Wednesday, March 29, 2023
More
    HomelatestOscars | ఆస్కార్.. దరి చేరని ఆణిముత్యాలెన్నో!

    Oscars | ఆస్కార్.. దరి చేరని ఆణిముత్యాలెన్నో!

    ఇప్పుడు పాన్ ఇండియా అంటే పెద్ద వేల్యూ లేదు. పాన్ వరల్డ్ లెవెల్ అంటే వొక మోస్తరు. ఈ వి.ఎఫ్.ఎక్స్ లూ, ఇన్ని హై రిసల్యూషన్ కెమెరాలూ, ఇంత టెక్నాలజీ , ఈ రీమిక్సింగ్ టెక్నిక్స్ అబ్బో ఒకటేంటి చాలా హడావుడి. వి.ఎఫ్.ఎక్స్ లో ఒక చందమామ కథని గ్లోరిఫై చేస్తే అది ప్రైడ్ ఆఫ్ ఇండియా. మరొకటి వరల్డ్ రేంజ్ వండర్. వందల కోట్ల భారీ బడ్జెట్.!

    అసలు మూవీ బడ్జెట్ లో హీరోలు, దర్శకులు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత. సినిమాకి పెట్టిన ఖర్చెంత. అందులో ప్రమోషన్‌కి కేటాయించిన షేర్ ఎంత. అండ్ మోరోవర్ ప్రమోషన్ టైమ్‌లో స్టేజ్ మీద వీళ్ళు చేసే హై డ్రామా మరో ఎపిసోడ్. నెలల తరబడి ఊరూరు తిరుగుతూ దండోరా. అందులో మళ్లీ ఒక స్పెషల్ అట్రాక్షన్. ఏ బాలీవుడ్డో కొలీవుడ్డో నుంచి ఒక సెలబ్రిటీ పర్సనాలిటీ. స్టేజీ మీద ఒకరికొకరు తెగ పొగిడేసుకుని మన కళ్ళమ్మటే నీళ్లు వచ్చేలా తెగ ఎమోషన్ ఫీలైపోయి ఉబ్బితబ్బిబ్బయి పోతారు. అహమ్మదాబాద్‌లో ఐ.ఐ.ఎమ్ చేసినా ఇన్ని మార్కెటింగ్ స్ట్రేటజీలు ఉండవు.

    కథలో ప్రాణం, కథనంలో జీవం, పాత్రల పరిధి, నటనా కౌశల్యం, కొన్ని వ్యాపార విలువలు, మరి కొన్ని నైతిక అంశాలు ఉంటే ఇన్ని ఆర్భాటాలు అవసరమా. సినిమా సక్సెస్ అవ్వాలంటే తప్పనిసరిగా ఇంత ఖర్చు పెట్టవలసిందేనా. అవార్డు కమిటీలు కేవలం బడ్జెట్ నీ, టెక్నాలజీనీ మాత్రమే పరిగణలోకి తీసుకుని అవార్డు ప్రకటిస్తారా. అసలు ఏ వేల్యూస్ ని ఆధారం చేసుకుని ఆస్కార్ అవార్డు ప్రకటిస్తారు! నటీనటుల ప్రతిభకు కేవలం ఆస్కార్ మాత్రమే ఒక కొలమానామా !

    2023లో నాటు, నాటు పాటకి ఆస్కార్ రావడం చాలా పెద్ద ఆశ్చర్యం. అలాగే 2009లో సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్‌కి ఆస్కార్ ప్రకటించినప్పుడు కూడా నేను ఇలాగే ఆశ్చర్య పడ్డాను. అలా అని నాకు భారత దేశ కళాకారుల ప్రతిభ మీద నమ్మకం లేదని కాదు. సరైన రీతుల్లో కళ గుర్తింపు పడటం లేదేమో అన్న అనుమానం. 2009లో ఏ. ఆర్. రహమాన్‌కి ఆస్కార్ ప్రకటించిన సందర్భంగా నాకు ఇళయరాజా, ఇంకొంత మంది ముందు తరం సంగీత దర్శకులు గుర్తొచ్చారు.

    2023లో దర్శకుడు రాజమౌళి గారి RRR ఆస్కార్ నామినేషన్ పోటీలో నిలిచినపుడు నాకు బాల చందర్, భారతీ రాజా, మణిరత్నం, శంకర్, సింగీతం శ్రీనివాస రావు, కె.విశ్వనాధం గుర్తొచ్చారు. వీరు కాక ఇండియా లెవెల్లో గుర్తు చేసుకుంటే శ్యామ్ బెంగల్ గారు, వి. శాంతారం గారు, సత్యజిత్ రే గారు, బిమల్ రాయ్ గారు, రాజ్ కపూర్ గారు, సంజయ్ లీలా భన్సాలీ గారు ఇలా లిస్టు చాలా పెద్దదే. వీరందరినీ తోసి పుచ్చి రాజమౌళిలో పెల్లుబికిన ప్రతిభ నాకు అంతు పట్టలేదు.

    ఇక కథానాయకులు కేటగిరీలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎమ్జిఆర్, శివాజీ గణేషన్, మమ్ముట్టి, గిరీష్ కర్నాడ్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్ వంటి హేమాహేమీలు కూడా గుర్తొచ్చారు. కొన్ని సినిమాల్లో ఇర్ఫాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్. ఒక్కొక్క సారి రజనీకాంత్. తెలుగులో పౌరాణిక, జానపద చిత్రాల్లో అనేక పాత్రలు, దాన వీర శూర కర్ణలో మూడు పాత్రలు పోషించిన సీనియర్ ఎన్టిఆర్. నటనా వైభవాన్ని ఏ అవార్డులతో కొలవాలి.

