విధాత: ఉగ్రవాదంపై పోరులో అమెరికా చేతిలో పాకిస్థాన్ అద్దె తుపాకీ మాత్రమేనని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే పేరుతో పాకిస్థాన్ సార్వభౌమాధికారానికీ, ఆత్మ గౌరవానికీ అమెరికా భంగకరంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కానీ భారత్ విషయంలో చాలా గౌరవ ప్రదమైన రీతిలో వ్యవహరిస్తున్నదనీ, ఇదేమి వివక్ష అని వాపోయారు. తాలిబన్ నేత బిన్‌లాదెన్ ఆచూకీని తెలుసుకోవటం, అతన్ని నిర్మూలించటం విషయంలో అమెరికా కనీస సంప్రదాయాలను పాటించలేదు. పాకిస్థాన్ భూ భాగంలో చేపట్టిన లాదెన్ […]

విధాత: ఉగ్రవాదంపై పోరులో అమెరికా చేతిలో పాకిస్థాన్ అద్దె తుపాకీ మాత్రమేనని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే పేరుతో పాకిస్థాన్ సార్వభౌమాధికారానికీ, ఆత్మ గౌరవానికీ అమెరికా భంగకరంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కానీ భారత్ విషయంలో చాలా గౌరవ ప్రదమైన రీతిలో వ్యవహరిస్తున్నదనీ, ఇదేమి వివక్ష అని వాపోయారు.
తాలిబన్ నేత బిన్‌లాదెన్ ఆచూకీని తెలుసుకోవటం, అతన్ని నిర్మూలించటం విషయంలో అమెరికా కనీస సంప్రదాయాలను పాటించలేదు. పాకిస్థాన్ భూ భాగంలో చేపట్టిన లాదెన్ ఆపరేషన్ విషయం పాక్‌కు ఏమాత్రం తెలియకుండా అమెరికా చేసింది. ఒక సార్వభౌమ దేశ భూ భాగంలో పరాయి దేశం ఏం చేయాలన్నా, ఆ దేశ అనుమతి తప్పని సరి. స్థానిక ప్రభుత్వం, పోలీసు, మిలటరీ సాయంతోనే దాడి లాంటి ఆపరేషన్ చేపట్టాలి.
అంతర్జాతీయ న్యాయ సూత్రాలు కూడా ఇదే చెప్తున్నాయి. అయినా అమెరికా ఇవేవీ పట్టించుకోకుండా పాకిస్థాన్‌కు తెలియకుండా కమాండో అపరేషన్ చేపట్టి బిన్ లాదెన్‌ను మట్టుపెట్టింది. అంతర్జాతీయ ఉగ్రవాది లాదెన్‌పై చర్యను ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని అన్ని దేశాలు గుర్తించి గౌరవించాలని ఇమ్రాన్ కోరారు. అప్పుడు మాత్రమే సభ్య దేశాల మధ్య గౌరవప్రదమైన విశ్వసనీయ సంబంధాలు నెలకొంటాయని అన్నారు.
