విధాత: పాకీజా అంటే నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ నిన్నటి తరంలో ఆమె ఒక లేడీ కమెడియన్‌గా కొన్ని వందల చిత్రాలలో నటించారు. వీటిలో ఆమెకు పేరుతో పాటు ఒక గుర్తింపును తెచ్చిన చిత్రంగా ‘అసెంబ్లీ రౌడీ’ని చెప్పాలి. బి గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన ఈ చిత్రంలో ఆమె కాలేజీలో బాత్రూమ్స్ కడిగే పాత్రను పోషించింది. ఆమెకు జోడిగా బ్రహ్మానందం నటించాడు.
ఈ కామెడీ ట్రాక్ ఆ సినిమాకి హైలెట్. ఆనాటి రోజుల్లో ఈ కామెడీ ట్రాక్ అదిరిపోయే లెవల్లో హిట్ అయింది. ఆ తర్వాత కొంతమంది బాత్రూమ్స్ కడిగే వారిని పాకీజా అంటూ ఆట పట్టించే వారు. అంతగా యూత్‌తో పాటు.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆమె ఆకట్టుకుంది. ఈమె అసలు పేరు వాసుకి. వాసుకి అంటే బహుశా నాటి తరానికి కూడా తెలియదు. కేవలం పాకీజా గానే ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పాకీజా ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందట.
తినడానికి తిండి లేదు… ఆరోగ్యం క్షీణిస్తోంది. దుర్బర పరిస్థితిలో జీవితాన్ని బతికిడుస్తోంది. ఇటీవల ఆమె చెన్నైలో రోడ్డు మీద వెళ్తుండగా ఓ మీడియా ప్రతినిధి ఆమెను గుర్తుపట్టాడు. మీరు పాకీజా కదా అంటే అవునంటూ సమాధానం చెప్పింది. చెన్నైలో ఉండడం లేదు. మధురైలో ఉంటున్నాను. అక్కడ మాది ఒక చిన్న గ్రామం. అక్కడికి వెళ్లిపోయాను. ఒక ఫ్రెండ్‌ని కలవడానికి చెన్నై వచ్చాను.
చెన్నైలో బస్సులు ఉచితమంట కదా! హాస్టల్లో దిగాను. టీ నగర్ వెళ్ళాలి అని సమాధానం ఇచ్చిందట. ఆమె పరిస్థితి చూసి బాధపడిన మీడియా ప్రతినిధి ఏమైనా తిన్నారా అని అడిగితే టీ తాగి వచ్చాను. తినడానికి డబ్బులు లేవు అని సమాధానం వచ్చింది. దాంతో ఆయన మొదట భోజనం చేద్దాం తర్వాత మిగతావి మాట్లాడుదామని ఒక లగ్జరీ హోటల్‌కు తీసుకుని వెళ్లారట. మంచి భోజనం చేసి ఆరు నెలలు అయింది అని పాకీజా చెప్తుంటే అతని గుండె తరుక్కుపోయిందట.
ఇంకా ఆమె మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. కూడ పెట్టిన ఆస్తులు ఏమీ లేవు. అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. అయినవాళ్ళు పట్టించుకోవడం లేదు. నడిగర్ సంఘం ఉంది కానీ ఎలాంటి సాయం చేయలేదు. రజినీకాంత్, ఉదయనిది స్టాలిన్‌తో పాటు పలువురికి నా పరిస్థితి వివరిస్తూ వీడియోలు పెట్టాను, ఎవరు స్పందించలేదు. సాయం చేయడానికి ముందుకు రాలేదు. నాకు షుగర్‌తో పాటు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
తెలుగులో జయలలిత నాకు ఫ్రెండ్, ఆ రోజుల్లో చెన్నైలో ఇద్దరం ఒకే రూమ్‌లో ఉండే వాళ్ళం, ఆమెతో కనెక్షన్ పోయింది, నెంబర్ మిస్సయింది, జయలలిత నటించిన సీరియల్స్‌లో నాకు కూడా వేషాలు ఇప్పించేందుకు ట్రై చేస్తానని చెప్పింది. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా కలిసి సాయం అడగాలని వాసుకి తన వేదన వెలిబుచ్చిందట. పాపం.. ఈమె పరిస్థితి ఐరన్ లెగ్ శాస్త్రి, కల్పనా రాయ్ లలాగా అవ్వడం చాలా బాధాకరమైన చెప్పాలి. కొందరు సినిమా వారి పరిస్థితి ఇలాగే ఉంటుందనే దానికి.. గతంలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. దానికి నేడు వాసుకి అలియాస్ పాకీజా ఓ ఉదాహరణ.