    ఇండియన్ స్క్రీన్ మీద కమల్ హాసన్  ఓ చెరగని ముద్ర అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విచిత్ర సోదరులు, భారతీయుడు, స్వాతిముత్యం, అభయ్ ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ హాసన్ చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు మరే నటులు చెయ్యలేదు. మరి కమల్ హాసన్‌కి ఏ అవార్డు ఇవ్వాలి. వీరందరినీ తోసి పుచ్చి జూనియర్ ఎన్టిఆర్, రాంచరణ్ వీరిద్దరిలో ఏ నటనా కౌశలం దాగి ఉందో కూడా నాకు అర్ధం కాలేదు.

    సినిమా మేకింగ్ విషయానికి వస్తే దాన వీర శూర కర్ణ వంటి ఒక పెద్ద దృశ్య కావ్యాన్ని కేవలం నలభై మూడు రోజుల్లో పూర్తి చేసారు. ఈ రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఎంత హడావుడి, ఆర్భాటం కావాలి. ఎంత మీడియా బ్యాక్ అప్ కావాలి. కృష్ణ గారి సింహాసనం తొలి సెవెంటి ఎమ్ ఎమ్ సినిమా గురించి ఎలా ప్రస్తావించుకోవాలి. ముఖ్యంగా అంత భారీ చిత్రాల్ని నిర్మించడానికి వారు తీసుకున్న సమయం ఎంత. వారి పబ్లిసిటీ ఎంత, వారి పారితోషకం, పెట్టిన ఖర్చు ఎంత. వసూలు చేసిన సొమ్ము ఎంత. అప్పట్లో ఇలా రేట్లు పెంచే ప్రహసనాలు కూడా లేవు. ఇంత టెక్నాలజీ లేదు.

    మన తెలుగు వరకు మరీ ముందు తరం దర్శక దిగ్గజాలు బి.ఎన్. రెడ్డి గారు, కె.వి.రెడ్డి గారు. వారి బహుముఖ ప్రతిభ, అరుదైన వ్యక్తిత్వం, కొన్ని విలువలుతో కూడిన వ్యాపార శైలి గురించి, మల్లీశ్వరి, పాతాళ భైరవి, మాయా బజార్ వంటి ఎవర్ యంగ్ క్లాసిక్స్, అలనాటి ఆణిముత్యాలు గురించి ఇక్కడ ప్రస్తావించడం ఇక్కడ చాలా పెద్ద విషయం. ఆ రియాలిటీ, నేటివిటీ, ఒరిజినాలిటీ, పోయిటిక్ విజువల్స్, హావభావ ప్రదర్శన. నటనకీ, కళకీ, ప్రతిభకీ నిలువెత్తు నిదర్శనాలు. మరి వీరికి ఒక ఆస్కార్ అవార్డు సరిపోతుందా. అందుకే ఈ రోజుల్లో అసలు సినిమాలో ఏం చూసి ఆస్కార్ అవార్డులు ప్రకటిస్తున్నారో అర్ధం కావడం లేదు.

    ఇవన్నీ పక్కన పెడితే సుడి తిరగాలే కానీ ఒకే ఒక్క అరుపుతో వీర లెవెల్లో వొక సినిమా హిట్టై పోద్ది. హీరోకి ఒక పంచె కట్టి చేతిలో ఒక విల్లు పెట్టి గాల్లోకి పైకి లేపి ఒక బాణం విసిరితే స్వాతంత్య్ర సమర యోధుడు, మహానుభావుడు అల్లూరి సీతారామ రాజు. ఒక ఆదివాసీ క్యారక్టర్‌కి చారిత్రిక నేపథ్యం ఉన్న ఒక పర్సనాలిటీ పేరు కొమురం భీం.

    ఒక సర్కస్ వ్యాన్ నిండా సింహాలు, పులులు దోపేసి ఒక్క సారి గాల్లోకి విసిరేస్తే ఈలలెయ్యాలి. ఊగి పోవాలి. అదొక విజువల్ వండర్. భారీ క్రియేటివిటీ. లుంగీ ఎగేసి కట్టి, మీసం మెలేసి, కోపంతో ఊగి పోతూ ఒక నాలుగు బూతు డైలాగులు. అదొక లెవెల్. నేర చరిత్రని ఊర మాస్‌గా చెప్తే ఇంకో లెవెల్. ఎవడు ఎప్పుడు ఏ సినిమాని పైకి లేపుతాడో అర్ధం కాదు.

    ఇప్పుడొక మాట ఫ్యాషనై పోయింది. మూవీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ లెవెల్ ఏంటో వాడికే అర్ధం కావాలి. సరే ఎవరి టాలెంట్ వారిది. సినిమా కదా బాసూ జస్ట్ ఫార్ టైమ్ పాస్ కాబట్టి సరే అనుకుందాం. బట్, వీటికి అవార్డులు రివార్డులు ఏందిరా అయ్యా. వోరే సాంబా, ఎవడి డప్పు వాడు కొట్టుకోండెహె !.

                                                                                            – శ్రీకాంత్‌

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular