- ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు
- విచారణలోనే వాస్తవాలు బయటపడతాయి
- పేపర్ లీకేజీ కేసులో A2 నిందితుడిగా రాజశేఖర్
- తల్లిదండ్రులు వసంత, అంజిరెడ్డి ఆవేదన
విధాత, కరీంనగర్ బ్యూరో: “మా కుమారుడికి ఏ పాపం తెలియదు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలో అతని పాత్ర ఇసుమంతైనా లేదు.. అకారణంగా మా కుమారున్ని ఈ కేసులో కావాలనే ఇరికించారు”
అంటూ పేపర్ లీకేజీ కేసులో సహ నిందితుడైన అట్ల రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు వసంత, అంజిరెడ్డి
ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలియగానే హైదరాబాద్ వెళ్ళాం…”కోర్టులో కలిసినప్పుడు
తమ కుమారుడు తాను ఎలాంటి తప్పు చేయలేదని మాతో చెప్పాడు” అని విచారణలోనే వాస్తవాలన్నీ బయటపడతాయని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో A2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి. గ్రామానికి చెందిన వసంత, రాజిరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. అంజిరెడ్డి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండగా, ఆయన సతీమణి వసంత అంగన్వాడి టీచర్‌గా పని చేస్తున్నారు. పదేళ్ల క్రితమే గ్రామంలో ఇల్లు కట్టుకున్న వీళ్ళు సాధారణ జీవితం గడుపుతున్నారు.
రాజశేఖర్ రెడ్డి గతంలో కొంతకాలం ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసి వచ్చి హైదరాబాద్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. ఈయన సోదరి కూడా హైదరాబాద్‌లో ఐటీ రంగంలోనే స్థిరపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ.. తదనంతరం వెలువడుతున్న వదంతుల నేపథ్యంలో వసంత, అంజిరెడ్డి దంపతులు స్పందించారు.
‘తమ కుమారుడు జీవితంలో ఎదుటివారికి ఎన్నడూ అన్యాయం చేయలేదని’ తమకు ఎక్కడా ఆస్తులు కూడా లేవని వారు స్పష్టం చేశారు. గత ఆదివారం ఇంటికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్నందున తాను తప్పక విధులకు వెళ్లాలని చెప్పి వెళ్లిపోయాడని.. మరో రెండు రోజుల్లోనే ఆయన అరెస్టు వార్త తెలిసిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో
తనకు ఏమీ తెలియదని, ఏం అర్థం కావడం లేదని తమతో అన్నాడన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్టుగా రాజశేఖర్‌కు ఏ పార్టీతో సంబంధం లేదని
వారన్నారు. పిల్లలకు ఉద్యోగాలు లేనప్పుడే తాము ఇల్లు కట్టుకున్నామని, అంతకు మించి
ఇంకా ఎలాంటి ఆస్తులు లేవన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతం జగిత్యాల జిల్లాతో ముడిపడి ఉందన్న విషయం తెలియగానే, జిల్లా వాసులు అవాక్కయ్యారు.
8 ఏళ్లుగా టిఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్ రెడ్డి పై ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు. కానీ అనూహ్యంగా పేపర్ లీకేజీ కేసులో ఆయనను భాగస్వామ్యం చేస్తూ పోలీసులు అరెస్ట్ చేయడం, జిల్లాలో సంచలనానికి కారణమైంది. గల్ఫ్ దేశాలలో ఉద్యోగం చేసే సమయంలో కానీ, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సందర్భాలలో కానీ రాజశేఖర్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎక్కడా రికార్డుల్లో లేవు. అలాంటప్పుడు ఆయన ఈ కేసులో ఎందుకు ఇరుక్కుపోయినట్టని స్థానికులు చర్చించుకుంటున్నారు.