల వాన తాకిడికి నగరంలోని పలు కాలనీల్లో రేకులు ఎగిరిపోయాయి.

  లక్ష్మీ నగర్‌లో గోడ కూలి కింద ఉన్న ఇంటిపై పడటంతో నవ వధువుకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.ఇళ్లల్లోకి నీరు చేరి రాత్రంతా జాగారం చేశారు. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కాలనీలలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular